ఆ ఎత్తులో ఉంటే పాములు కదలలేవు

   *CHRIST TEMPLE - PRODDATUR*
Telugu Bible sermons by pastor Nakkolla Balasubrahmanyam Daniel

  ఆ ఎత్తులో ఉంటే పాములు కదలలేవు

ప్రియమైన మిత్రులందరికీ వందనములు. మీ ప్రార్థనా జీవితం ఎలా వుంది..? దినదినంకు ప్రార్థనా సమయం పెంచుతున్నారా..లేక తగ్గిస్తూ ఉన్నారా..? మెలకువ కలిగి ప్రార్థించాలి. మాటలలో కాదు ప్రార్థనలో ఉన్నత స్థితి వుండాలి. అందుకు ఒక ఉపమానం ధ్యానిద్ధాం.

ప్రతి విధమైన ప్రార్ధనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఎఫెసీ 6:18

ఆఫ్రికా నుండి స్పెయిన్‌ లోని ఒక జంతు ప్రదర్శన శాలకు అనేక విషసర్పాలు విమానం ద్వారా ఎగుమతి చేయబడుచున్నవి. ఒక పెద్ద పెట్టె నిండా అనేక విషసర్పాలు ఉన్నవి. దానికి తాళం వేశారు కాని ఆ తాళంపై మరొక పెట్టె పడుట వలన తాళం విరిగి మూత తెరుచు కున్నది. విమానం గాలిలోనికి ఎగురు చున్నప్పుడు ఈ పాములన్నీ పెట్టె నుండి బయటకు వచ్చి ప్రయాణికులు ఉన్న చోట విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించాయి. కొందరు వాటిని చూచి అరచారు. కేకలు పెట్టారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు.

ఎయిర్‌ హోస్టెస్‌ పరుగెత్తుకొని వెళ్ళి ఈ విషయాన్ని పైలెట్‌కు తెలియజేసినది. పైలెట్‌ వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి 'ఈ పాములు విషపూరితమైనవి. ప్రయాణికులను కాటు వేయడానికి ముందే విమానాన్ని ఎక్కడ దించాలో చెప్పండి' అని కంగారు పడిన గొంతుకతో అడిగాడు.

 వెంటనే కంట్రోల్‌ రూమ్‌ నుండి పైలెట్‌ను 'ఎంత ఎత్తులో ఉన్నారు?'  అని అడిగారు. పైలట్‌ '500 అడుగుల ఎత్తులో ఉన్నాము' అన్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుండి 'మీరు ఇంకా ఎత్తుకు వెళ్ళండి' అన్నారు. పైలెట్‌ తన విమానాన్ని ఇంకా ఎత్తుకు తీసుకొని వెళ్ళాడు. కంట్రోల్‌ రూమ్‌ నుండి 'ఇప్పుడు ఎంత ఎత్తులో ఉన్నారు?' అని అడిగారు. అప్పుడు పైలెట్‌ '600 అడుగుల ఎత్తులో ఉన్నాము' అని పైలెట్‌ అన్నాడు. 'ఇంకా ఎత్తుకి వెళ్లండి' అని గ్రౌండ్‌ కంట్రోలర్‌ అన్నాడు.

 అప్పటికి పాములు ఇద్దరిని కాటు వేసాయి. గ్రౌండ్‌ కంట్రోలర్‌ 'మీరు ఇంకా ఎత్తుకి వెళ్లండి. 1200 అడుగుల ఎత్తుకు వెళ్లండి' అని చెప్పారు. పైలట్‌ 'నేను 1200 అడుగుల ఎత్తులో ఉన్నాను' అన్నాడు. 'మీరు అదే ఎత్తులో ఉండండి. మీరు మీ సిబ్బందికి చెప్పండి. ఆ ఎత్తులో ఉంటే పాములు కదలలేవు. కాటు వేయలేవు. మీరు ఆ పాములను చేతితో పట్టుకొని పెట్టెలో పడవేయండి. అన్ని పాములను పెట్టెలో వేసిన తరువాత తాళం వేయండి' అని అన్నాడు గ్రౌండ్‌ కంట్రోలర్‌. సిబ్బంది అందరికి ఆశ్చర్యంగా ఉంది. వారు ఒక పామును పట్టుకుంటే అది బిగుసుకుపోయి ఉన్నది. రెండు నిముషముల తరువాత ప్రయాణికులు అందరూ ఆ పాములతో ఆడుకోవడం ఆరంభించారు. వారిలో చాల మంది తమ జీవితములో మొదటి సారి పాములను చేతితో పట్టుకొన్నారు. 'కొంచెం ముందు ఈ నల్ల త్రాచు నన్ను భయపెట్టినది. ఇప్పుడు ఇది నా చేతిలో బంతిలా  ముడుచుకొని ఉన్నది' అంటూ ఆ పామును ఒక ప్రయాణికుడు తన పది సంవత్సరముల కుమారుని వైపు విసిరాడు.

ఆ అబ్బాయి ఆ పామును ధైర్యంగా పట్టుకొని పెట్టె లోనికి విసిరాడు. పాములన్నిటిని పెట్టెలోనికి విసిరిన తరువాత స్పృహ తప్పిన వారికి వైద్యం చేసారు. వారు కూడ కోలుకున్నారు. మొత్తానికి ఈ పాముల వల్ల ఎవరికీ హాని జరగకుండానే పాములన్నిటినీ పెట్టె లోనికి చేర్చారు.

మన జీవితములో కూడ ఈ పాముల వంటి సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు మన చుట్టూ చేరి మనలను గందరగోళానికి గురి చేయవచ్చును. అప్పుడు మనం మన ప్రార్ధనను ఎత్తుకు తీసుకొని వెళ్ళాలి. మనం ఎంత ఎక్కువగా ప్రార్ధన చేస్తామో అప్పుడు మన సమస్యలు అంత బలహీనమవుతాయి. జయించ లేని మన సమస్యల యొక్క బలం తగ్గిపోతుంది. ఎటువంటి సమస్యనైనా ప్రార్ధన ద్వారా అధిగమించగలము.
నీప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే? ప్రార్ధించే నీవు దేవునిచే అంగీకరించబడాలి. అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రతిఫలం వస్తుంది. 

నీవు ప్రార్థన చేయునపుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్య మందున్న నీతండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్య మందు 'చూచు' నీతండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి 6:6

రహస్య ప్రార్థన లో దేవుడు నీప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు. 'చూస్తాడట'. 
ఏమి చూస్తాడు? నీహృదయాన్ని చూస్తాడు. నీ ప్రతీ పాపము ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకున్నావో? లేక కప్పుకున్నావో?అని. కప్పుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. 

కనీసం ఇప్పుడైనా ఒప్పుకొనే ప్రయత్నం చేద్దాం..! 
ఒప్పుకోవడానికి భయమెందుకు.? నీ జీవితం అంతా ఆయనకు తెలుసు. 

దావీదు అంటున్నాడుకదా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియును నాకు తలంపుపుట్టకముందే నీవు నామనస్సు గ్రహించుచున్నావు నీ ఆత్మ యొద్దనుండి నేనెక్కడకు పొవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును.? 
కీర్తన 139:2,7. 

నీప్రతీ కదలిక ఆయనకు తెలియును. ఏమి తెలియని వాళ్ల దగ్గర నటించవచ్చు. అన్నీ తెలిసిన వాళ్ల దగ్గర నటించడం సాధ్యం కాదుకదా? అట్లాంటప్పుడు, ఆయన దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గు పడాల్సిన పనిలేదు. ఎంత ఘోర పాపినైనా? ఆయన క్షమించి రక్షిస్తాడు. 

గతంలో చేసిన పాపములను ప్రతీసారి సాతాను ఙ్ఞాపకములోనికి తీసుకొచ్చి పాములాగా నీ చుట్టూ చేరి నీవు ఆతప్పు చేసావు. ఈతప్పు చేసావంటూ నిన్ను కృంగదీస్తూంటాడు. 

అయితే నీవు ఒకసారి ఒప్పుకొన్న పాపాలను ప్రతీసారి ఒప్పుకోనవసరం లేదు అట్లా చేస్తున్నావంటే. నీ పాపమును దేవుడు క్షమించాడు అని నమ్మకం నీకులేనట్లే. 

ఈ రహస్య ప్రార్థన అనుభవం, సమయం నీ జీవితం అంతా కొనసాగాలి... ఎందుకంటే? 
మన చూపులు, తలంపులు, క్రియలు పరిశుద్దమైనవి కావు. అందుకే, అనుదినం రహస్య ప్రార్థన మన జీవితం లో వుండాలి. ఆ ఫ్లైట్ ఎంత ఎత్తుకు వెళ్లిందో ..ఆ ఎత్తులో  పాములు ఏమీ చేయలేకపోయాయి. హల్లెలూయ. ప్రతి దినం నీ ప్రార్థన సమయం పెంచు.

అట్లాఅని, అనుదినం తప్పుచేస్తూ ఒప్పుకొంటూ వుండకూడదు. ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి.అప్పుడు నీవు దేవుని చేత అంగీకరించబడతావు. నీవు చేసిన ప్రార్థన దేవునిచేత అంగీకరించబడి, ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. 

నీ కన్నీరు తుడవబడాలి అంటే? 
కన్నీటి ప్రార్దనే శరణ్యం. 
ఆ కన్నీరు కార్చేముందు 
రహస్య ప్రార్ధనలో నీ హృదయం కడుగబడాలి. 

కల్వరిలో నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యను చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాలచెంత కృమ్మరించు. 
ఆయన బిడ్డగా మార్పు చెందు. 
ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్

     *CHRIST TEMPLE - PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి

Comments