*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం
అవును! ప్రార్ధనలో మొట్టమొదట నీపై నీవే విజయం సాధించ గలిగితే? అప్పుడు నీ ప్రార్ధన విజయం సాధిస్తుంది.
మన పరిచర్య, ప్రసంగాలు, సాక్ష్యాలు అన్నింటికంటే ప్రార్ధన అంటేనే సాతానుకు ఎక్కువ భయం. అందుచే మనం ప్రార్ధించ కుండా చేయడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు.
ప్రార్ధన చేద్దాం అనుకొనేసరికి నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది. మన ప్రక్కింటివారు ఆ సమయంలోనే వచ్చి మన దగ్గర కూర్చుంటారు. వారిని వెళ్ళమనలేము. అట్లా అని, వారితో కలసి ప్రార్ధించలేము.
ఇట్లా అనేకం.
విజయం కోసం చేసే ప్రార్ధన ఒక అలసటతో కూడినపని. అనేకమంది క్రైస్తవులు కొన్ని నిమిషాలు కూడా ప్రార్ధనలో గడపలేనంత ఆత్మీయ అనారోగ్యముతోను, ఆత్మీయ బలహీనతలోనూ ఉంటారు. మరికొందరు వారు జీవించే జీవితాలు ప్రార్థనకు పూర్తిగా దూరంగా ఉంచుతాయి. ప్రార్ధన అంటే భయపడేలా చేస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ ప్రార్ధించినా ఆ ప్రార్థనలకు సమాధానం రాదు.
అందుచే, మొట్టమొదటగా మన ప్రార్ధనాలేమిని గుర్తించాలి. తప్పక ఒప్పుకోవాలి. దాని నుండి విడిపించమని దేవునిని ప్రార్ధించాలి. మనము ఆత్మతో నింపబడాలి. ప్రార్ధించడంలో ఆనందించాలి. అనవసరమైన పనులను ప్రక్కనబెట్టి ఎక్కువ సమయం ప్రార్ధించడానికి ఆసక్తి కలిగి యుండాలి. వీటిపై విజయాన్ని సాధించగలగాలి.
దావీదు ఉప వాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.
2 సమూయేలు 12:17
దావీదు ఉపవాసముండి ఏడు దినములు ప్రార్ధించినప్పటికీ అతని ప్రార్ధన దేవుడు ఆలకించలేదు.
కారణం?
దావీదు యెహోవాను లక్ష్యము చెయ్యకుండా వేరొకని భార్యను తన భార్యగా చేసుకున్నాడు. వారికి కలిగిన బిడ్డ జబ్బు పడినప్పుడు, ఆ బిడ్డకొరకు ఉపవాసముతో ప్రార్ధించినప్పటికీ దేవుడు పట్టించుకోలేదు. ఫలితం ఆ బిడ్డ మరణం.
అదేంటి? దావీదు 'రాజు' కదా? దేవుని హృదయానుసారుడు కదా? ఆయన ప్రార్ధన దేవుడు వినక పోవడమేంటి?
అవును! ఈలోకంలో ఎంతటి ఘనులైనా కావచ్చు. వారి జీవితంలో పాపం ఏలుబడి చేస్తుంటే? వారి ప్రార్థనకు సమాధానం రాదు. దానికి దావీదు జీవితమే ఒక గొప్ప ఉదాహరణ.
సత్పర్తన కలిగి, విరిగినలిగిన హృదయంతో ప్రార్ధించేవారు వారెంతటి సామాన్యులైనా తప్పక వారి ప్రార్ధన దేవుడు ఆలకించి, ప్రతిఫలాన్నిస్తాడు.
నేటి దినాలలో హంగులు, ఆర్భాటాలు, పబ్లిసిటీ కలిగిన సేవకులకు వారియొక్క ప్రార్ధనావసరతలు తెలియజేసి, వారు మాత్రం హాయిగా నిద్రపోయేవారెందరో.
ఒక్క విషయం ఆలోచిద్దాం!
మనకు లేని భారం వారికెందుకుంటుంది? నీవు తెలియజేసావు కాబట్టి ఏదో ఒకసారి ప్రార్ధిస్తారేమో? అట్లాఅని వారు ఒకసారి ప్రార్ధించినంతమాత్రాన జరిగిపోతుందా?
ఈలోకం మనుషుల పేరు ప్రతిష్టలు చూచి వారి వైపు పరుగులు తీయాల్సిన పనిలేదు. నీ జీవితాన్ని సరిచేసుకొని ప్రార్ధించి చూడు. తప్పక ప్రతిఫలాన్ని పొందుతావు. అంతేకాదు. నీకు నీవే ప్రార్ధించి పొందుకొనే ప్రతిఫలం నీ జీవితంలో చెప్పలేని సంతోషాన్ని కలిగిస్తుంది.
గెత్సేమనె తోటలో తాను విజయం పొందేవరకు యేసు ప్రార్ధించాడు. ఆయనను బలపరచేందుకు దేవుడు ఒక దేవదూతను పంపునంతగా ఆయన ప్రార్ధించ గలిగాడు.
ప్రార్ధిద్దాం! ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేయండి
Comments