నిజమైన భక్తి 

🕎 CHRIST TEMPLE-PRODDATUR🕎
 

నిజమైన భక్తి 

భక్తి అంటే కొంతమంది గంటలు కొద్ది ప్రార్థన చెయ్యడం, రోజూ బైబిలు చదవడం అనుకుంటారు. మరి కొంతమంది 52 ఆదివారాలు చర్చికి వెళ్ళడం భక్తి అనుకుంటారు. ఇంకొందరు తెలుపు రంగు వస్త్రాలు వేసుకోవడం భక్తి అనుకుంటారు. ఇలా ఒకొక్కరు ఒకో విధంగా అనుకుంటారు. కాని దేవుని దృష్టిలో పవిత్రమైన, నిజమైన భక్తి ఏది? దేవుడు ఎవరిని నిజమైన భక్తులుగా భావిస్తాడు? అందుకు దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. 
యాకోబు 1:27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్నుతాను కాపాడుకొనుటయునే.ఇది దేవుని దృష్టిలో నిజమైన భక్తి.

  1 ) దిక్కు లేని వారికి అనగా అనాధ పిల్లలకు, విధవరాండ్రకు నీ వంతు సహాయం చెయ్యాలి. సంవత్సరంలో మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాము. ఏ రోజు అయినా బీదలకు, అనాధలకు, విధవరాండ్రకు నీ వంతు సహాయం చేయ్యగలిగావా? కనీసం ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచించారా? పుట్టిన రోజు పార్టీలు అని స్నేహితులకు వందలు, వేలు పెట్టి వ్యర్తమైన పార్టీలు ఇస్తున్నారు కాని ఒక్కరికి కూడా సహాయం చెయ్యరు, ఇదేమి భక్తి? మరి కొందరు మమ్మల్ని దేవుడు ఇంతగా దీవించాడు, అంతగా ఆశీర్వదించాడు అని, మా జీవితంలో అనేక మేలులని జరిగించాడని సాక్షాలు చెపుతూ కృతజ్ఞత కూడికల పేరిట బోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. సంతోషమే, అందులో తప్పు లేదు. అయితే ఆ కూడికలో అన్ని ఉన్నవారే తింటున్నారు తప్ప ఏమి లేని వారి ఆకలి మాత్రం తీర్చట్లేదు. ఇంకా అక్కడికి ఎవరైనా బిక్షం అడుక్కోవడానికి వస్తే ఛీ పక్కకి పో అని అసహ్యించుకొంటున్నారు, లేదా చివరకి మిగిలితే పెడతాములే అంటుంటారు. ఎంత దారుణం ఇది..! 
ఇదేనా దేవుని వాక్యం చెప్తుంది? ఇదేనా భక్తి అంటే? ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరుడా అన్ని ఉన్న వాడికి పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని, లేని వాడికి పెట్టడం వలన నువ్వు ధన్యుడవు అవుతావని ప్రభువైన యేసు క్రీస్తు చెప్తున్నాడు (లూక 14:12-14). అలా అని పెళ్లిళ్లకు, ప్రార్థనకు, శుభకార్యాలకు అథిదులుగా వచ్చిన వారికి భోజనం పెట్టకండి అని దేవుని ఉద్దేశ్యం కాదు. బీదలను, విధవరాండ్రను, అనాధ పిల్లలను కూడా జ్ఞాపకం చేస్కొండి వారి ఆకలిని తీర్చండి, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు (మత్తయి 25:40). 

2 ) ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం. అనగా పాపము నీ శరీరముకు అంటకుండా జీవించడం. నీ శరీరము దేవునికి (పరిశుద్ధాత్మకు) ఆలయము అని, ఎలాంటి పాపపు మరకలు అంటకుండా తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది (1 కోరింథి 3:16,17 ; 1 థెస్సలోనికయిలకు 4:4,5). అయితే కొంత మంది ప్రార్థనలు చేస్తుంటారు, వాక్యం చదువుతారు, అయినప్పటికీ వారిలో పరిశుద్ధత కనపడట లేదు, నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారు (ఎఫేసి 5:4, యాకోబు 1:26), అన్ని శరీర కార్యములే చేస్తుంటారు. కారణం దేవుడు అంటే భయం లేకపోవడం. భక్తి మాత్రం ఉంది, కాని అది వ్యర్థమైన భక్తి. అందుకే యేసు క్రీస్తు "ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది, వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అని అంటున్నారు. కారణం వారి హృదయం పాపముతో నిండి ఉండటం. ఈ రోజుల్లో కూడా అనేక మంది ఇలానే ఉన్నారు. ఇహలోక మాలిన్యం అంతా తమ హృదయంలో పెట్టుకుని దేవుని ఆరాధిస్తున్నారు, ఆ భక్తి అంతా వ్యర్థమే.

 నా ప్రియమైన సహోదరుడా, సహొదరీ ఈ లోకం అంతా పాపముతో నిండి ఉన్నది, ఈ పాపిష్టి లోకములో పరిశుద్ధముగా జీవించాలి అంటే పరిశుద్ధాత్ముని సహాయం అవసరం. ఆత్మ చేత శరీర కార్యములను జయించుడి అని వాక్యం సెలవిచ్చుచున్నది (రోమా 8:13). కనుక పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించుడి పరిశుద్ధాత్ముని పొందుకో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడు. గుడ్డిగా నామకార్థముగా కాకుండా ప్రతి దినము ఆశతో, శ్రద్ధతో వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ, నీ పొరుగు వారిని ప్రేమించు, ఆపదలో ఉన్న వారికి, బీదలకు నీకు చేతనైన సహాయం చెయ్యి, ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రతగా నీ శరీరాన్ని కాపాడుకో. ఇది దేవుని దృష్టిలో పవిత్రమైన భక్తి. ఇలాంటి భక్తి మనము అందరము కలిగి ఉండుము గాక, ఆమెన్. 

 🕎 *CHRIST TEMPLE-PDTR*🕎 

  ✅ వ్యాధులెందుకు వస్తున్నాయి..? 
✅ పరిశుద్ధ గ్రంధములో మనము గమనించినపుడు, వ్యాధులు రావడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు గమనించగలము. 
పూర్తి సందేశం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Comments