నాకు కూడా ఒకరోజు టైం వస్తుంది..అప్పుడు నేనేంటో చూస్తావు కదా..

🕎 *CHRIST TEMPLE-PRODDATUR*🕎

Telugu Bible Sermons by Pastor.Nakkolla Balu.Daniel.

నాకు కూడా ఒకరోజు టైం వస్తుంది..అప్పుడు నేనేంటో చూస్తావు కదా..

“ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు; సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలిసికొందురు."
( ప్రసంగి 8:5 )

ప్రసంగి 3:1లో సొలొమోను మహారాజు  ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని, ఆయా సమయాలలోనే అవి జరుగునని కొన్ని ఉదాహరణతో సమయం పట్ల తన భావనను వివరించేను.... పుట్టటం దగ్గరి నుండి చావటం వరకూ... ఒక సమయం ఉంటుంది అని... సొలొమోను మహారాజు  చాలా అంశాలు వివరిస్తున్నారు.
మరికొంచం ముందుకు వెళ్లి ప్రసంగి 8:5 లో ధర్మమును అనుసరించి ఆజ్ఞల ప్రకారం జీవించువానికి కీడు జరగదు అని, వారికీ ఒక సమయం వచ్చునని, న్యాయం జరుగునని ముందుగానే జ్ఞానులు తమ మనస్సులో తెలుసుకుంటారు అని వివరించారు....

గమనించండి, ప్రతిదానికి ఒక సమయం ఉంది అని, ధర్మమును అనుసరించి ఆజ్ఞల ప్రకారం జీవించువారికి కీడు జరగదని, జ్ఞానులు ముందే ఈ విషయాలు తెలుసుకుని, గ్రహించి ఉంటారు కనుక చింతించవలసిన పనిలేదు.

నా ప్రియ స్నేహితులారా....
మనలో చాలామంది ఈ సమయం గురించి ఎంతో కంగారుపడుతూ ఉంటాము....

▪నేను ఎంతో కష్టపడుతున్నాను అయినా ఇంకా నా కష్టానికి తగిన ప్రతిఫలం ఇంకా రాలేదని....

▪నాకు ప్రమోషన్ కి ఎంతో అవకాశం ఉన్న ఇంకా ప్రమోషన్ రాలేదని....

▪నేను ఎంతో నమ్మకముగా ఉన్నా, ఇంకా తగిన గుర్తింపు రాలేదని....

▪నేను ఎంతో కాలముగా సేవ చేస్తున్న ఇంకా విస్తారంగా సేవకు ద్వారాలు తెరువబడలేదని....

▪నాకు మంచి విద్య ఉన్న తగిన ఉద్యోగం ఇంకా రాలేదని....

▪ అలాగే.... పెళ్లి కాలేదని..

▪సొంత ఇల్లు కట్టుకోలేకున్నాను అని..

▪ వ్యాధి తగ్గటంలేదని,

మనలో చాలామంది ఈ సమయం గురించి ఎంతో కంగారుపడుతూనే ఉంటాము.
ముందుగా మనం గమనించవలసినది ఒకటి ఉంది , అది.... ప్రతిదానికి ఒక సమయం ఉంది అని.

ఇది మర్చిపోయి... సమయం మీద అరుస్తాము... దేవుని మీద అరుస్తాము... జీవితం మీద అరుస్తాము. దీనివల్ల మనకి ఉన్న కొద్దిపాటి మనశ్శాంతి కూడా కోల్పోతాము అంతకుమించి   ఏమి ప్రయోజనం ఉండదు.

దేవునికి ఒక చిత్తం ఉందని, ప్రతివారి కోసం ఒక ప్రణాళిక ఉందని, ధర్మమును అనుసరించి ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నవారు కీడులో పడరని, పడినారంటే ఎంతోకాలం ఆ శ్రమలలోనే ఉండరని మనం గుర్తించాలి.

కొందరు అంటుంటారు “దేవుడు ఎప్పుడు కూడా సమయానికి ముందుగారారు... ఆలస్యంగా అసలురారు” అని.... దేవునిది చాలా ఖచ్చితమైన సమయపాలన.

మనం చాలాసార్లు చూసి ఉంటాము....

అబ్రహాము 25సం!!రాలు ఎదురు చూశారని....
మోషే 40సం!!రాలు ఎదురు చూశారని....
యోసేపు 13సం!!రాలు ఎదురు చూశారని....
మన ప్రభువైన యేసు కూడా 30సం!!రాలు ఎదురు చూశారని....

నిజమే వారు అందరు వేచియున్న వారె.... మీకు మరో విషయం చెప్పనా ...?

దేవుని సమయం ఎంత ఖచ్చితముగా ఉంటుందో తెలుసుకోటానికి మనం ఎస్తేరు గ్రంధం చూడాల్సిందే.... నాకు చాలా బాగా నచ్చిన సందర్భం అక్కడ ఉంది....
అది....
మొర్దెకై మీద ఎంతో పగతో రగిలిపోతున్నాడు హమాను... కపటముగా ఆలోచించాడు, ముందు యూదులను నాశనం చెయ్యాలని ప్రణాళిక వేశాడు... ఆ తరువాత ప్రత్యేకంగా మొర్దెకైని ఉరితీయటానికి 50 మూరల ఉరికంభాన్ని చేయించాడు, ఇంకా మొర్దెకైని చంపుటకు రాజు అనుమతి కోసం రాజ మందిరానికి వెళ్ళాడు, ఇప్పుడు దేవుని కార్యం ప్రారంభంమయ్యింది... ఆ రోజు అహష్వరోషు కి నిద్రపట్టలేదు అందుకని తమ రాజ్యపు సమాచార గ్రంధం తెప్పించుకుని చదివించుకుంటున్నాడు... ఆ గ్రంధంలో గతంలో తనని హత్య చేయటానికి ఆలోచన చేసిన ఇద్దర్ని మొర్దెకై పట్టించి తన ప్రాణాని కాపాడాడను విషయం మళ్ళి గుర్తుచేసుకున్న రాజు.... వెంటనే నన్ను కాపాడిన మొర్దెకైకి తగిన బహుమానం అందినదా? లేదా? అని విచారించాడు... తరువాత మొర్దెకై కి ఏ బహుమతి అందలేదు అని తెలుసుకున్న రాజు దూరంగా అక్కడే మొర్దెకైని చంపేందుకు అనుమతికోసం వచ్చిన హమానును చూసి.... నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకైని తగువిధముగా గౌరవించాలి కనుక, హమాను, నువ్వు వెళ్లి దగ్గరుండి మొర్దెకైని ఘనపరచు, అంతనిని నా తరపున గౌరవించు, రాజ విధులలో అతనిని నువ్వే త్రిప్పి అతనిని ఘనపరచు అని అజ్ఞ ఇచ్చాడు.
రాజు ఆజ్ఞ అందుకున్న హమాను, అలాగే చేసి తను సిగ్గుతో తల కప్పుకుని దుఃఖిస్తూ తన ఇంటికి వెళ్లిపోతాడు.
( ఎస్తేరు గ్రంధము - 5, 6, అధ్యాయాములు )

నా ప్రియ స్నేహితులారా... ఈ వాక్యబాగాన్ని చూసినప్పుడు దేవునిని మహిమపరచకుండా మనం ఉండలేము.
మొర్దెకై ని చంపటానికి అనుమతి కోసం వచ్చిన హమానుతోనే తిరిగి మొర్దెకైకి సన్మానం చేయించారు దేవుడు.

సామెతలు 21:1 లో ఇలా వ్రాయబడి ఉంది....
“రాజుల హృదయం యెహోవా చేతిలో ఉన్నది. ఆయనకు ఇష్టం వచ్చినట్లు నీటి కాలువల్లాగా దానిని త్రిప్పును” అని....

దేవుడు సరేనా సమయంలో అహష్వరోషు రాజు మనస్సును  ముర్దేకై వైపు త్రిప్పి నాశనం చేయ్యాలని వచ్చిన వానిచేతే మొర్దెకైకి సన్మానం చేయించారు.

ఎస్తేరు గ్రంధం చాలాసార్లు చదివి ఉంటాము... ఈ వాక్యభాగంలో దేవుని సమయం ఎంత కచ్చితమైనదో మనం సరిగ్గా తెలుపుతూ ఉంది. కానీ,  ఈ వాక్యభాగం మనం అంతగా చూడము.

అలాగే... దేవుడు మనం జీవితంలో చేసిన అనేక కార్యాలు కూడా మనం ఇప్పటి వరకూ చూసివుండం....

అందుకే దేవుని కార్యాలు కంటికి కనిపించవు అని, చెవికి వినిపించవు అని, హృదయానికి గోచరంకావు అని వ్రాయబడియున్నది.

మొర్దెకై , అహష్వరోషు ప్రాణాలు కాపాడిన రోజునే అతనిని గౌరవించియుండోచ్చు.... కదా...?
కానీ... దేవుడు తగిన సమయంలో ఆ కార్యాన్ని చేసారు. Perfect Timing.

అలాగే... నీ, నా జీవితం విషయంలో కూడా దేవుడు అనేక ప్రణాళికలు కలిగి ఉన్నారు....
ఇప్పుడు నువ్వు కావలి అనుకుంటున్నది నీకు ఇవ్వటానికి సరేనా సమయం కాదు ఏమో....
నీకోసం మంచి సమయం దేవుని దగ్గర ఉందేమో... సొలొమోను మహారాజు చెప్పినట్లుగా జ్ఞానవంతమైన మనస్సుకు మాత్రమే అది అర్ధం అవుతుంది.

యేసయ్య అంటున్నారు... మీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తండ్రికి చాలా బాగా తెలుసు, మీరు ముందుగా అయన రాజ్యమును, నీతిని మొదటిగా వెతకండి” అని....

ప్రసంగి 8:5లో వ్రాయబడియుండి... ధర్మమును అనుసరించి ఆజ్ఞల ప్రకారం జీవించువనికి కీడు జరగదు అని వారు ఒక సమయం వచ్చునని, న్యాయంజరుగునని ముందుగానే జ్ఞానులు తమ మనస్సులో తెలుసుకుంటారు అని. గమనించండి... ప్రతిదానికి ఒక సమయం ఉంది అని, ధర్మమును అనుసరించి ఆజ్ఞల ప్రకారం జీవించువారికి కీడు జరగదని, జ్ఞానులు ముందే ఈ విషయాలు  తెలుసుకుని గ్రహించి ఉంటారు కనుక చింతించవలసిన పనిలేదు.

“ యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు ”
( కీర్తనలు 37:9 )....

ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును దీవించునుగాక... ఆమేన్.

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Comments