🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Welcome to Christ Temple. Our Sunday service at 10:00 am to 1:00 pm.in Proddatur. For more Details : +91 8142229281.
దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నావా?
పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ "ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును అని హెచ్చరిస్తున్నాడు. (1 కొరింథీ 3:16).
ఆ దేవాలయం రాళ్ళతో నిర్మించిన భవనం అనుకోకండి. ఆ దేవాలయం ఏదో కాదు, మన దేహమే దేవుని ఆలయం. మన దేహమే పరిశుద్దాత్మకు ఆలయమై ఉన్నది. ఆ దేహముతో దేవుని మహిమ పరచాలని పౌలు హెచ్చరిస్తున్నాడు (1 కొరింథీ 3:16-17 ; 6:19-20).
ఈ మాటలు పౌలు ప్రత్యేకంగా కొరింథీ సంఘానికి రాయడానికి గల కారణం ఏంటంటే - కొరింథీ సంఘములో కొందరు వ్యభిచారం, జారత్వం, విగ్రహములకు బలి యిచ్చిన వాటిని తినడం, కక్షలు, కలహాలు కలిగి ఉండడం, ఒకరినొకరు ద్వేషించుకోవడంలాంటి పనులు చేస్తున్నారు. (1 కొరింథీ 1:11 ; 6:8 ; 5:1 ; 8:1 ; 10:14-22). దేవుని మహిమపరచాల్సిన శరీరంతో అపవిత్రమయిన పనులు చేస్తూ ఆ శరీరాన్ని పాడు చేస్తున్నారు.
ఈరోజు కూడా అనేకులు తమ శరీరంతో దేవుణ్ణి మహిమపరచకుండా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు. చాలామంది యౌవనస్తులు ఫేస్బుక్ లో, ఇంటర్నెట్ లో పనికిమాలిన పేజెస్ ఓపెన్ చేసి చూడకూడని దృశ్యాలు చూడటం, అతిక్రమ పనులు చేస్తూ తమ శరీరాలను పాడు చేసుకొంటున్నారు. దేవుడ్ని మహిమపరచాల్సిన శరీరంతో పాపిష్టి పనులు చేస్తున్నారు.
తల్లిని తండ్రులను మోసం చేస్తూ ప్రేమ పేరుతో పెళ్లి కాకముందే యిష్టానుసారంగా కలిసి తిరుగుతూ, చేయరాని పనులు చేస్తూ, దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ తమ శరీరాలను పాడు చేసుకుంటున్న యౌవనస్తులు ఎందరో ఉన్నారు.
హెబ్రీయులకు 13:4 - వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.
ఒక పక్క క్రైస్తవులుగా, భక్తిపరులుగా కనపడుతూనే ఫేస్బుక్, వాట్స్ ఆప్ సోషల్ నెట్ వర్క్స్ లో అమ్మాయిలు, అబ్బాయిలు అవధులు దాటి మాట్లాడుకోవడం.... ప్రేమ, స్నేహం పేరుతో అమ్మాయిలను వేధించడం,మోసం చేయడం, ఫొటోస్, నంబర్స్ కోసం వారిని హింసించడం, అత్యాచారాలు చేయడం, యాసిడ్ దాడులు ,, అసహ్యమైన మాట్లడరాని మాటలు మాట్లాడుతూ.. దేవుని నామానికి అవమానం తెస్తున్నవారు కూడా అనేక మంది ఉన్నారు. ఎంత బాధాకరం యిది.
మద్యపానం సేవిస్తూ, సిగరెట్లు కాలుస్తూ, తినరానివి తింటూ, బూతులు మాట్లాడుతూ, ఆదివారం చర్చికి వెళ్లి ప్రార్థన చేస్తారు..తిరిగి అదే రోజు అల్లారితో కూడిన ఆట,పాటల సినిమా హాలు కి వెళ్తారు... క్రమము లేని జీవితము జీవిస్తూ.. దేవుని ఆలయం అయిన తమ శరీరాన్ని పాడు చేస్తున్నవారు మరి కొందరు.
ఈ వాక్యం చదువుతున్న వారిలో కూడా ఎవరైనా ఇలాంటివారు ఉన్నారా? దేవుని ఆలయం అయిన శరీరంతో దేవుని మహిమపరచకుండా పాపిష్టి కార్యాలు చేస్తున్నావా? (గలతీ 5:19-20). అయితే జాగ్రత్తా. యిట్టివారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని, దేవుని రాజ్యానికి వారసులు కాలేరని, వారి అంతం నరకమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
1 కొరింథీయులకు 6:9-10 - అన్యాయస్థులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి; జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగలవారైనను పురుష సంయోగులైనను, దొంగలైనను లోభులైనను త్రాగు బోతులైనను దూషకులైనను దోచుకొనువారైననుదేవుని రాజ్యమునకు వారసులు కానేరరు.
ప్రకటన గ్రంథం 21:8 - పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము."
నీవు బహిరంగంగా అయినా, రహస్యంగా అయినా చేసే ప్రతి పాపిష్టి పనిని దేవుడు చూస్తున్నాడు అని మర్చిపోకు, శిక్షిస్తాడని గుర్తుంచుకో. (యిర్మియా 23:24 ; కీర్తన 139).
నా ప్రియ సహోదరీ, సహోదరుడా ఒకవేళ యింతవరకు నీవు అట్టి జీవితాన్ని జీవిస్తూ ఉంటె ఈరోజు మారుమనసు పొంది నీ జీవితం మార్చుకో. దేవుని ఆలయాన్ని (నీ శరీరాన్ని) పాడుచేసే పనులు చేయకండి. పరిశుద్దంగా జీవించండి.
మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమునకు అవమానం కలిగించకుండా, మన మరణము వరకు ఆయనను మహిమపరుస్తూ జీవిద్దాము. ఆమేన్.
"మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్దాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి." (1 కొరింథీ 6:19-20).
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.
▪ CHRIST TEMPLE-PRODDATUR ▪
No comments:
Post a Comment