భర్త - భార్యా మాట వినాలా..? వద్దా..?

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Telugu Bible Sermons by Pastor.Nakkolla Daniel Balu

భర్త - భార్యా మాట వినాలా..? వద్దా..?

✴️ అబ్రాముకు అతని భార్యయైన శారయి వల్ల పిల్లలు పుట్టలేదు. ఆమె దగ్గర ఐగుప్తు దేశానికి చెందిన హాగరు అను ఒక దాసి ఉంది.
శారయి అబ్రాముతో౼ "ఇదుగో, యెహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు. నువ్వు నా దాసి దగ్గరికి వెళ్ళు. ఒకవేళ ఆమె ద్వారా నాకు పిల్లలు పుట్టవచ్చేమో" అంది. అబ్రాము శారయి మాట విన్నాడు.(ఆది 16:1,2) ✴️

■ రాహేలు, లేయాలు కూడా సరిగ్గా ఇలాగే యకోబుకు సలహా ఇచ్చారు(ఆది 30:3,9). కానీ దేవుడు వారిని తప్పు పట్టినట్లుగా చూడము. వారి దాసీలకు పుట్టిన పిల్లలను కూడా తక్కిన వారితో సమాన గోత్రాలుగా దేవుడు చేశాడు. ఎందుకంటే అబ్రాము విషయంలో పుట్టబోవు సంతానం గూర్చి స్పష్టమైన దేవుడు వాగ్ధానం ఉంది. అబ్రాము విశ్వాసంతో కనిపెట్టి ఆ వాగ్ధానం పొందుకోవాలి. దేవుని వాక్కు ఎవరికి స్పష్టంగా తెలియజేయబడుతుందో (ప్రత్యక్షత) వారి నుండి దేవుడు ఎక్కువ విధేయతను ఎదురుచూస్తాడు. దేవుడు అబ్రాముతో సంతానం గూర్చి వాగ్దానం(నిబంధన) చేశాడు. సుమారు 10 సం|| ల తర్వాత కూడా పిల్లలు కలుగనందుకు అబ్రాము, అతని భార్యయైన శారయిల విశ్వాసం సన్నగిల్లి పోయింది(ఆది 15:2,16,2). శారయి తనకు ఇక పిల్లలు పుట్టరని దృఢ నిర్ణయానికి వచ్చినదై, అబ్రాముకు పైన చెప్పినట్లుగా సలహా ఇచ్చింది. ఐతే తన భార్య సలహాను దేవుని సన్నిధిలో పెట్టవాల్సింది పోగా ఆమె మాట విన్నాడు. దేవుడు కేంద్రంగా లేని మరియు భార్యకు శిరస్సుగా ఉండని భర్త, దేవుని చిత్తాల నుండి ఆ కుటుంబాలు వైదొలుగుతారు. భార్యను ప్రేమించాలనే ఆజ్ఞ భర్తకు ఇవ్వబడినప్పటికీ, దేవుని స్థానాన్ని ఆమె తీసుకోకూడదు. అనగా

దేవుని మాటను పెడచెవిన పెట్టి ఆమె మాట వింటూ, దానిని ప్రేమ అనుకోవద్దు. మొదటి కుటుంబం ఆవిధంగానే దేవుని శాపాన్ని మూటగట్టుకుంది(ఆది 3:17).

■ దేవుడు కేంద్రంగా మన కుటుంబాలు ఉండాలని ఆశిస్తే, ప్రతి విషయం దేవుని ముందు-ఆయన ఆమోదం కొరకు ఉంచవల్సిన వారము. భార్య సహకారిగా ఇవ్వబడింది. దేవునిలో నుండే భార్యను ప్రేమించాలి. భర్త ఆమె సలహాలను, సూచనలను దేవుని సన్నిధిలో ఉంచాలి(మంచి చెప్పినప్పటికిని). భార్య/భర్త దేవుని వైపు చూడక సాతాను శోధన వల్ల నిరుత్సాహపు మాటలను మాట్లాడితే లేక సొంత జ్ఞానంతో ప్రణాళికలను వేస్తుంటే, భాగస్వామియైన మరొకరు(భార్య/భర్త) దేవుని వైపు చూపాలి. వారి ఆందోళనల నుండి, తొందరపాటు నుండి నిమ్మళ పర్చాలి. దేవుని వాక్యం వైపు చూపి నిరీక్షణతో ధైర్యపర్చాలి. అలా అపవాదికి కుటుంబంలో చొరపడకుండా కాపాడుకోగలం. అబ్రాము చేసిన ఆ తప్పు వలన శరీర సంభంధంగా పుట్టిన మరొక జనాంగం ఉనికిలోకి వచ్చింది. చిన్న తప్పుడు తీర్మానాల యొక్క ఫలితం ఎంతో గొప్ప నష్టాన్ని మిగల్చగలవు.

■ ఆ తర్వాత రోజుల్లో శారా అబ్రాహముకు మరొక సలహా ఇవ్వగా దేవుడే ఆమె మాట వినమని చెప్పాడు (ఆది 21:12). అప్పటికే అబ్రాహాము ఆ పాఠం నేర్చుకున్నాడు. అవును భార్య/భర్త మాటలను దేవుడు ఆమోదించాలి. లేదా అలాకాకుండా ఆయన మరొక వైపు కూడా నడిపించ వచ్చును. తుదకు భర్త కుటుంబం పక్షాన తీర్మానాన్ని తీసుకుంటాడు. కుటుంబం గూర్చిన జవాబుదారీగా పూర్తి బాధ్యతను దేవుని యెదుట భర్త వహిస్తాడు (ఎవ్వరి మీద సాకుగా చూపడానికి దేవుడు అనుమతించడు). ఇది దేవుడు నియమించిన క్రమము. కనుక దేవుని వైపు చూస్తూ మన కుటుంబాలను కట్టుకునే వారముగా ఉండాలి. నా కుటుంబం పరిపూర్ణులమని చెప్పట్లేదు గాని ఆ మార్గంలో ప్రయాణిస్తూ, నేర్చుకుంటున్నామని చెప్తున్నాను.

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

           క్రైస్ట్ టెంపుల్
పాస్టర్. నక్కోళ్ళ.డానియల్ బాలు.
☎ 8142229661
☎ 8142229281

Comments