✝ CHRIST TEMPLE-PRODDATUR
Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu
ఒక వివాహం
మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యోహాను సువార్త 2:1-11
❇ గలిలయ ప్రాంతంలో కానా అనే ఊరిలో పెళ్ళికి యేసుని, ఆయన తల్లిని, ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు. ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది.
యేసు తల్లి ఆయనతో౼“వీరి దగ్గర ఇక ద్రాక్షారసం అయిపోయింది” అంది.
యేసు ఆమెతో౼“అమ్మా, నీతో నాకేమి పని? నా సమయం ఇంకా రాలేదు” ఆయన తల్లి పనివారితో౼“మీతో ఆయన చెప్పినది చేయండి” అంది.
అక్కడ ఆరు రాతి బానలు ఉన్నాయి.
యేసు పనివారితో౼“ఈ బానల నిండా నీళ్లు పోయండి” అన్నాడు. అంచుల వరకు వారు నీళ్ళు నింపారు. అప్పుడాయన వారితో౼“ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరికి తీసుకు వెళ్ళండి” అన్నాడు. అలాగే వారు తీసుకువెళ్ళారు. ద్రాక్షరసంగా మారిన ఆ నీరు గురించి ఆ పనివారికి మాత్రమే తెలుసు. విందు ప్రధానికి తెలియదు. అతడు దానిని రుచి చూచి పెండ్లి కొడుకును పిలిచి౼“ప్రతి ఒక్కరూ మొదట్లోనే మంచి ద్రాక్షరసం పోస్తారు.ఆ తర్వాత నాసిరకంది పోస్తారు. మీరైతే ఇప్పటివరకు మంచి ద్రాక్షరసమే ఉంచారు” అన్నాడు ❇
■ మొదట ద్రాక్షారసం మనుష్యుల చేత తయారు చేయబడినదైతే, రెండవది దేవుని చేత చేయబడినది. ఖచ్చితంగా రెండవదే శ్రేష్ఠమైన ద్రాక్షారసమై ఉండి ఉంటుంది(త్రాగిన వెంటనే విందు ప్రధాని పెండ్లి కుమారుని కలిశాడు). మొదటి ద్రాక్షరసం దేవుని ప్రమేయం లేకుండా మానవుని స్వనీతికి గుర్తుగా ఉంది. 'నీరు'.. రుచిలేని జీవితానికి, మనుష్యల చేత అంగీకరించబడని పాపులకు, అల్పులుగా పిలవబడే బలహీనులకు గుర్తుగా ఉంది. అలాంటి వారికి క్రీస్తు దగ్గర గొప్ప నిరీక్షణ ఉంది(నిజానికి భూమిపై బలవంతుడు లేడు! వేషధారులు, స్వనీతిపరులు మినహా..యధార్థవంతులంతా తాము దేవుని యెదుట బలహీనులమని వారు ఒప్పుకుంటారు). ఇది క్రీస్తు ద్వారా, ఆయన కనికరం వల్ల మనకు ఇవ్వబడిన ఉచితమైన నీతి. దేవుని చేత మార్చబడే శ్రేష్ఠమైన జీవితం, అంతరంగంలో నుండి శుద్ధికరిస్తుంది. మనుష్యుల యెదుట కాక, దేవుని యెదుటే జీవించే జీవితం.
■ఒకవేళ దాక్షారసం అయిపోక పోతే(కొరత లేకపోతే) క్రీస్తు అద్భుత శక్తి అవసరం ఉండేది కాదు! అలాగే మన జీవితంలో కొదువలు(సమస్యలు/బలహీనతలు) ఉండటం మన మంచికే! దేవుని శక్తి మీద ఆధారపడి, ఆయన బలాన్ని మన జీవితంలో అనుభవపూర్వకంగా తెల్సుకోవడానికి అవి చక్కటి ద్వారాలు. ఆధ్యాత్మిక అవగాహనలో ఎదుగుతున్న ప్రతి విశ్వాసి తెల్సుకోవాల్సిన సత్యం ఇది! ఏ బలహీనతల్ని గూర్చి కృంగిపోవాల్సిన అవసరం లేదు గానీ, మనకు మరి యెక్కువగా దేవుని కృప అవసరమని గ్రహించి, దృఢ విశ్వాసంతో ఆపేక్షిస్తూ, క్రీస్తు కృపలో నిలకడగా ఉండాలి. ఎక్కడ బంధకాలు బలంగా ఉంటాయో అక్కడ క్రీస్తు కృప మరెక్కువ బలంగా పని చేస్తుంది. విశ్వాసం దేవుని శక్తిని మానవునిలోకి ప్రవేశింపజేస్తుంది. మనల్ని జయజీవితంలోకి నడిపేది దేవుని బలాన్ని నమ్మే దృఢ విశ్వాసమే! ఆమెన్.
CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661
Comments