నేను చేతకానివాడిని అంటూ ఎందుకు కృంగిపోతున్నావ్?

🕎 CHRIST TEMPLE - PDTR 🕎


నేను చేతకానివాడిని అంటూ ఎందుకు కృంగిపోతున్నావ్?

▪ఒక ప్రసంగీకుని మాటలు వింటున్నప్పుడు, నేనట్లా ప్రసంగించలేక పోతున్నానే? 

 ▪ఒక సింగర్ పాడుచున్నప్పుడు, నేనట్లా పాడలేక పోతున్నానే?

 ▪ఒక మ్యుజిషియన్ వాయిస్తున్నప్పుడు, నాకట్లాంటి నైపుణ్యములేవి లేవే? ... అంటూ వాళ్ళనీ వీళ్ళనీ పోల్చుకొని కృంగిపోయేవారు కొందరైతే? వాళ్ళనీ వీళ్ళని పోల్చుకొని వారికున్న  తలాంతులను చూచి పొంగిపోయేవారు మరి కొందరు.

 ▪ఎవ్వరితోనూ నీవు పోల్చుకోనవసరం లేదు. ఎందుకంటే? నీలాంటి వారు ఈలోకంలో ఎవ్వరూలేరు.

 ▪ఒక తల్లికి పుట్టిన కవలలో కూడా చెప్పలేనన్ని వ్యత్యాసాలు. నీకు నీవే ప్రత్యేకం.

 ▪నిన్ను ప్రత్యేకంగా దేవుడు సృష్టించాడు. నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగియున్నాడు. అట్లాంటప్పుడు? నేను చేతకానివాడిని, చేతకానిదానను అంటూ ఎందుకు కృంగిపోతున్నావ్?

 ▪ ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింప కుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైనవారిని, తృణీకరింప బడినవారిని, ఎన్ని కలేనివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు. 📖1 కొరింది 1: 27-29

 ▪దేవుడు నిన్ను వాడుకోవడానికి నీకున్న జ్ఞానం, నీకున్న తలాంతులే కారణం అనుకోవడం అవివేకం. నీకు ఆరోగ్యంవున్నా-లేకున్నా, చదువున్నా-లేకున్నా, బాస్ వి అయినా-సాతానుకు బానిసవైనా , మాటకారివైనా-నత్తివాడవైనా, చిన్న వాడవైనా - పెద్దవాడవైనా, నీస్థితి ఏదయినా సరే 'నీవు ఆయనకు కావాలి'.

 ▪ షోమ్రోను పట్టణం, ఆకలితో అల్లాడిపోతున్న ప్పుడు, వారి ఆకలిని తీర్చడానికి దేవుడు "కుష్టురోగులను" ఏర్పాటు చేసుకున్నాడు. 📖2 రాజులు 7:9

 ▪ ఇశ్రాయేలీయులు, ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్నప్పుడు, వారిని విడిపించడానికి "నత్తివాడైన" మోషేను నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు.📖నిర్గమ 4:10

 ▪ ఐదు వేలమంది ఆకలిని తీర్చడానికి 'చిన్నవాడు' తెచ్చిన 'చిన్న ఆహారము'నే ప్రభువు వారు వాడుకున్నారు. 📖యోహాను 6:9

 ▪ సైన్యాధ్యక్షుడైన నయమాను కుష్టురోగము బాగుపడడానికి బానిసయైన 'చిన్నది' ఇశ్రాయేలు దేవుని శక్తిని గూర్చి ఇచ్చిన సమాచారమే కారణమయ్యింది. 📖2 రాజులు 5:4

 ▪యుద్ధ శూరుడైన గొల్యాతును సంహరించడానికి 'బాలుడైన' దావీదును, 'ఒడిసెలు' ను ఆయుధంగా ఎన్నుకున్నాడు.      📖1 సమూయేలు 17:33

 ▪యేసు ప్రభువు వారు తన రాజ్య సువార్తను వ్యాప్తి చెయ్యడానికి చేపలపట్టు 'జాలరులను' తన శిష్యులుగా ఎన్నుకున్నాడు. 📖మత్తయి 10:2

 ▪యేసుప్రభువు వారు తన ప్రయాణానికి హేరోదు గుర్రాలనుకాదు వాడుకున్నది. కట్టబడిన 'గాడిదపిల్ల' ఆయనకు కావలసి వచ్చింది. 📖మార్కు 11:2

 ▪అవును! సాతాను కట్లచే బంధించబడిన నీవే ఆయనకు కావాలి. యేసును మోసిన ఆ గాడిద పిల్లవు నీవే కావాలి. ▪ఆశ గల ప్రాణమును త్రుప్తిపరచుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది  📖(కీర్తనలు 107:9).

  ▪నీవు దేవుని పనిలో వాడబడాలి, ఒక బలమైన సాధనముగా వుండాలి అని ఆశ పడితే నిన్ను అయన పాపం నుండి విడిపించి, నీ బలహీనతల యందు నీకు బలం ఇచ్చి, తన కృప చేత నిన్ను బలముగా  వాడుకొంటాడు. 

              పైన చదివారు కదా, దేవుడు ఎలాంటి వారిని తన సాధనముగా వాడుకున్నారో, కనుక నీ బలహీనతలను చూసి క్రుంగిపోకుండా, ప్రభువా నన్ను నీ సాధనముగా వాడుకో అని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుడు తప్పక నిన్ను తన సాధనముగా వాడుకొంటాడు.  

నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను.📖ఫిలిప్పీయులకు 4:13 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 🕎 *CHRIST TEMPLE-PRODDATUR*🕎  

Comments