నీతో స్నేహం

🕎 CHRIST TEMPLE-PRODDATUR

Telugu Bible Sermons by Pastor Nakkolla Daniel Balu

         నీతో స్నేహం

❇ దేవుడు ఇశ్రాయేలీయులతో౼"మహా యెండకు కాలిన అరణ్యములో నీతో స్నేహం చేసిన వాడను నేనే! నేను వారికి ఆహారం ప్రసాదించినప్పుడు వారు తిని తృప్తిపడ్డారు. తృప్తిపడి గర్వించారు.అప్పుడు వారు నన్ను మరచిపోయారు"(హోషేయా 13: 5) ❇

▪ లోకం వారి వైపు చూసినప్పుడు వారిలో ఏ అర్హత కనిపించదు. అలాంటి మనుష్యులతో స్నేహం చెయ్యడానికే దేవుడు ఇష్టపడతాడు. ఏ హృదయానికి ఓదార్పు, జాలి, ప్రేమలు అవసరమౌతాయో వారిని దేవుడు వెతుక్కుంటూ వెళ్తాడు. మన మధ్యలో ఉన్న అత్యంత బలహీనులైన వారి చుట్టూ దేవుని కృప విస్తరించి ఉంటుంది అని కనిపెట్టగలవా? బయటికి కనిపించే చక్కటి విలువలతో ఉంటే మనమేంటి, ఈ లోకం కూడా స్నేహం చేస్తుంది కదా! క్రీస్తు కూడా సుంకరులను,పాపులను, వ్యభిచారులను, కుష్ఠురోగులను, జక్కయ్య వంటి తిరస్కరించబడిన వారిని, చదువులేని జాలరులను, దేవుని పట్ల యదార్థవంతులను, చివరికి సిలువపై ఉన్న నేరస్తున్ని, లోకరీత్యా అల్పులు, హీనులతో కలిసి నడిచాడు, వారితో స్నేహం చేశాడు. క్రీస్తులోని పరిశుద్ధత బలహీనులను అంగీకరిస్తూ, నిరీక్షణనిస్తుంది. పరిసయ్యుల భక్తికి, క్రీస్తుకు ఉన్న తేడా అదే! అర్హతలను బట్టి దేవుడు స్నేహం చేసిన్నట్లేతే, నిన్ను-నన్ను దేవుడు ఎప్పుడో దాటిపోయివుండేవాడు. ఈ విషయంలో నీవు కూడా నాతో ఏకీభవిస్తావనుకుంటున్నాను!

▪ మన రక్షకుడు నడచిన మార్గంలో మనం నడవాలని ఆయన ఆదేశించలేదా? కృపను పొందుకున్నాం! కాబట్టి ఇతరులకు ఇవ్వాల్సిన బద్ధులమైవున్నాము. ఒకవేళ క్రీస్తు మన స్థానంలో జీవిస్తునట్లేతే, మనం నిర్లక్ష్యం చేసిన అనేకులను ఆయన హత్తుకొని ఉండి ఉంటాడు.

▪మనం దోషాలను-బలహీనతలను విశ్లేషించడంలో ప్రావీణులం అవ్వాలని దేవుడు చూడట్లేదు, కానీ యదార్థవంతులైన ప్రతి ఒక్కరికి సహాయకులంగా (క్రీస్తును పోలి) ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. ఇది క్రీస్తు పరిచర్య. 

▪మనం ఇతరుల దోషాలను లోతుగా విశ్లేషించి వెతకడం-పట్టడం, మనస్సులో ఒక స్థిరమైన నిర్ధారణకు రావడమే మన పరిచర్య ఐతే, అది మతసంబంధులైన పరిసయ్యుల పరిచర్య.

▪ ఆయన తన మహా పరిశుద్ధతలో నుండి మనుష్యులకు తీర్పు తీర్చాలను కోవట్లేదు! కానీ ఆ వ్యక్తి స్థానంలో నిలువబడి, విస్తారమైన కృపతో జాలిని నిలిపి, అసహ్యమైన జీవితాన్ని సైతం భరించి, క్షమించి, హత్తుకోవాలనుకుంటాడు (హృదయపూర్వకంగా ఆ అపరాధాన్ని అంగీకరించు వారి విషయం గూర్చి చెప్తున్నాను). విశ్వాసులమైన మన జీవితంలో ఎన్నో సార్లు చేసిన తప్పులనే (బలహీనతలనే) పదే పదే చేసి త్రొటిల్లినప్పుడు దేవుడు మనల్ని హత్తుకోలేదా? వాటిని గుర్తు చేసుకొని ఇప్పుడు ఎదుటి వారిని చూడు, వారి బలహీనతలు ఎంత స్వల్పంగా ఉంటాయో! ఉన్నపాటున (బలహీనతలతోనే) అంగీకరించడం దేవుని లక్షణం.

▪పౌలు-"కాబట్టి బలమైన విశ్వాసం కలిగిన మనం, మనల్ని మనమే సంతోషపెట్టుకోకుండా, విశ్వాసంలో బలహీనుల లోపాలను భరించాలి" (రోమా 15:1)
ఒకడు తను బలవంతుడని భావిస్తే బలహీనుడు మోయ్యలేని భారాన్ని సైతం మోయగలగాలి కదా! లేదంటే వాడు కూడా బలహీనుడని దానర్ధం. అలానే తోటి వ్యక్తులను బలహీనతలతోనే హత్తుకునేవాడే నిజమైన బలవంతుడు. క్రీస్తు బలవంతుడు!

▪ దేవున్నుండి బలం పొందుకొని, లోకం చేత బలహీనులుగా పిలువబడే వారితో స్నేహం చెయ్యడానికి, వారిని వారిగానే అంగీకరిస్తూ, క్రీస్తు పొలికగా మార్చడానికి బలవంతులుగా తయారుచెయ్యడం కోసం, క్రీస్తు మాదిరిని మనలో ధరించడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడు ఆ విధంగా మనల్ని ఆయన కొరకు ఒక రాజ్యంగా కట్టును గాక!

అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక.

CHRIST TEMPLE-PRODDATUR
Pastor.N.Daniel Balu.

Comments