*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నీ సమస్య నుండి నిన్ను విడిపించగల దేవుడు
అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.
అపో.కా. 16:25
పౌలు- సీలలు క్రీస్తును ప్రకటించే సువార్తికులు, వారు మాసిదోనియా దేశంలో ఫిలిప్పు పట్టణంలో నున్నప్పుడు పుతోను అను దయ్యము పట్టిన చిన్నది వారిని వెంబడిస్తూ వుంది. ఆ చిన్నది సోదె చెప్పడం వల్ల, తన యజమానికి ఎంతో ధనాన్ని సంపాదించి పెడుతుంది.
అయితే, వారు చేసిన తప్పేంటి అంటే? ఆ పుతోను దయ్యాన్ని వెళ్లగొట్టి ఆ చిన్నదాన్ని రక్షించారు. దాని యజమానులకు ఆదాయం లేకుండా పోయింది. దానితో దాని యజమానులు రెచ్చిపోయి పౌలు సీలలను అధికారుల యొద్దకు ఈడ్చుకొనిపోయారు.
వీరు పట్టణమును గలిబిలి చేస్తున్నారు అనే నేరం వారి మీద మోపారు. జనసమూహమంతా వారిపై దొమ్మీగా పడ్డారు. అధికారులు కూడా వారి వస్త్రాలను తీసివేసి బెత్తముతో కొట్టాలని ఆజ్ఞాపించారు. వారిని అట్లా చాలా దెబ్బలు కొట్టిన తర్వాత, వారిని చెరసాలలో త్రోసి, వారికాళ్లకు బొండవేసి బిగించారు.
అది అర్ధరాత్రి సమయం. ఒకవైపు చెప్పలేనంత దెబ్బల బాధ, మరొకవైపు ఆకలి బాధ, నిద్రలేదు. అయినప్పటికీ అట్లాంటి పరిస్థితులలో కూడా కృతజ్ఞతతో కూడిన స్తుతి పాటలు పాడుతూ, దేవుని ప్రార్థిస్తున్నారు. ఖైదీలందరూ వింటూ వున్నారు.
అవును!
ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి; యెడతెగక ప్రార్థనచేయుడి; ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.
1 థెస్స 5: 16-18
అర్ధరాత్రి ప్రార్ధించినా, ఆ ప్రార్థనకు సమాధానమిచ్చేవాడు మన దేవుడు. కారణం? ఆయన కునుకడు, నిద్రపోడు. నీవు హాయిగా నిద్రపోయినా, ఆయన మాత్రం మేల్కొని నిన్ను కావలి కాస్తాడు.
పౌలు సీలల ప్రార్ధన నేరుగా దేవుని సన్నిధికి చేరింది. అకస్మాత్తుగా మహా భూకంపం కలిగింది. చెరసాల పునాదులన్నీ అదిరిపోయాయి. చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఖైదీలందరి బంధకాలు ఊడిపోయాయి.
దేవుడు తన బిడ్డలను విడిపించడమే కాదు. ఆ చెరసాల నాయకుని ఇంటికి కూడా రక్షణ అనుగ్రహించాడు. ఈ అద్భుతాన్ని కళ్లారా చూచిన ఖైదీలు కూడా ప్రభువును రక్షకునిగా అంగీకరించి యుండవచ్చు.
అవును! నీవు ఎట్లాంటి పరిస్థితుల్లోనున్నా, అది ఏ సమయమైనా ఆయనను ప్రార్ధించ గలిగితే? నీవున్న ప్రతీ పరిస్థితి నుండి నిన్ను విడిపించగల సమర్ధుడు నీ దేవుడు.
ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
Comments