*CHRIST TEMPLE - PRODDATUR*
Telugu Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నా ఫ్రీడం..నా ఇష్టం..అనుకుంటున్నావా..
స్వేచ్ఛ జన్మహక్కే. స్వేచ్ఛ దొరికింది కదా అని తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఇవి స్వయంకృతాలు. బైబిల్‌లోని ముగ్గురు వ్యక్తులు దొరికిన స్వేచ్ఛను ఎలా వినియోగించుకున్నారో చూద్దాం.
👉 1.ఆదిలో భూతల స్వర్గంలా ఉన్న దేవుని ఏదేను తోటలోని ఫలాలన్నీ తినండి. కాని ఈ ఒక్క ఫలం మాత్రం తినకండని తొలి మానవ దంపతులతో ప్రభువు చెప్పినా వారు అవిధేయులై నష్టపోయి, పవిత్ర ఆత్మను కోల్పోయారు. తిరిగి దైవ సన్నిధానాన్ని పొందేందుకు ఎన్నో బాధలు అనుభవించాల్సి వచ్చింది. ఇలా దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు.
(ఆది:2:16-17).
👉 2. దాదాపు ఈ కోవకు చెందినవాడే కొత్త నిబంధనలోని దారి తప్పిన కుమారుడు.
ఆస్తిలో తన వాటా ఇమ్మని అడిగిన చిన్న కుమారుని కోరిక మేరకు తండ్రి ఇస్తాడు. సంక్రమించిన ఆస్తితో ఇల్లు వదిలి దూరదేశాలకు వెళ్లి, తనకు నచ్చినట్లు జీవించి, దుర్వ్యసనాలకు లోనై రోడ్డున పడతాడు. బుద్ధి వచ్చినప్పుడు పశ్చాత్వాపంతో తిరిగి వచ్చి, తండ్రి క్షమను పొంది, మంచివాడు అవుతాడు. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే దాని ఫలితం ఇలా ఉంటుంది. కాబట్టి కుటుంబంలో ఏ ఒక్కరు తప్పు చేసినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
(లూకా : 15: 11-32).
*స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి*
ఇశ్రాయేలియులను న్యాయాధిపతులు ఏలిన కాలంలో క్రీస్తుపూర్వం 1300-1200 మద్య, యూదయ దేశంలో కరువు రాగా బెత్లెహేము వాస్తవ్యుడు ఎలిమిలెకు తన భార్య నయోమి ఇద్దరు అవివాహిత కుమారులతో యాభై మైళ్ల దూరంలో ఉన్న మోయాబు దేశానికి వచ్చి కాపురముంటాడు. కుమారులిద్దరికి ఆ దేశపు స్త్రీలు రూతు, ఓర్పాలతో పెళ్లి చేస్తాడు. కొంత కాలానికి ఎలిమిలెకు అతని ఇద్దరు కుమారులు చనిపోగా ఆ ముగ్గురు స్త్రీలు విధవలవుతారు. తన స్వదేశాన్ని దేవుడు దర్శించగా వర్షాలతో పంటలు పండుతున్నాయని విన్న అత్త నయోమి తన ఇద్దరు కోడళ్లతో మీరు మీ మీ తల్లుల ఇళ్లకు వెళ్లి, మళ్లీ పెళ్లి చేసుకుని నెమ్మదిగా ఉండండి అని స్వేచ్ఛనిస్తుంది. నేను మా దేశానికి వెళతాను అంటుంది. కోడళ్లు ఇద్దరూ మేము వెళ్లమని మారాం చేస్తారు. తరువాత ఓర్పా అత్తను విడిచి వెళుతుంది. (రూతు గ్రంధం 1 నుండి 4 అధ్యాయములు)
రూతు మాత్రం అత్తతో తాను వెళ్లనంటే వెళ్లనని, చావైనా బతుకైనా తనతోనేనని, ఆమె జనమే తన జనం అని, ఆమె దేవుడే తన దేవుడని తేల్చి చెబుతుంది. రూతు మనస్సు స్థిరపడిందని గ్రహించిన అత్త కోడలితో బెత్లెహేము వెళ్తుంది. అక్కడ భూస్వామి అయిన తన బంధువు బోయాజు పొలంలో ఇద్దరూ పనికి కుదురుతారు. కొంతకాలం అయ్యాక విధవరాలైన రూతును బోయాజు పెళ్లి చేసుకుంటాడు. వారికి ఓబెదు అనే కుమారుడు పుడతాడు. ఓబెదుకు యషయి, ఇతనికి దావీదురాజు పుడతాడు. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలును ఏలిన రాజు ఇతడే. యూదా గోత్రీకుడు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బోయాజు తండ్రి శల్మాను తల్లి రాహబు. ఆ రీతిగా రూతు ఇద్దరి అత్తల ముద్దుల కోడలైంది. అంతమాత్రమేనా స్వేచ్ఛను సద్వినియోగం చేసుకున్న రూతు క్రీస్తు వంశావళిలో చేర్చబడడం ధన్యకరం. హల్లెలూయ.
స్వేచ్చ ఉంది కదా అని ఇష్టానుసారం జీవించవచ్చు అని అనుకోవద్దు. పదిమందికి ఉపయోగకరంగా జీవించు. మీ కుటుంబానికి అండగా జీవించు. ఇతరులకు ఆదర్శంగా జీవించు.
మాదిరికరమైన జీవితాన్ని జీవిద్ధాం.
దేవుడు అట్టి కృప, ధన్యత మనకు అనుగ్రహించును గాక.
ఆమెన్.
*CHRIST TEMPLE - PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి
Comments