మరణం యేసయ్య ముందు తల వంచింది..  

🙏 *Christ Temple- Proddatur*🙏
 
Telugu Bible Sermons by pastor.Nakkolla Balasubramanyam Daniel

మరణం యేసయ్య ముందు తల వంచింది..  

నిత్య జీవితంలో మనిషికి ఎందరో శత్రువులుంటారు. వ్యాధులు, అప్పులు, నిందలు, అవమానాలు, మానసిక సంఘర్షణలు, నిరాశ... ఇవన్నీ ఏదో ఒక సందర్భంలో మనిషిని సవాలు చేస్తుంటాయి. లోకంలో పుట్టిన వ్యక్తి గెలుపు ఆటలో కచ్చితంగా దూసుకుపోవాలని ఆకాంక్షిస్తుంటాడు. సమాజంలో తనకు ఓ విశిష్ట గుర్తింపు పాదాక్రాంతం కావాలని ఆశిస్తూంటాడు. అన్ని శక్తులూ కూడగట్టుకుని గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే శత్రువులలోకెల్లా ప్రధాన శత్రువు మరణం అనేది నిజం.    
మరణం ముందు ఎన్నో ఘనతర లక్ష్యాలు నిలువునా నీరోడాయి. ప్రపంచాన్ని ఒంటి చేత్తో జయించిన విజేతల నుండి అతి సామాన్యంగా జీవితాన్ని నెట్టుకొస్తున్న వారి వరకు ఎందరో మరణం ముందు తలలు వంచారు. జీవితంలో ఎక్కడైనా హెచ్చుతగ్గులు ఉన్నాయేమో గాని మరణం దగ్గర ఆ అవకాశం లేదు. నిర్మొహమాటంగా లాక్కెళ్లిపోతుంది. అందుకేనేమో మతాల కతీతంగా, కులాలకతీతంగా, ప్రాంతాల కతీతంగా మరణం ప్రతి ఒక్కరి ముందు శత్రువులా నిలబడింది.   

 ఈ సువిశాల విశ్వంలో ఓ అద్భుత కార్యం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది. అదే క్రీస్తు ‘పునరుత్థానం’. ‘పునః’ అంటే తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట అని అర్థం. యేసుక్రీస్తు మరణాన్ని జయించి, మరణపు ముల్లును విరిచి, మరణపు మెడలు వంచి తిరిగి లేచిన శుభదినం! ప్రపంచమంతా దివ్య వెలుగుతో, నవ్యమయమైన కాంతులతో విరాజిల్లిన రోజు. ఒక్క మాటలో చెప్పాలంటే... మరణం మరణించిన రోజు!అప్పటి వరకు ఎందరో మరణం ముందు తల వంచారు కానీ ఆ రోజు మరణం దేవుడి ముందు తల వంచింది. అప్పటి వరకు ఎందరో మరణం గుప్పిట్లోకి వెళ్లిపోయారు కానీ ఆ రోజు మరణం దేవుడి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. అసాధ్యం అన్న చోటనే సాధ్యం అనే మాట ఉంది అని నిరూపితమయింది.

  వారు భయపడి ముఖములను నేల మోపి యుండగా వీరుసజీవుడైన వానిని మీ రెందుకు మృతులలో వెదకుచున్నారు..? లూకా సువార్త 24:5

 ‘‘యేసుక్రీస్తు ఖాళీ సమాధి... క్రైస్తవ విశ్వాసానికి పునాది.’’ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ చరిత్రకు మూలరాయి.దురవస్థలో ఉన్న మనిషిని రక్షించి, పాపబంధకముల నుండి వ్యసనముల నుండి విడుదల చేసి, నవ్యపథ నిర్దేశం చెయ్యాలన్న సర్వోత్తమ లక్ష్యంతో యేసు ఈ లోకానికి వచ్చాడు. 
ఎన్ని అవాంతరాలు ఎదురైనా, నిందలు కృంగదీసినా తాను చెయ్యాలనుకున్న పనిని పూర్తి చేశాడు. అవిధేయత ద్వారా పాపం, పాపం ద్వారా మరణం మనిషిని కబళించినప్పుడు యజ్ఞ బలిపశువుగా సిలువలో తన ప్రాణమును అర్పించి మానవ పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. 
  ప్రపంచంలోని మనుషుల భాషలు వేరైనా భావం మాత్రం ఒక్కటే. పాపం నుండి, శాపం నుండి మరణం నుండి విడుదల పొంది పుణ్య లోకాలకు, నిత్యరాజ్యానికి వెళ్లాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక. మనిషి మనోభీష్టాన్ని నెరవేర్చడానికే సృష్టికర్త సృష్టిగా మార్పు చెందాడు. సమాజ పునర్వికాసానికి పెద్ద పీట వేసి... ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అన్న బోధతో మానవీయ వ్యవస్థను నిలబెట్టాడు. ఔను! దేవుడు ప్రేమామయుడు గనుకనే మనకందరికీ ప్రేమను గూర్చి విదశీకరించాడు.   

 ఈ రోజుల్లో ప్రస్తుత నవతరానికి ‘ప్రేమ’ అనే మాట సరిగా అర్థం కాలేదనిపిస్తుంది. ప్రేమకు అర్థం తెలిస్తే, ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు ఎందుకు జరుగుతాయి? బ్లేడుతో గొంతుకలు ఎందుకు కోస్తారు? ఆయుధాలతో పిచ్చెక్కినట్టు ఎందుకు రెచ్చిపోతారు? హేయమైన దురాకృతాలతో ప్రజల గుండెల్లో భయాందోళనలను ఎందుకు పెంచుతారు?  ‘‘ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ప్రేమ అంటే ఇతరుల కోసం బలైపోవడం.’’ ఇది యేసు చెప్పిన నిర్వచనం. తాను చెప్పడం మాత్రమే గాక చేసి చూపించాడు. ఈ సుందర, సువిశాల భూమ్మీద మధ్య ప్రాంతంలో కలువరి సిలువలో క్రీస్తు మరణించి ప్రేమ పతాకాన్ని ఎగురవేశాడు.   
 ప్రేమ పతాకం పక్కనే విజయ పతాకం కూడా రెపరెపలాడుతుంది. ఇది ఓ అద్భుతమైన జీవిత సత్యం. ప్రేమతోనే ఏదైనా సాధించగలం అనే వాస్తవాన్ని ఏ ఒక్కరూ విస్మరించకూడదు. ‘‘క్రీస్తు ప్రేమను వ్యక్తీకరించాడు గనుకనే మరణాన్ని జయించగలిగాడు. ప్రేమ ముందు ఏదైనా తలవంచవలసిందే అనే సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. 

అందు కతడుకలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మార్కు సువార్త 16:6

   ఫ్రెంచ్ సైన్యాధిపతియైన నెపోలియన్ బోనాపార్టే కూడా ఇదే విషయాన్ని చెప్పాడు... ‘‘నేను కత్తి ద్వారా ప్రపంచాన్ని జయించాను గానీ క్రీస్తు ప్రేమతో ప్రపంచాన్ని జయించాడు’’ అని. సాటి వ్యక్తి బాధలను అర్థం చేసుకొని మదర్ థెరిస్సా ‘‘కేవలం ప్రేమతోనే ప్రపంచాన్ని జయించవచ్చు’’ అని చాటి చెప్పారు. ఔను... ‘ప్రేమ పతాకం ఎగురని చోట విజయ పతాకం ఎగురదు.’   

పునరుత్థానం... దివ్యపాఠం!

  ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన క్రీస్తు పునరుత్థానం వలన మనకు కలిగే ప్రయోజనమేమిటి? క్రీస్తు పునరుత్థానం నుండి  మనం సంగ్రహించగలిగే దివ్య పాఠాలు ఏమిటి?    సమాధి అయిన కలలను ప్రభువు బతికిస్తాడు. యూదులందరూ క్రీస్తును రోమన్ గవర్నర్ ముందు నిలబెట్టి, అబద్ధాలు చెప్పి ‘అన్యాయపు తీర్పు’ను తీర్చారు. ఏ చేతులతోనైతే క్రీస్తు పంచిన రొట్టెలు తిన్నారో అవే చేతులతో ఆయనను పిడిగుద్దులు గుద్దారు. సుమారుగా 80 కేజీల బరువైన సిలువను ఆయనపై మోపి, యెరూషలేము వీధుల్లో తిప్పి ఆఖరుకు సిలువ వేశారు. హృదయ విదారకంగా క్రీస్తు సిలువలో వ్రేలాడుతుంటే... ‘క్రీస్తు జీవితాన్ని సమాప్తి చేసేశాం! ఇక లేవలేడు! ముగింపు పలికాం!’ అని వికృతంగా నవ్వుకున్నారు. క్రీస్తును ఒకే ద్వారం ఉన్న రాతి సమాధిలో ఉంచారు. ఈస్టర్ రోజున... అనగా ఆదివారపు తెల్లవారు ఝామున అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ క్రీస్తు మరణ బంధకాలను తెంచుకుని బయటకు వచ్చాడు. ఆశ్చర్యం! అద్భుతం!    
ఔను! ఈ మాటలు చదువుతున్న నీ జీవితంలో నీ కలలు సమాధి చేయబడ్డాయా? కొన్ని కొన్నిసార్లు జీవితంలో ‘నా అనుకునేవాళ్లే’ మనలను సమాధిలో పెట్టేస్తారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్న నిన్ను నిందలతో అవమానాలతో కృంగదీస్తారు. మానసికంగా వేధిస్తారు. నీవు ఏమీ సాధించలేవు అని పదే పదే చెబుతూ నిన్ను పాతాళానికి తొక్కివేయడానికి ప్రయత్నిస్తారు.  
  ఇటువంటి సందర్భాల్లో క్రీస్తు పునరుత్థాన ఘట్టాన్ని నెమరు వేసుకో! ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా, సిలువ వేసినా, బంధకాలతో బంధించినా క్రీస్తు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. సమాధిని జయించాడు. కర్తవ్య దీక్షతో, బుద్ధి కుశలతతో ముందుకు సాగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. సమాధి అయిపోయిన నీ కలలను తిరిగి బతికిస్తాడు. సమాధి పొరలను చీల్చుకొంటూ నీ దర్శనం బయటకు వస్తుంది. చీకటి అధ్యాయాన్ని చీల్చుకుంటూ ‘వెలుగు’ కిరణం పయనం ప్రారంభిస్తుంది.ఓటమితో కృంగిపోయావా? ఏమీ సాధించలేనన్న ఆత్మన్యూనతా భావం నిన్ను ఏలుబడి చేస్తుందా? సంకల్ప దీక్షతో, దైవబలంతో ముందుకు సాగిపో! నిన్ను నిలువరించే శక్తి ఎవ్వరికీ లేదు.  
  18 నెలల ఓ బాలిక జ్వరంతో చూపు, వినికిడి కోల్పోయింది. నిశ్చేష్టురాలై పడిపోయింది. అందరూ ఆమెను చూసి ఏడ్చారు! విధి వంచించింది అని బాధపడ్డారు. ఓ పక్క నిశ్శబ్దం, మరోపక్క చీకటి. అవి తప్ప  ఆమెకు ఏమీ తెలియదు. జ్ఞానంలో ఎదిగిన తర్వాత తనేంటో తాను తెలుసుకొంది. దేవుడు తనను సృష్టించాడు గనుక ఆ దేవునికే తన జీవితాన్ని అప్పగించుకుంది. కృంగదీసే పరిస్థితులు చుట్టూ ఎన్నున్నా లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయింది. ఆమె ఎవరో కాదు... ‘హెలెన్ కెల్లర్’. ప్రపంచంలో ఈమె పేరు తెలియనివారు లేరు. ‘నా జీవిత గాథ’ అనే పుస్తకం ద్వారా ప్రపంచాన్ని నివ్వెర పరిచింది. ఎవరో ఆమెను అడిగారట... ‘ప్రపంచంలో నిజమైన గుడ్డివారు ఎవరు?’ అని. ‘‘ఓ దర్శనం లేకుండా, దాన్ని సాధించకుండా బతికేవాడే నిజమైన గుడ్డివాడు’’ అని ఆమె సమాధానమిచ్చింది.    

క్రీస్తే జయము!  

క్రీస్తు మరణాన్ని జయించాడు గనుక ఆయన నీకు కూడా జయమివ్వగలడు. త్రికరణ శుద్ధితో దైవాన్ని వేడుకుంటే సత్ఫలితాలు వస్తాయి. దేవుని మీద భక్తి, సత్ ప్రవర్తన మంచి విలువలతో కూడిన జీవితానికి బాటలు వేస్తాయి.క్రీస్తు  మరణాన్ని జయించి ‘భయపడకుడి’ అనే అభయాన్ని ఇచ్చాడు. ఔను! నీవు జయించువాడవైతే నీ దగ్గర అభయముంటుంది. అనేకులను ధైర్యపరచగలవు. నీ దగ్గర సముచిత ప్రోత్సాహం ఉంటుంది.  

  క్రీస్తు తెలిపిన సత్యం!

  నీవు ఏవిధమైన నేరం చెయ్యకపోయినా సమాజం నిన్ను నిందిస్తోందా? ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్నే నిజం చెయ్యాలని ప్రయత్నిస్తోందా? అయితే విను! సత్యాన్ని ఏ ఒక్కరూ కూడా శాశ్వతంగా సమాధి చెయ్యలేరు! అది ఎవ్వరి తరం కాదు. సత్యమైన క్రీస్తును సమాధిలో ఉంచారు. కానీ ఎక్కువకాలం ఉంచలేకపోయారు. అసత్యాన్ని, అబద్ధాన్ని చీల్చుకుని సత్యం బయటకు వచ్చింది. ఈ లోకంలో పాపాత్ముల విజయం కొంతకాలమే. శాశ్వత విజయం మాత్రం సత్యవంతులదే!   
 ఈ రోజుల్లో ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ విశ్వసనీయత లేదు. నమ్మకత్వం, యధార్థత, నిజాయతీ రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. సాటి మనిషిని నమ్మలేని దుస్థితి ఏర్పడుతోంది. ఎందరో మహానుభావులు కలలుకన్న సుందర భారతావనిని చూడాలంటే ప్రతి ఒక్కరూ సత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇచ్చిన మాట మీద నిలబడడం, వాగ్దానాలు నిలబెట్టుకోవడం వల్ల సమసమాజం నిర్మితమవుతుంది. దేవునికున్న విశిష్టమైన లక్షణాల్లో ఒకటి, ‘ఆయన సత్యం చెప్పి నిన్ను గాయపరుస్తాడే గానీ అబద్ధాన్ని చెప్పి నిన్ను ఆదరించడు.’’సత్యం డాక్టరు చేతిలో కత్తిలాంటిది... అబద్ధం అనేది రౌడీ చేతిలో కత్తిలాంటిది. రెండూ గాయపరుస్తాయి. కానీ ఉద్దేశాలు మాత్రం వేరు.   
 యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ‘‘నేనే మార్గము, సత్యము, జీవము’’ అని తెలియచేశారు. పాపము లేనివానిగా పుట్టి, జీవించి, పాపుల కొరకు మరణించి, మూడవ రోజున సజీవంగా తిరిగి లేచి... తెరవబడిన హృదయాల్లో నివసించాలనే ఆశపడుతున్నాడు. నిజదేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న నీదైతే... ‘మానవ హృదయంలో’ అనేది నా జవాబు. పునరుత్థానుడైన క్రీస్తు మీ అందరికీ గొప్ప ధైర్యాన్ని, ప్రేమను, శాంతి సమాధానాలను, మోక్షరాజ్య ప్రాప్తిని అనుగ్రహించును గాక. ఆమెన్. 

🙏 *Christ Temple- Pdtr*🙏

Comments