🕎 CHRIST TEMPLE-PRODDATUR
Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu
విలాసవంతమైన జీవితం కోసం
✴️సొలొమోను ముసలివాడయిన తరువాత అతడి భార్యలు అతడి హృదయాన్ని ఇతర దేవుళ్ళవైపు మళ్ళించారు. అతడి తండ్రియైన దావీదు వలె తన దేవుడైన యెహోవాను మనస్పూర్తిగా అనుసరించలేదు... సొలొమోను మోయాబీయుల ఘోరమైన కెమోషు దేవుడికీ, అమ్మోనువాళ్ళ భయానక విగ్రహమైన మొలెకు దేవునికీ యెరూషలేముకు ఎదురుగా ఉన్న కొండమీద ఎత్తయిన పూజాస్థలాలను కట్టించాడు. ఇతర దేశాలకు చెందిన తన భార్యల కోసం సొలొమోను ఎత్తయిన ఆ పూజా స్థలాలను కట్టించాడు.
సొలొమోనుకు దేవుడు రెండు సార్లు ప్రత్యక్షమై హెచ్చరించాడు. అయినా ఆయన ఆజ్ఞాపించినట్టు సొలొమోను ప్రవర్తించలేదు, దేవున్నుండి దూరమయ్యాడు. కాబట్టి దేవుడు సొలొమోను మీద కోపగించి౼"నీవు నా నిబంధనను నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడాలను అనుసరించుటకు ఇష్టపడలేదు గనుక నీ రాజ్యాన్ని నీ నుండి వేరు చేస్తానని నిశ్చయంగా చెప్తున్నాను.దానిని నీ సేవకునికి ఇస్తాను.." అన్నాడు (1రాజు 11:4-11) ✴️
■ సొలొమోను గొప్ప జ్ఞానవంతుడు. అతని జ్ఞానం చొప్పున సమస్త వైభవాన్ని, విలాసవంతమైన జీవితం కోసం కావాల్సిన ప్రతి ఏర్పాటును సిద్ధపర్చుకున్నాడు. ఇతర రాజులు సైతం ఆశ్చర్యపోయే విధంగా రాజ్యాన్ని, ఆలయాన్ని కట్టించాడు. చివరికి డాలులు, కేడెములను సైతం బంగారంతో తయారు చేయించాడు. ఇక వెండిని రాళ్లను వాడినట్లు వాడారు. అలా సొలొమోను తన జ్ఞానం చొప్పున రాజ్యాన్ని సకల ఐశ్వర్యాలతో నింపాడు (1రాజు 4:29-34). సొలొమోను 1000 మంది భార్యలను పెండ్లి చేసుకున్నాడు. వారిలో 700 మంది రాజకుమార్తెలు. సొలొమోను ఇహలోక జ్ఞానంతో ఇతర రాజ్యాలతో సన్నిహిత సంభంధాలను గూర్చి,తన కామాతురత గూర్చి ఆలోచించుకున్నాడు, గానీ అతని ఆత్మకు పొంచివున్న ముప్పును గ్రహించలేకపోయ్యాడు. యెరూషలేములో దేవుని ఆలయాన్ని నిర్మించడం కోసం దూరప్రాంతాల నుండి కావాల్సిన వనరులను, పనివారిని తీసుకొచ్చి అత్యంత వైభవంగా కట్టించాడు. ఎక్కడా రాజీపడకుండా కట్టాడు. అతను ప్రార్ధించగా దేవుడు తన మహిమను ఆలయంలోకి పంపాడు. కానీ..
■ ధర్మశాస్త్రాన్ని హత్తుకొని జీవించిన అదే వ్యక్తి సజీవుడగు దేవుణ్ని విడచి విగ్రహాలకు మ్రోక్కాడు. వాటికి పూజా మందిరాలు కట్టించాడు. పూర్ణ ఆసక్తితో నిజ దేవుని మందిరాన్ని కట్టిన ఆ వ్యక్తే, తన హృదయంలో దేవుని మాటలను లెక్కచెయ్యలేదు. ఆత్మీయ జ్ఞానం ఇహలోక జ్ఞానానికి వేరుగా ఉంటుంది. అతని తండ్రియైన దావీదుకు ఇటువంటి జ్ఞానం తెలియదు గాని, అతడు ఆత్మీయ జ్ఞానం కలవాడు. అనగా దేవుని సహవాసంలో బ్రతుకుతూ, ఆయన ఎలాంటి వాడో అనుభపూర్వకంగా తెల్సుకుంటూ, దేవునికి లోబడి జీవించే జ్ఞానం. దేవుని మనస్సు దేవుని చేత తెలియజేయబడటం. ఒక విశ్వాసి దిగజారిపోవడం సాధ్యమే!మునుపు చూపిన ఆసక్తి, ప్రేమ, తగ్గింపు, సహనం సన్నగిల్లిపోయి నేడు పూర్తి విరుద్దంగా ప్రవర్తించవచ్చు. మనం సొలొమోను వలె విగ్రహ పూజలు చేయకపోవచ్చు, కానీ నేడు దేవుని ఆలయం మన దేహమే(హృదయం)! ఆ ఆలయాన్ని లోకసంభంధమైన వాటితో నెమ్మదిగా నింపుకొవటమే విగ్రహారాధన!
■ సొలొమోను భార్యలను పెండ్లి చేసుకుటున్నప్పుడు ఇలాంటి పరిస్థితికి వెళ్తానని ఊహించివుండడు. అలాగే ఒక నిర్లక్ష్య(సమర్ధన) పాపం మనల్ని కూడా ఆత్మీయ భ్రష్టత్వానికి తీసుకొని వెళ్ళగలదు. కనుకనే క్రీస్తు, అపొస్తలులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండమని హెచ్చరించారు. క్రీస్తులోని తిన్నని భక్తి నుండి తొలిగింప జేయడానికి మన శత్రువు ఆసక్తితో కాచుకొని ఉన్నాడు. శోధన ఎటువైపు నుండియైన రావచ్చును మన రక్షకుడైన క్రీస్తు మనల్ని కాపాడగల సమర్థుడు, ఐతే నీవు ఆయనతో నిలిచివుండాలన్న తీర్మానం మాత్రం, సంపూర్తిగా నీ స్వేచ్ఛపైనే ఆధారపడి ఉంటుంది(రక్షణ మాదిరిగానే..రక్షణ కార్యం సిద్ధమే! ఒప్పించడానికి దేవుని ఆత్మ సిద్ధమే! ఐనప్పటికీ స్వేచ్ఛపూర్వకంగా మనుష్యులు అంగీకరించాలి. లేఖనాల్లో దేవుని కృప నుండి తొలగినవారు తమ స్వేచ్ఛలో నుండి దేవుణ్ని విడచిన వారే). స్వేచ్ఛ దేవుడు మనిషికి ఇచ్చిన శక్తివంతమైన లక్షణం. ఆది నుండి నేటి వరకు(ఎప్పటికీ) ఆయన దానిని గౌరవిస్తూనే ఉంటాడు. ఆ స్వేచ్ఛలో నుండే యదార్ధవంతునిగా, లోక స్నేహాన్ని విడచి, సంపూర్ణంగా దేవుణ్ని హత్తుకునే మనస్సుని విడిచిపెట్టక ముందుకు సాగుదాం!
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.
CHRIST TEMPLE-PRODDATUR
Pastor Nakkolla Daniel Balu
+91 8142229661
Comments