🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
దేవుని మాట వినకపోతే..?
జీవితంలో అనేకమార్లు ఓటమి చూచినప్పుడు, “దేవుడు నాపై యింకా తన కృపను చూపిస్తాడా?” అని అనుమానం కలుగుతుంది. ఘోర పాపులను కూడా దేవుడు ఎట్లు కరుణిస్తాడో మనష్షే జీవితం మనకు నేర్పుతుంది. మనం పాపంలో ఉన్నప్పుడు అన్ని స్థితులలోను ఒక్కో విధంగా ఆయన కృపను కనుపరుస్తాడు.
📖 2 దినవృత్తాంతము 33:1-20 ✒
దయచేసి బైబిల్ లో చదవండి.
పాపంలో నడిచే తన బిడ్డలు ఆ పాపాన్ని విడిచి దేవుని తట్టుకు తిరగాలని దేవుడు అనేక విధాలుగా హెచ్చరిస్తాడు. మనష్షే భయంకరమైన పాపంలో జీవించి తన రాజ్యాన్ని దేవునికి వైరులుగా నడిపించినప్పటికీ దేవుడు మనష్షేను కూడా అదేవిధంగా హెచ్చరించాడు కాని మనష్షే మరియు అతని జనులు దేవుని మాట వినలేదు (10వచనం). అయినా దేవుడు అతనిని విడువక అనేకమార్లు హెచ్చరిస్తూనే ఉన్నాడు. దేవుడు తన బిడ్డలను శిక్షించడానికి యిష్టపడడు కనుక కృపతో ముందుగా హెచ్చారిస్తాడు (2 తిమోతి 3:16).
మనష్షే దేవుని మాట లక్ష్యపెట్టలేదు కనుక అతనిని శిక్షించి క్రమశిక్షణలో పెట్టవలసివచ్చింది. యిందులో కూడా దేవుని కృపయే మనకు కనిపిస్తుంది. తండ్రి తన ప్రియమైన కుమారుడు/కుమార్తె తప్పిపోకుండు నిమిత్తం తమను శిక్షించినట్లు, దేవుడు తనకిష్టమైనవారిని క్రమశిక్షణలో పెట్టును. అందుకే మనష్షేను దేవుడు తన శత్రువుల చేతికి అప్పగించాడు (11వ).
శ్రమలో ఉన్న మనష్షే తన్ను తాను తగ్గించుకొని దేవునికి మొర్రపెట్టాడు. వెంటనే దేవుడు తన మొరను ఆలకించి విమోచించాడు. మనష్షే యొక్క పాపాన్ని కృపతో క్షమించి మరలా తన దేశానికి రప్పించాడు (13వ). మనం మన పాపముల ద్వారా బంధకాల్లోనికి వెళ్లి ఏ స్థితిలో ఉండి మొర్రపెట్టినా దేవుడు ఆలకించి విడిపిస్తాడు (యిర్మియా 15:21). అదే దేవుని కృప (ఎఫేసీ 2:8-9).
మనష్షే తిరిగి తన దేశానికి వచ్చిన తరువాత తన దేశంలో తిరిగి గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చాడు. రాజకీయంగాను, విశ్వాసపరంగానూ ఎన్నో పునరుద్ధరణలు చేయడానికి దేవుడు కృప చూపించాడు (14-16వ). ఒకప్పుడు ఘోరమైన పాపులను దేవుడు అనేక మంది మేలు కొరకు బలంగా వాడుకుంటాడు. అది కేవలం దేవుని కృప మాత్రమే. దేవుడు యెషయాతో చెప్పినట్లు, కేవలం ప్రజలను దేవుని యొద్దకు నడిపించుట మాత్రమే కాక, అనేక మందికి ఆశీర్వదకరంగా మారుస్తాడు (యెషయా 49:6).
ఆఖరిగా, కొంచెం కష్టమైనా ఒక వాస్తవం మనం ఎదుర్కోవలసి వస్తుంది. మనష్షే దేవుని తట్టు తిరిగి జనులను దేవుని వైపు త్రిప్పినప్పటికీ, అనేకులు అన్యదేవతల కొరకు ఏర్పరచిన “ఉన్నత స్థలములలో” యెహోవాను ఆరాధించడం మొదలుపెట్టారు. దీనిని మనష్షే మార్చలేకపోయాడు (17వ). ఇది చాలా బాధాకరమైన విషయం. మనం పాపంలో జీవించినప్పుడు చేసిన పనులకు వచ్చే పర్యవసానం మనలను తరువాత బాధిస్తుంది. మనలను క్షమించిన దేవుడు పర్యవసానం ఎందుకు తొలగించడు? మన పాపము యొక్క పర్యవసానం అది ఎంత కౄరమైనదో, దేవుడు దానిని ఎంతగా అసహ్యించుకుంటున్నాడో మనకు గుర్తుచేస్తూ, మనలను మనం తగ్గించుకొని శుద్ధి చేయబడుటకు అది సాధనంగా ఉపయోగపడుతుందని జాన్ పైపర్ అనే దైవజనుడు చెప్పారు. నిజమే, ఈ స్థితిలో కూడా దేవుని కృపను మనం చూడగలం. మన పాపము యొక్క పర్యవసానంలో వచ్చే అభ్యాసం నీతియను సమాధానకరమైన ఫలమిస్తుంది (హెబ్రీ 12:11). మరెన్నడూ పాపం చేయకుండా సహాయపడుతుంది.
హెబ్రీ 4:15-16లో, “మన ప్రధానయాజకుడు మనబలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడుకాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.గనుక మనము కనికరింపబడి సమయోచితమైనసహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతోకృపాసనమునొద్దకు చేరుదము” చెప్పబడింది.
ఇంత గొప్ప కృపను చూపించే దేవుని విడనాడక ఆయన తట్టు తిరుగుదాం. ఆమెన్.
🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎
Comments