నీ సంగతి ఏంటి..ఇక మారవా..

  *CHRIST TEMPLE - PRODDATUR*

Telugu Bible sermons by pastor Nakkolla Balasubrahmanyam Daniel

   నీ సంగతి ఏంటి..ఇక మారవా..

ప్రవర్తన (నడత) అంటే? చూపులు, తలంపులు,మాటలు, క్రియలు అన్నింటి సమూహమే ప్రవర్తన. చూపులలో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము.

తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే? మాటలలోనూ, క్రియలలోనూ పరిశుద్ధతను కోల్పోతాము. తద్వారా మన ప్రవర్తన మలినమై, పాపమునకు మరింత దగ్గరై, దేవునికి దూరమై పోతాము.

*తన ప్రవర్తన విషయమై అజాగ్రతగా నుండువాడు చచ్చును.సామెతలు 19:16*

ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే? శారీరికముగా బ్రతికియున్నా, ఆత్మీయముగా చచ్చినవారమే. సందేహం లేనేలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి, రాజైన దావీదే.

చూపులలో, తలంపులలో, క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారుల, నరహంతకుల జాబితాలో చేరిపోయాడు.

దేవుని చేత "నా హృదయానుసారుడు" అని సాక్ష్యము పొందినవాడు.

తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా వుండడం వల్ల ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చింది?

•పుట్టిన బిడ్డ చనిపోయాడు.

•పిల్లలు వ్యభిచారులు,హంతకులయ్యారు.

•కన్నకొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు.

•కనీసం చెప్పులు లేకుండా రాజైన దావీదు కొండలకు పారిపోవలసి వచ్చింది.

•కుక్క వంటి "షిమి " ఓ దుర్మార్గుడా, నరహంతకుడా! ఛీ! ఫో ...అంటూ దూషిస్తూ, శపిస్తూ వుంటే, మౌనముగా తల వంచాల్సి వచ్చింది.

•దేవుని పక్షంగా యుద్దాలు చెయ్యడానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్దాలు చెయ్యొద్దని ప్రమాణం చేయించారు.

ఇట్లా... ఎన్నో! ఎన్నెన్నో! అయినా నీ సంగతేమిటి? మిత్రమా...ఇంటర్ నెట్ లో చూడకూడనివి చూస్తూ, ఆహా.. చూపులలో పరిశుద్ధతను కోల్పోయి, తద్వారా హృదయ తలంపులను పాడుచేసుకొని, పాపం చెయ్యడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నావా? అయ్యో..అయితే ఒక్క విషయం!!
'హృదయానుసారుడే' దావీదు తప్పించుకోలేక పోయాడు. ఇక నీకెట్లా సాధ్యం? నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే? ఒక్కటే మార్గం. వాక్యమైయున్న దేవునిని నీ హృదయంలో వుంచుకొని, నీ ప్రతీ కదలికలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి.

*యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?కీర్తనలు 119:9*

అవును! యౌవనుడైన యోసేపును పాపం పట్టుకోవాలని, బంధించాలని ప్రయత్నం చేస్తుంటే? దానికి చిక్కకుండా పారిపోతున్నాడు. ఇంటిలో పాపముందని, యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు.

అందుకే గదా! బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు. దేశ ప్రధాని అయ్యాడు. నీ జీవితం ఎట్లా వుంది? ఈలాంటి నిష్టతో కూడిన యవ్వనస్తులు దీవెనలు పొందుతారు.
మరి..నీ సంగతి ఏంటి...?
పాపమును పట్టుకోవడానికి దాని వెంటబడి పరుగులు తీస్తున్నావా?
దాని చేతిలో బంధీగా మారిపోయావా?

అందుకే గదా! రాజులుగా బ్రతకాల్సిన అనేక మంది ఇంకా సాతానుకు బానిసలుగానే జీవిస్తున్నారు?

*నీ,యౌవనమునుబట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.1తిమోతి 4:12*

ఒక్కసారి ఆలోచించు. నీ జీవితం ఎటువైపు సాగిపోతుందో? దేవుని పిల్లలముగా మన ప్రవర్తన మనలను తృణీకరింపచేసేదిగా ఉందా?
లోకము నుండి ప్రత్యేక పరచబడిన మనమూ, మన ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా ఉండాలి.

ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!

మాదిరికరమైన జీవితాన్ని జీవిద్ధాం.
దేవుడు అట్టి కృప, ధన్యత మనకు అనుగ్రహించును గాక.
ఆమెన్.
    *CHRIST TEMPLE - PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి

Comments