✝ CHRIST TEMPLE-PRODDATUR
Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu
ఇక ఏ విషయం గూర్చి దుఃఖపడాల్సిన అవసరం లేదు
❇ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటితో వచ్చి షోమ్రోన్ను పట్టణాన్ని ముట్టడించాడు. అప్పుడు షోమ్రోనులో తీవ్రమైన కరవు సంభవించింది. ఆ నగర బయట, ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు. వారు ఒకడితో ఒకడు౼
"మనం నగరంలోకి వెళ్లినా కరువు వల్ల చస్తాం! లేక ఇక్కడే కూర్చునివున్నా చస్తాం! గనుక మనం ఇప్పుడు సిరియనుల యుద్ధ శిబిరానికి వెళదాం పదండి! ఒకవేళ వాళ్ళు మనల్ని బ్రతకనిస్తే బ్రతుకుతాం! చంపితే చస్తాం!" అని చెప్పుకొన్నారు.
ఐతే అప్పటికే దేవుడు సిరియా సైన్యానికి, రథాలూ-గుర్రాల చప్పుడు వినిపించేలా చేశాడు గనుక ఇశ్రాయేలీయులు హిత్తియ రాజుల్నీ, ఐగుప్తు రాజుల్నీ సహాయంగా పిలుచుకొని పెద్ద సైన్యంతో దాడికి దిగారనుకొని అక్కడ నుండి ఉన్నపాటున పారిపోయారు. ఆ కుష్ఠురోగులు శిబిరం ప్రవేశించి సిరియనులు పారిపోయ్యారని తెల్సుకొని, ఆకలితో ఉన్నందున వారి గుడారాల్లోకి చొరబడి, తిని త్రాగారు. అక్కడనుంచి వెండి, బంగారం, దుస్తులు ఎత్తుకుపోయి వేరే చోట దాచారు.
అప్పుడు వారు ఒకడితో ఒకడు౼"మనం చేసేది మంచి పని కాదు. ఈ రోజు శుభదినం. కానీ మనం ఎవరికీ చెప్పడం లేదు. మనం వెళ్ళి రాజభవనంలో ఈ విషయం తెలియజేద్దాం!" అని చెప్పుకొన్నారు. ❇
■ తీవ్రమైన కరవుతో భాధపడుతున్న షోమ్రోను నగర ప్రజలకు౼'శత్రువులు పారిపోయ్యారని,ఇంకా కరవుతో భాధపడాల్సిన అవసరం లేదని' తెలియరాలేదు. కనుకనే ఇంకా ఆకలితో అలమటించారు. ఆ విషయం మొదట తెల్సుకున్న కుష్ఠురోగులు ఆ శుభవార్తను చెప్పకుండా ఉండలేకపోయ్యారు. వారి కడుపు నిండాక ఇకను స్వార్ధంగా ప్రవర్తించ లేకపోయ్యారు.
■ స్వభావసిద్ధంగానే శరీరంలో ఉన్న పాపపు నైజం(ఏలుబడి) క్రింద ఉన్న మానవాళికి, "దేవుని నీతి"(దేవుని ఆజ్ఞలు) మనల్ని శిక్షార్హులుగా న్యాయతీర్పును ఇస్తుండగా, దేవుడు తన మహా కనికరాన్ని బట్టి ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపర్చాడు. మనకు వ్యతిరేకంగా రాసి ఉన్న మన రుణపత్రాన్నీ(పాపాల list ను),దానికి సంబంధించిన నియమ నిబంధనల్నీ క్రీస్తు తుడిచివేశాడు. ఆయన వాటన్నిటినీ తీసివేసి మేకులతో సిలువకు కొట్టాడు. నీ పక్షాన(నా పక్షాన) పాపపు వెలను సిలువలో చెల్లించాడు. పాపాన్ని, దురాత్మ సమూహాన్ని సిలువలో ఓడించి,అన్ని అధికారాల కన్నా పైగా హెచ్చించబడ్డాడు. ఇక మనిషి యొక్క ఆత్మీయ౼భౌతిక, ప్రతి సమస్యకు సమాధానంగా దేవుడు క్రీస్తును నిలిపాడు. క్రీస్తు అనే రక్షకునిలో సర్వ సంపూర్ణత నివసిస్తుంది.ఆయన తోడు ప్రతి మనిషికి ఉన్నతమైన నిరీక్షణను కలిగిస్తుంది. ఇక ఏ విషయం గూర్చి దుఃఖపడాల్సిన అవసరం లేదు(ఫిలిప్పీ 4:4).
■ ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు౼"ఈ అనుభవం కలిగిన మీరు..సర్వ సృష్టికి వెళ్ళండి!ఈ శుభవార్తను చెప్పండి!క్రీస్తు అనే రక్షకుడ్ని దేవుడు వారికిచ్చాడని చెప్పండి!". నిరీక్షణ లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికి,మోసకరమైన/ వ్యర్ధమైన వాటి వెనుక పరుగులేడుతున్న వారికి దేవుడు అనుగ్రహించిన రక్షణను గూర్చి చెప్పండి! కుష్ఠురోగులు మౌనంగా ఉండలేక పోయ్యారు. మరి "ఇంత గొప్ప రక్షణ" అని దేవునిచే పిలువబడుతున్న, నిత్యజీవం గూర్చిన ఈ శుభవార్తను గూర్చి మౌనంగా ఎలా ఉండగలం!మన ఆకలి తీర్చిన దేవుని గూర్చి, ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు చెప్పకుండా ఎలా ఉండగలం? ఇది దేవుని ఆజ్ఞ కాదా! హల్లెలూయ.
CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661
Comments