🕎 CHRIST TEMPLE-PRODDATUR
Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu
ఇష్టానుసారంగా జీవిస్తే ఎలా..?
"ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి... " లూకా సువార్త 16:19 నుండి 31 వరకు.
✴️అప్పుడు ఆ ధనవంతుడు పాతాళంలో యాతనపడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ, అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి౼"తండ్రీ అబ్రాహామూ! నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడిపోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు" అని కేకలు పెట్టాడు
అబ్రాహాము-"నాయనా, గుర్తుందా? నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.."
అప్పుడతడు౼‘అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును వారి దగ్గరకు పంపించమని నిన్ను వేడుకుంటున్నాను’ అన్నాడు.
అబ్రాహాము౼‘వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి’ అన్నాడు.
అతడు౼‘తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలో నుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాపపడతారు’ అన్నాడు. అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’ అన్నాడు ✴️
■ ధనవంతుడు ఎల్లప్పుడూ తన శరీరక సుఖాలపైనే దృష్టి పెట్టాడు. మంచి బట్టలు, సుఖజీవనం, విందులు, విలాసాలు మె||. ఒక్కసారి కూడా తనలో ఉన్న ఆత్మ గురించి, సమస్తానికి మూల కారకుడైన దేవుని గురించి ఆలోచించలేదు. నమ్మకమైన సేవకుడైన ప్రతి వాడూ తన యజమాని మాటకు విధేయులుగా ఉంటారు కదా! ఎందుకంటే అతని ద్వారా పోషించబడుతున్నారు గనుక. అదేవిధంగా సృష్టికర్తయైన దేవుని ద్వారా ఉనికిలోకి వచ్చిన మనమంతా దేవుని మాట వినడానికి, ఆయన అధికారం క్రింద లోబడి జీవించవల్సిన వారము కదా! ధనవంతుడు అన్యాయంగా సంపాదించినట్లు ఏక్కడా చెప్పబడలేదు కానీ దేవుణ్ని విస్మరించి (జీవిత పరమార్థం విడిచి) తనకు ఇష్టమొచ్చినట్లు బ్రతికాడని మాత్రమే వ్రాయబడివుంది. మన జీవితంలో గడిచిపోయే ప్రతి క్షణం, మన సృష్టికర్తను కలుసుకోవడానికి దగ్గరౌతున్నామని గుర్తు చేస్తుంది. అతడు బ్రతికున్న రోజుల్లో దేవుని ప్రవక్తల మాటలు అనేకసార్లు చెవిన పడే ఉంటాయి. తనకు ఇంకా సమయం ఉందనుకుంటూ భ్రమలో జీవించాడు. "నేను ఎవరికి అన్యాయం చెయ్యలేదు, భక్తిగల వంశం(కుటుంబం)లో పుట్టాను, నా క్రింద అనేక మంది సేవకులు బ్రతుకుతున్నారు, నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నన్ను ఎంతో అభిమానిస్తారు" అనుకొని ఉండొచ్చు. ఐతే ఒకడు దేవుని ఏలుబడి క్రింద జీవించడానికి ఇష్టపడక తనకు నచ్చినట్లు బ్రతకడమే పాపం.
■ మీరు చదువుతున్న పై మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనివి. ఇది అబద్దమాడని పుస్తకం. పరదైసు(పరలోకం)-పాతాళం(నరకం) అనేవి రెండు వాస్తవమైన ప్రదేశాలు. దేవుడు వాటిని గూర్చి మనుష్యులకు మరుగు చెయ్యలేదు. దేవుని చేత తరతరాలుగా ఈ మాటలు ప్రకటించబడుతూనే ఉన్నాయి. ఒకసారి ప్రవేశించాక తిరిగి సరిదిద్దుకోలేని, మరళా భూమిపైకి రాని ప్రదేశాలావి. "నేను" అని నువ్వు పరిచయం చేసుకుంటున్నది, నీలో ఉన్న "నీ ఆత్మను" గురించే. ఒకరోజు ఈ శరీరం కనుమరుగు అవుతుంది. "నేను" అనబడే ఆ ఆత్మ దేవుని ముందు నిలుచుంటుంది. ఈ శరీరంతో చేసిన ప్రతి తప్పును దేవుడు విమర్శించే సమయం రాబోతుంది. ఏది శాశ్వితం అంటూ భ్రమ కలిగిస్తుందో, అదే అశాశ్వితమైనది(ఈ లోకం). వీటి గూర్చి నువ్వు వింటున్నావో అవే శాశ్వితమైనవి. ఇవి బైబిలోని పరిశుద్ధుడైన దేవుని మాటలు.
■ నేస్తమా! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను శిక్షించడంలో కంటే క్షమించడంలోనే ఆయన ఆసక్తిని కలిగివున్నాడు. మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఆయన కుమారుడును, మన రక్షకుడైన యేసుపై నీ పాపమంతటిని మోపాడు. సిలువపై ఆయనే నీ పాపాలన్నీ చేసినట్లుగా చూసాడు. న్యాయంగా నీకు రావాల్సిన ఉగ్రతనంతా(శిక్షను) క్రీస్తే భరించునట్లుగా చేసి నిన్ను రక్షించుకోవాలని ఆశించాడు. క్రీస్తు నీ జీవితకాలంలో చేసిన, చెయ్యబోవు ప్రతి పాపానికి రావాల్సిన శిక్షను సంపూర్ణంగా చెల్లించాడు.ఎవరైతే రక్షకుని ఆశ్రయించి, ఆయన్ను అంగీకరిస్తారో వారు క్రీస్తు రెక్కల చాటున దేవుని ఉగ్రత దినమందు దాయబడతారు. తనలో ఉన్న ప్రతి ఒక్కరిని క్రీస్తు కాపాడుకోగల సమర్థుడు. ఈ మాటలు నీవు అంగీకరించి, నిన్ను ఒప్పిస్తున్న దేవుని ఆత్మతో ఏకీభవిస్తే రెప్పపాటున నీ జీవితం(భూమిపై & నిత్యత్వంలో) శాశ్వితంగా మారిపోతుంది. క్రీస్తు వలె నీవు కూడా పరమతండ్రి బిడ్డవౌతావు. లాజరు వలె శ్రమలోను-భాధల్లోనూ, ఏమున్నా-లేకున్నా దేవుణ్ణి కలిగి జీవించగిలిగే నిజమైన జీవితంలోకి, దేవుని ప్రణాళికలను గౌరవించే జీవితంలోకి వస్తావు.
స్నేహితుడా! ఈ మాటలు నీ నిత్యజీవాన్ని నిర్దేశించే మాటలు...
అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.
CHRIST TEMPLE-PRODDATUR
Pastor.N.Daniel Balu
@8142229661
Comments