నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా.. నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె ఉంటారు...

🕎 CHRIST TEMPLE-PRODDATUR 🕎

Telugu Bible Sermons by pastor.N.Daniel Balu.

నీ భార్య ఫలించే ద్రాక్షవల్లిగా.. నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె ఉంటారు...

అస్తవ్యస్తంగా చెట్టును చూచి దీనిని మొక్కగా ఉన్నప్పుడే క్రమపరచివుంటే బాగుండేది అనుకునే వ్యవసాయదారులు, క్రమంలేని పిల్లలను చూసి చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో పెంచుంటే బాగుండేది అనుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.

నేడు కుటుంబాలలో షుగర్, బిపి ఇప్పుడు ఏంత సాధారణమైన సమస్యలో అవిధేయులైన పిల్లలు కూడా చాలా సాధారణంగా కనిపిస్తారు.

తల్లిదండ్రులకి పూర్ణవిధేయులైన పిల్లలు కనిపించటమే అరుదు అయితే.... అలాంటిది తల్లిదండ్రుల భక్తిని కూడా నేర్చుకున్న పిల్లలు మనకి కనిపించటం ఇంకా అరుదు.... మంచులో వెన్నెల్లా.... ఇస్సాకు, యోసేపులకు ప్రతిరుపాలుగా ఎప్పుడోగాని, ఎక్కడోగాని వీరు కనిపించరు.

నా ప్రియ స్నేహితులారా....
దేవుని దృష్టికి ధన్యులయిన పెద్దలు, నిలిచి ఉండే వారి కష్టార్జితం, మేలుకరమైన వారి మార్గాలు, ఫలించే ద్రాక్షవల్లి వంటి భార్య, భోజనం బల్ల చుట్టూ ఒలీవ మొక్కలవలె వారి పిల్లలు.... 128వ కీర్తనలోని ఈ ఆశీర్వధములు అన్ని కీర్తనాకారుడు తనకోసమో లేక ఇశ్రాయేలీయులకు మాత్రమే వ్రాసియుంచలేదు కానీ 128వ కీర్తనలో “వారందరికి” అన్న మాట చేర్చటం ద్వారా ప్రతిఒక్కరికి ఈ ఆశీర్వధముల ద్వారము తెరచే ఉంది....

అవును నువ్వు ధన్యుడవు.... నీ కష్టార్జితం నిలిచి ఉంటుంది.... నీ మార్గాలు మేలుకరమైనవిగా మారతాయి.... నీ ఇంటి భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె ఉంటారు....

“అందరికి” ఈ ఆశీర్వధాలు.... కానీ ఈ “అందరు” ఎవరో తెలుసా.... ?
ఈ అందరే.... “యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడచు వారందరు” 128వ కీర్తనలో ఈ మాట మళ్ళి మళ్ళి వ్రాయబడియుండటం మనం చూడవచ్చు.
ఈ ఆశీర్వధాలు అందరికి అయినా “యెహోవా యందు భయభక్తులు కలిగి అయన త్రోవలలో నడచు వారందరికి” మాత్రమే.
“షరతులు వర్తిస్తాయి” అనే మాట మనం విన్నాంకదా; అది ఇదే....

మీరు యెహోవా యందు భయభక్తులు గలిగి ఉంటే మీరు ధన్యులు. bible లో ధన్యులకి లభించే ఆశీర్వధాలు అన్నియు మీకే.
మీరు యెహోవా యందు భయభక్తులు గలిగి ఉంటే మీ కష్టార్జితం నిలిచి ఉంటుంది, అది చక్రవడ్డీలు కట్టటానికి పోదు, మద్యపానం మీకు అసహ్యం కనుక అది ఖర్చేపోదు, పేకాట మీకు అసహ్యం కనుక అది మీ చెయ్యిజారిపోదు, అనవసరంగా హస్పటల్స్ ని పెంచిపోషించటానికి వెళ్ళాదు. మీ కష్టార్జితం నిలిచి ఉంటుంది.

మీరు యెహోవా యందు భయభక్తులు గలిగి ఉంటే మీకు మేలు జరుగుతుంది. మీ మార్గాలు అన్ని మేలైనవిగా ఉంటాయి; అంటే మీరు చేసెది ఏదైనా అది మేలు అని కాదు కానీ దేవుని చిత్తంలోనికి వెళ్లి మీరు మేలు మాత్రమే చేయగలుగుతారు అని.

మీరు యెహోవా యందు భయభక్తులు గలిగి ఉంటే నీ లోగిట నీ భార్య ఫలించే ద్రక్షవల్లిగా ఉంటుంది. దేవుని వేరైన తీగ ఫలించదు అని మనకు తెలుసుగా కానీ ఈ ద్రక్షవల్లి ఫలించే ద్రక్షవల్లి అంటే దేవునితో అంటుకట్టబడి, విశ్వాససహితమైన భక్తి క్రియలను తనకు ఆభరణాలుగా గల స్త్రీ, సు-గుణవతియైన భార్య నీ లోగిట ఉంటుంది.

మీరు యెహోవా యందు భయభక్తులు గలిగి ఉంటే మీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలవాలే ఉంటారు. ఎందుకండీ “ఒలీవ మొక్కలు” ఏం చందనపు చెట్లు, సింధూర,మస్తకి వృక్షాలు, సరళ మ్రానులు మరియు దేవదారు వంటి విలువైన వృక్షాలు లేవా....? ఎందుకు ఈ “ఒలీవ మొక్కలు”....

నా ప్రియ స్నేహితులారా.... గమనించండి.
మనుష్యులు దేవుని ఎదుట తమతమ మార్గములను చెరిపివేసుకున్నారు, ప్రతిగా వారిపై దేవుని ఉగ్రత; అదే మహాజలప్రళయం.... నీతిమంతుడైన ఒక్క నోవహు కుటుంబము ఓడలోనికి ప్రవేశించింది, రక్షించబడింది, భూమిపై మిగిలినవన్నీ నీటమునిగి నశించిపోయాయి.... అటుతరువాత భూమిపై నీటిమట్టం తగ్గి భూమి కనిపించిందో లేదో తెలుసుకొనుటకు నోవహు ఓడ కిటికీ తిసి ఒక పావురాన్ని బయటకు విడిచారు; ఆ సాయంత్రం ఆ పావురం వస్తూ..వస్తూ "త్రుంచబడిన ఒక ఒలీవ చెట్టు ఆకును తీసుకొచ్చింది" (ఆది 8:10,11)
అంతపెద్ద వినాశనం తరువాత మొదట వేగంగా చిగురించినదే ఈ “ఒలీవ మొక్క”
అంత పెద్ద జలప్రళయం వల్ల భూమిపై అన్ని నశించాయి కానీ ఈ “ఒలీవ మొక్క” వెంటనే చిగురించి కనిపించింది.
విస్తారమైన నీరు ఈ ఒలీవ మొక్కపై ప్రవహించిన అది నశించిపోలేదు అలాగే నీ పిల్లలపై లోకం దాడి చేసిన నీ పిల్లలు జయిస్తారు, లోకం వారిపై ప్రభావం చూపలేదు, లోకాశలు వారిపై ప్రభావం చూపలేవు, విస్తారంగా పెరుగుతున్న పశ్చాత్యపు పోకడలు వారిని ఆకర్షించలేవు, జలప్రళయంతో పడిపోయిన ఆ ఒలీవ మొక్క వెంటనే తిరిగి లేచింది....

నీతిమంతుడు ఏడుమార్లు క్రింద పడినను వాడు తిరిగి లేస్తాడు అన్న (సామెతలు 24:16) వాక్యం మీ పిల్లపై నిలిచిఉంటుంది. వాళ్ళు ఒకవేళ పడిపోయినా... పడిపోయిన చోటే ఉండిపోరు తప్పక వారు తిరిగి వేగంగా లేస్తారు. ఇలాంటి ఒలివ మొక్కలవంటి పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఉంటారు.

ఎప్పుడో తెలుసా.... “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడచినప్పుడు”

మనం పిల్లలను కనగలం కానీ వారి రాతను కనలేము అని కొందరు పెద్దలు చెబుతూఉంటారు.... కానీ గాలిలో దీపం పెట్టకుండా, మనలో ఏమయినా కొద్దిపాటి భక్తి ఉంటె అది మన రాబోవు తరాలకు కాపుదలగా, కావలిగా తప్పక ఉంటుంది. మనం మన రాబోవు తరాలకు ఉపదేశించగలము, నేర్పించగలము మరియు వారికీ మాదిరి చూపించగలము.

మరచిపోవద్దు ... నేడు మీ పిల్లల మోకాళ్ళు దేవుని ముందు మీరు వంచలేకపోతే; రాబోయే రోజుల్లో వాళ్ళు నడివీధిలో మీ మెడలువంచి, సిగ్గుతో మీరు తలదించుకునేలా చేసే ప్రమాదం ఉంది.

మరి ఉత్తమమైన మార్గం ఏమిటో తెలుసా.... మనం యెహోవాయందు భయభక్తులు కలిగి అయన త్రోవలలో నడవటం, మన తరువాత తరాన్ని భక్తిలో పెంచటం.
దీని ఫలితంగా మీకు వచ్చే సాక్షమే “నీ పిల్లలు ఒలీవ మొక్కలు....” అని. ఆమెన్.

మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి నామంలో మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.
🕎  CHRIST TEMPLE-PRODDATUR  🕎

Comments