CHRIST TEMPLE-PRODDATUR
Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu
దేవుడు ఎవరి పక్షాన నిలుస్తాడు?
❇ యెహోషువ యెరికో దగ్గర ఉన్నప్పుడు అతడు తలెత్తి చూశాడు. అతనికి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ మనుషుడు కత్తి దూసి చేతపట్టుకొని ఉన్నాడు. యెహోషువ ఆయన దగ్గరికి వచ్చి-“నీవు మా ప్రజల పక్షమా, లేక నీవు మా శత్రువర్గం వాడివా?” అని అడిగాడు.
“కాదు! యెహోవా సైన్యానికి అధిపతిగా నేనిప్పుడు వచ్చాను” అని ఆయన జవాబిచ్చాడు. యెహోషువ ఆయనను గౌరవిస్తు సాష్టాంగపడి౼“ప్రభూ! తమ దాసుడైన నాకు ఏమి సెలవిస్తున్నారు?” అని అడిగాడు.
యెహోవా సైన్యాధిపతి యెహోషువతో౼“నీవు నిలబడ్డ ఈ స్థలం పవిత్రం గనుక నీ కాళ్ళనుంచి చెప్పులు తీసివెయ్యి” అన్నాడు. యెహోషువ అలా చేశాడు ❇
దేవుడు ఎవరి పక్షాన నిలుస్తాడు?
■ దేవుని సర్వ సైన్యాలు(దేవదూతలు) తమకు నచ్చిన పని తాము చేసుకుపోరు గాని దేవుని ఆదేశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన ఏం చెప్తే అదే చేశారు. కొద్దివారికేమి, గొప్పవారికేమి దేవుడు చెప్పమన్న వార్తను మోసుకుపోయ్యారు, దేవుని ప్రజలకు సహాయకులుగా నిలిచారు. యుద్దాలు చేశారు, రక్షకులుగా నిలిచారు, ఓదార్చారు-బలపర్చారు, పరిశుద్ధులకు పరిచర్య చేశారు. ఐతే వారు దేవుడు సెలవివ్వకుండా ఏ ఒక్క పని చెయ్యరు. ఆ విధంగా వారు దేవుని పక్షం ఉన్నారు కనుకనే దేవుడు వారి పక్షం ఉంటాడు(అలా నిలువని అపవాదిని దేవుడు త్రోసివేశాడు). మనం మన సొంత ఆలోచనల ప్రకారం ప్రవర్తిస్తూ, దేవుడు మన పక్షం ఉండాలని తలంచుతాము. ఇది సాధ్యపడదు. మొదట మనం దేవుని వైపుకు వచ్చి ఆయన పక్షం చేరాల్సిన వారము. అంతే కానీ మనం అలా నిలవడానికే ఇష్టపడకుండా, దేవుడే మన పక్షం నిలవాలని కోరకూడదు. ఆయన ఉండడు.
■ నీవు దేవుని పక్షానికి వస్తే౼పరిశుద్ధుడైన దేవున్ని సమీపించిన నీవు, ఆయనలో నిన్ను నీవు చూసుకుంటావు. అప్పుడు వెంటనే మనం చెయ్యవల్సిన పని, మనం మన అపవిత్రతను విడచి పెట్టడం. అప్పుడు మాత్రమే ఆయన సన్నిధిలో నిలువగలవు. ఆయన గొప్పవాడుగా(పరిశుద్ధునిగా), మనం ఆయన ముందు అల్పమైన వారిమిగా ఉంటాము. అది సరైనదే! ఆయన మన సృష్టికర్తయైన్నాడు, మనం ఆయన చేతి పనియైయున్నాము(కీర్త 100:3; ఎఫె 4:6). వాక్యం మన తలలపై ఉండి అధికారం చేస్తూ, ఎల్లప్పుడూ మనల్ని యెలాలి. మనం తల వంచి ఆయన పరిశుద్ధ మాటలకు దాసోహమవ్వాలి. ఇది ఏమి తెలియజేస్తుంది? 'నాది చెడిపోయి, నశించుపోవునట్టి పాపపు స్వభావం, దేవుని వాక్యమే నన్ను తిన్నని నీతిమార్గంలోకి నడుపుతుంది. కనుక నాపై నా దేవుని అధికారం ఎల్లప్పుడూ అవసరం' అని తెలియజేస్తుంది.
■ ఎన్నడూ.. ఎప్పుడూ కూడా... మనం చేస్తున్న పనులకు వాక్య సమర్దన (biblical support) కోసం వెతకూడదు. అప్పుడు ఖచ్చితంగా మనల్ని సమర్ధించు కోవడానికి వాక్యాలు దొరుకుతాయి. మన ప్రతి తప్పును సమర్ధించుకునే వాక్యాలు బైబిల్ లో దొరుకుతాయి (ఇలాంటి వారికి సాతాను మిక్కిలి సహాయకునిగా నిలుస్తాడు. సామె 14:12). ఆ మాటల ద్వారా మన స్వయాన్ని తృపి పరచుకోవచ్చు కాని చివరికి భీకరంగా మోసపోతాము. కారణం!వాక్యం పై నీవు అధికారం చెయ్యాలని చేస్తున్నావు. నీకు దేవుని మాటకు లోబడటం ఇష్టం లేక, నీకు నచ్చినట్లుగా మలచుకోవాలని ఆత్రపడ్తున్నావు. దేవుడు కూడా అలాంటి వారిని మోసాన్ని నమ్మునట్లుగా అపవిత్రతకు అప్పగిస్తాడు (2థెస్స 2:11,12; రోమా 1:28). ఈ మాటలు చదువుతున్న వారిలో ఇలాంటి వారు ఉండొచ్చు. ఇకనూ నీ చెడిన మనస్సు పక్షానే నీవుండి, దేవుణ్ని నీతో ఉండమని పిలువకు! నీవు దేవుని పక్షాన నిలిస్తే, దైవ పరిశుద్ధతలో పాలినవాడవై ఉంటావు.
◆ దేవుని వాక్యంతో మన పనులను సరి చూసుకోవడం వేరు౼సమర్ధన కోసం వెతకడం వేరు; సరి చూసుకోవడంలో౼'సరిదిద్దుకునే మనస్సు ఉంటుంది'. సమర్ధనలో౼'భ్రష్టస్వభావాన్ని విడిచి పెట్టడానికి ఇష్టపడని మనస్సు ఉంటుంది'.
CHRIST TEMPLE-PRODDATUR
Comments