ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని (దేవుణ్ణి) చూసినట్టే!

✝ CHRIST TEMPLE-PRODDATUR

Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu

ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని (దేవుణ్ణి) చూసినట్టే!

❇ ఫిలిప్పు యేసుతో౼"ప్రభువా, తండ్రి(తండ్రియైన దేవుణ్ణి)ని మాకు చూపించు. అది మాకు చాలు"

యేసు అతనితో౼"ఫిలిప్పూ, ఇంత కాలం నేను మీతో ఉన్నానే, అయినా నేను నీకు తెలియదా? ఎవరైనా నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే! 'తండ్రిని చూపించు' అని నువ్వు ఎలా అంటున్నావు? 'నేను తండ్రిలో, తండ్రి నాలో ఉన్నాడు' అని నువ్వు నమ్మడంలేదా? నేను మీతో చెపుతూ ఉన్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు గాని నాలో నివాసం చేస్తున్న తండ్రి ఈ పనులు జరిగిస్తూ ఉన్నాడు.

...తండ్రి నా పేరిట పంపనున్న ఆదరణకర్త, అంటే పవిత్రాత్మ, మీకు సహాయం చెయ్యటానికి వస్తాడు. ఆయన మీకు అన్నీ బోధిస్తాడు. నేను చెప్పిన వన్నీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన తనంతట తానే ఏమీ చెప్పడు. ఏవైతే తండ్రి దగ్గర వింటాడో అవే చెపుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు"
(యోహా 14:8-10,26; 16:13) ❇

■ దేవదూత క్రీస్తు పుట్టకమునుపు ఆయన పేరును (ప్రవచనాల ప్రకారం) "ఇమ్మానుయేలు" గా పిలిచాడు. అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్ధం.

దేవుని యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తులో నివసిస్తుంది. క్రీస్తులోని దైవత్వాన్ని గుర్తుపట్టి, ఆయన సహవాసంలోకి వచ్చిన వారంతా తండ్రియైన దేవుణ్ని హత్తుకున్నవారే! ఆయన తమను విడచి తిరిగి పరలోకం వెళ్లబోతున్నా డని శిష్యులు తెల్సుకొని కంగారుపడ్డారు. అప్పుడు ఆయన వారికి ఆదరణ కర్త, సత్య స్వరూపియైన(పరిశుద్ధాత్ముని) గూర్చిన వాగ్దానంతో బలపరచాడు.ఆయన చేసిన కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలను చేయగలరని చెప్పాడు.

■ క్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు ఒక సమయంలో ఒకే చోట మాత్రమే ఉన్నాడు. కానీ ఆయన పరలోకం వెళ్లిన తర్వాత అంతటా ఉండేట్లు ఆత్మరూపిగా క్రీస్తు ఆత్మను(పరిశుద్ధాత్ముణ్ని) పంపాడు. క్రీస్తు తండ్రియైన దేవుణ్ని చూపుతూ-తన స్వంతగా ఏమి చెయ్యకుండా ఉన్నట్లు, పరిశుద్ధాత్ముడు కూడా క్రీస్తును (మాటలను)చూపుతూ, ఆయన్ను ఘనపరుస్తాడు, కానీ తనంతట తానేమీ భోధించలేదు. క్రీస్తును అంటే తండ్రినే పరిశుద్ధాత్మ చూపుతాడు. నేడు "దేవుని తోడు" పరిశుద్ధాత్ముని ద్వారా మన హృదయాల్లోనే నివసిస్తుంది. క్రీస్తు భూమిపై ఉన్నప్పుడు క్రీస్తుకు వేరుగా, పాత నిబంధనలో మనం చూసినట్లుగా ప్రవక్తల ద్వారా, సూచక క్రియల ద్వారా తండ్రి మాట్లాడలేదు గాని, 'క్రీస్తు' ద్వారానే మాట్లాడాడు. అంటే క్రియాశీలత(active part) క్రీస్తు ద్వారానే జరిగింది. అలానే నేడు క్రియాశీలమైన పరిచర్య క్రీస్తు యేసునందు, పరిశుద్ధాత్ముని ద్వారానే జరుగుతుంది.

■ పెంతుకోస్తూ దినం నుండి దేవుని ఆత్మ వారిని నడపటం స్పష్టంగా చూస్తాము. నేడు దేవుని తోడు పరిశుద్ధాత్ముని ద్వారా మనలో జరిగేటట్లు తండ్రియైన దేవుడు నియమించాడు. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు (ఆధీనంలోకి వెళ్ళినప్పుడు) శిష్యులు శక్తితో నింపబడి కొత్త వ్యక్తులుగా మారిపోయారు. ఒకరి కంటే ఒకరు గొప్ప అని తగువులాడుకున్న వారు సహోదర ఐక్యత కలిగి ఏకమనస్కులయ్యారు. భూసంభంధులుగా మాట్లాడిన వారు ఆధ్యాత్మికమైన వ్యక్తులుగా మారారు. సామాన్యులు, బలహీనులైన వారిలోకి ఒక క్రొత్త శక్తి అదనంగా వచ్చినట్లు కనబడ్డారు.బలహీనులైన మనుష్యులకు దేవుడు అందించిన కృప క్రీస్తు ఆత్మ. క్రీస్తు ఏ ఆత్మ మూలంగా లేపబడ్డాడో, ఎండిన ఎముకలను ఎవరి మూలంగా జీవాత్మలతో బ్రతికించగలడని వాక్యం చెప్తుందో, ఆ ఆత్మే మనకు సహాయకునిగా నేడు ఈ క్రొత్తనిభంధనలో ఉన్నాడు. జయించలేని బలహీనతలకి, నిస్సారమైన భక్తికి జీవం పోసేది ఆయనే! వాక్యం అనే విత్తనానికి ఫలించునట్లుగా ఊపిరి పొసే వర్షం పరిశుద్దాత్ముడు. ఆయనపై పరిపూర్ణంగా ఆధారపడకుండా చేసేది మన సొంత శక్తే అవుతుంది. కావున మనం పూర్తిగా దేవుని చిత్తానికి లోబడి నడుచుకొందాం. "పరిశుద్ధాత్ముడు" మనల్ని నడిపించును గాక. ఆమెన్.

CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661

Comments