📖 అంతగా నిన్ను నమ్మితే..డబ్బు కోసం నమ్మక ద్రోహం చేస్తావా..!

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

📖 అంతగా నిన్ను నమ్మితే..డబ్బు కోసం నమ్మక ద్రోహం చేస్తావా..!

యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి నేనాయనను మీకు పట్టిస్తే నాకేం ఇస్తారు?” అని అతడు అడిగాడు. అందుకు వారు ముప్ఫయి వెండి నాణేలు నిర్ణయించి అతడి కిచ్చారు.
మత్తయి 26::15 

.ముప్ఫయి వెండి నాణేల కోసం ఆశపడ్డాడు యూదా.

👉 కాని అతని ప్రాణాలను ఆ డబ్బు కూడా కాపాడ లేకపోయిందనేది వాస్తవం. పాపం చేసి డబ్బు గడించినాడు యూదా కాని ఆ తరువాత అతనికి అర్ధమైనదేమంటే పాపం చేసి తాను ఆర్జించినది డబ్బు కాదని మరణం అని. కాని ఆప్పటికే ఆలస్యం అయి ఆ డబ్బే శాపమై యూదా ప్రాణం తీసింది.

👉 బైబిల్లో ప్రస్తావించబడిన యేసు శిష్యుల యొక్క జాబితాలలో ప్రతిసారీ యూదా ఇస్కారియోతు పేరును పరిశుద్ధాత్ముడు ఆఖరునే వ్రాయించాడు.
మత్తయి 10:2-4

ఆ పండ్రెండుమంది అపొస్తలుల పేర్లు ఏవనగా,  మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు అంద్రెయ;  జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను; ఫిలిప్పు, బర్తొలొమయి;    తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయియను మారుపేరుగల లెబ్బయి; కనా నీయుడైన సీమోను, "ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా".

అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో అయితే అసలు అతడి పేరు కూడా మనకు కనిపించదు.

అంతే కాకుండా యూదా పేరు బైబిల్లో ప్రస్తావించబడిన అనేక సార్లు "ఆయనను అప్పగించిన" ఇస్కరియోతు యూదా అని దేవుని వాక్యము యూదాను ఒక దైవద్రోహిగా మనకు గుర్తుచేస్తుంది.

👉అనగా ఆయనను అప్పగించిన అనేది యూదాకు ఒక బిరుదుగా మారినది.

🔹మత్తయి 10:4
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

🔹మత్తయి 26:25
ఆయనను అప్పగించిన యూదా బోధకుడా, నేనా?  అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను.

యూదా ఇస్కారియోతు ఒక శిష్యుడుగా విఫలమయ్యాడు. అతను ఇతర శిష్యులు విన్న అదే యేసు బోధను విన్నాడు మరియు అదే అద్భుతాలు చూసాడు, మిగతా శిష్యుల మాదిరిగా అదే యేసు యొక్క పరిచర్యలో పాల్గొన్నాడు. అయినప్పటికీ, యేసు క్రీస్తు యొక్క రక్షణ విశ్వాసాన్ని పొందడానికి యూదా ఎన్నడూ ముందుకు రాలేదు.

యూదా ఇస్కారియోతు మూడు సంవత్సరాలు ప్రభువైన యేసు క్రీస్తుతో గడిపాడు కాని తన ఆత్మీయ జీవితంలో దారుణంగా ఓడిపోయి మరణించాడు. మిగతా శిష్యులు ప్రభువుతో ఉన్న సమయంలో వారి జీవితాలు ఎంతో అద్భుతంగా మార్చబడ్డాయి. సామాన్యమైన జాలరులు, పామరులు అయిన ఇతర పదకొండు మంది శిష్యులను దేవుడు అద్భుతమైన విధానంలో భూమిని తల్ల క్రిందులు చేసే అపొస్తలులుగా చేసి ఎంతో ఘనంగా వారిని వాడుకొన్నాడు.

మరోవైపు, యూదా ఇస్కారియోతు తన ఆధ్యాత్మిక నిర్లక్ష్యం మూలంగాను మరియు ధనాపేక్షతో దేవుడు ఇచ్చిన అవకాశాలన్ని వృధా చేసుకొన్నాడు. ఇది మనకు ఒక తీవ్ర హెచ్చరికగా నిలుస్తుంది.

👉యూదా ఇస్కారియోతు ఒక శిష్యుడుగా విఫలమయినప్పటికీ..

👉అతడి కపట వేషధారణ జీవితం మాత్రం అత్యంత విజయవంతమైనది. యూదా ఇస్కారియోతు ఒక వేషధారి అని, ఒక మోసగాడని, ఒక గొప్ప నటుడని ఒక్క యేసు క్రీస్తు తప్ప మరి ఎవరు కూడా కనిపెట్ట లేకపోయారు.

శత్రువుల చేతులకు యేసును అప్పగించడానికి యూదా పన్నిన పన్నాగం అనితర సాధ్యం. 

  యేసుకు దగ్గరగా ఉండి కూడా తీవ్రమైన పాపములో ఉండటం సాధ్యమేనని యూదా వృత్తాతం రుజువు చేస్తున్నది.

అవును ప్రియులారా!

ఈ దినాల్లో కూడా అనేకులు క్రీస్తుకు ఎంతో దగ్గరగా, దైవసేవకునికి ఎంతో దగ్గరగా ఉండికూడా ఘోరమైన తప్పిదాలు చేస్తూ దేవునికి ఆయాసం కలిగిస్తున్నారు. నాకు తెలిసిన వారు అనేకమంది ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు. తప్పు తెలుసుకొని బాగుపడతారని వారికోసం ప్రతిరోజూ నేను ప్రార్థన చేస్తున్నాను.  వారికి ఈ యూదా ఇస్కరియోతు జీవితం ఒక తీవ్రమైన హెచ్చరిక కాగలదు.

యూదా కోశాధికారి పదవిని అడ్డు పెట్టుకొని డబ్బుసంచి నుండి డబ్బు దొంగిలించేవాడు.

యోహాను 12:6
వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచి యుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను.

దీనిని బట్టి  యూదా ఒక దొంగ అని దేవుని వాక్యము స్పష్టం చెబుతుంది. అతడు దొంగ గనుకనే, పరిశుద్ధాత్మ దేవుడే యూదా పేరును శిష్యుల జాబితాలో చివరన వ్రాయించాడు.

యూదా ఇస్కారియోతు తన కుటంబ నేపధ్యం ద్వారా శిష్యుల నుండి వేరు చేయబడ్డాడు, ప్రాంతీయ నేపధ్యం ద్వారా మాససికంగా శిష్యులనుండి వేరు చేయబడ్డాడు, దొంగయైనందు వలన ఆధ్యాత్మికంగా శిష్యుల నుండి మరియు దేవుని నుండి వేరుచేయబడ్డాడు, అంతేకాకుండా శిష్యుల సమూహంలో అతడు ఒక్కడు మాత్రమే అవిశ్వాసిగా మిగిలి పోయాడు.

యూదా ఇస్కారియోతు ప్రభువును మోసం చేసేంతవరకు అతడు దైవద్రోహి అని శిష్యులు గుర్తించలేక పోయారు. అతను ఎప్పుడూ తమలో ఒకడు అని శిష్యులు భావించేవారు. వాస్తవానికి యూదా కూడా అంతా తాను అనుకున్నట్లుగానే చక్కగా జరుగుతుందని విశ్వసించాడు. అయినప్పటికీ, హృదయము చాలా మోసకరమైనదని వాక్యం చెప్పుచున్నది. యిర్మియా 17: 9.

మనము ప్రభువైన యేసుతో రక్షణతో కూడిన సహవాసంలో ఉన్నామా లేమా అని మన హృదయం మనల్ని ఎప్పుడు సవాలు చేస్తుంది మరియు మనకు గుర్తుచేస్తుంది.

క్రీస్తును శత్రువులకు పట్టివ్వడంలో అతని ముఖ్యోద్దేశం డబ్బు.

యూదా ఒక దొంగ అని మనం ఇప్పటికే నేర్చుకున్నాము.

👉 క్రీస్తు కంటే అతడికి డబ్బునే ఎక్కువ ప్రీతి.

నాకేమి ఇత్తురు?

యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి నేనాయనను మీకు పట్టిస్తే నాకేం ఇస్తారు?” అని అతడు అడిగాడు. అందుకు వారు ముప్ఫయి వెండి నాణేలు నిర్ణయించి అతడి కిచ్చారు.

(మత్తయి 26::15  నేనాయనను మీకప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారినడిగెను. అందుకు వారు ముప్పది వెండి నాణములు తూచి వానికి ఇచ్చిరి.)

ముప్ఫయి వెండి నాణేలు సాధారణంగా ఒక బానిసకోసం చెల్లించే ధర.  (నిర్గమ 21:32  ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన యెడల వారి యజమానునికి ముప్పది తులములవెండి చెల్లింపవలెను.)

క్రీస్తును శత్రువులకు పట్టివ్వడంలో అతని ముఖ్యోద్దేశం డబ్బు. అతణ్ణి ధన పిశాచంగా చేసిన లక్షణాల్లో డబ్బంటే అతనికి ఉన్న ప్రీతి ఒకటి. ఈ దురాశకు లోబడినవారికి ఏం సంభవించగలదో తెలిపే భయానకమైన ఒక ఉదాహరణ యూదా.

👉క్రీస్తు సంఘంయొక్క  లోపలా బయటా కూడా యూదా మాదిరిగా ధన లాభం కోసం తమ జీవితాలను పాడు చేసుకుని,

👉దేవుణ్ణి అగౌరవపరచి,

👉 తమ ఆత్మలను నాశనానికి గురి చేసుకుంటున్న అనేకమందిని నేడు మనం చూస్తున్నాం.

క్రైస్తవ సేవలో ఉన్నవారిలో కూడా చాలామందిని డబ్బు విషయంలో నమ్మడానికి వీలులేని పరిస్థితులు నేడు కనబడుచున్నవి.

ప్రియ స్నేహితులారా గమనించండి. యూదా లాంటి డబ్బు పిచ్చి, మోసం, నమ్మక ద్రోహం..ఇంకా మనలో ఏమైనా వుంటే సరిచేసుకొని ప్రభువుకు ఇష్టులు గా జీవిద్ధాం. అట్టి ఇంద్రియ నిగ్రహము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.

🕎 *CHRIST TEMPLE-PRODDATUR*🕎

Comments