నాన్నా..యూ ఆర్ సో గ్రేట్
*CHRIST TEMPLE - PRODDATUR*
Telugu Bible sermons by pastor Nakkolla Balasubrahmanyam Daniel
నాన్నా..యూ ఆర్ సో గ్రేట్
ఒక ఇంట్లో 80 సంవత్సరాలు వయసున్న తండ్రి, 45 సంవత్సరాల వయసున్న కొడుకు ఉన్నారు. ఒక రోజు ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా ఒక కాకి వచ్చి వాళ్ళ ఇంటి కిటికీ మీద వాలింది.
అది ఏమిటి? అని తండ్రి, కొడుకుని అడిగాడు.
కాకి అని చెప్పేడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి
ఇప్పుడే కదా కాకి అని చెప్పేను అన్నాడు కొడుకు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు మొహం చిట్లించుకుని అసహనంతో ” అది కాకి, కాకి ” అని గట్టిగా చెప్పేడు.
మళ్ళీ కొన్ని నిమిషాల తరవాత అది ఏమిటి? అని అడిగాడు తండ్రి.
కొడుకు గట్టిగా అరుస్తూ ఇలా అన్నాడు” ఎందుకు నాన్నా ఒకటే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగుతావు. అది కాకి అని 4సార్లు చెప్పేను, అర్థంకావట్లేదా”
కొంచంసేపటి తరవాత తండ్రి గదిలోకి వెళ్ళి ఒక డైరీ తెచ్చాడు. కొడుకు చిన్నప్పటి విషయాలు అన్నీ అందులో ఉన్నాయి. ఒక పేజి తీసి చదవమని కొడుకు చేతికి ఇచ్చాడు.అందులో ఈ విధంగా రాసి ఉంది.
“ఇవాళ నా మూడేళ్ళ కొడుకు నాతోపాటు సోఫాలో కూర్చున్నాడు. ఒక కాకి వచ్చి కిటికీ మీద వాలింది. అది ఏమిటి నాన్నా? అని వాడు 23సార్లు అడిగాడు. ప్రతిసారీ నేను ప్రేమతో వాడిని దగ్గరికి తీసుకుని కాకి అని చెప్పేను. వాడు అన్నిసార్లు అడిగినా నాకు కోపం రాలేదు, పైగా వాడి అమాయకత్వానికి నవ్వు వచ్చింది.”
కొడుకు చిన్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా తండ్రి ఓపికగా అర్థమయ్యేలా చెప్పేడు. ఇవాళ అదే తండ్రి ముసలివాడు అవ్వడంవల్ల 4సార్లు అడిగితే కొడుకు విసుక్కుంటున్నాడు.
*నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. సామెతలు 23:25*
👉 నీతి: తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్దచేస్తారు. వాళు ముసలివాళ్ళు అయ్యాక విసుక్కోవడం, చులకనగా చూడడం చెయ్యకూడదు. వాళ్ళు పంచిన ప్రేమని, వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండడం పిల్లల బాధ్యత. కళ్ళ ఎదుట కనిపించే తల్లి, తండ్రిని ప్రేమించలేని వారు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు..?
ఎంతమంది మీ తల్లి,తండ్రిని సంతోషంగా చూసుకుంటున్నారు..? కనీస గౌరవం కూడా ఇవ్వలేని దుర్మార్గపు పిల్లలు కూడా వున్నారు ఈ లోకంలో. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి...
మనుష్యులు దేవుని ఎదుట తమతమ మార్గములను చెరిపివేసుకున్నారు, ప్రతిగా వారిపై దేవుని ఉగ్రత; అదే మహాజలప్రళయం....వచ్చింది.
అయితే నీతిమంతుడైన ఒక్క నోవహు కుటుంబము మాత్రమే ఓడలోనికి ప్రవేశించింది, రక్షించబడింది, భూమిపై మిగిలినవన్నీ నీటమునిగి నశించిపోయాయి.... అటుతరువాత భూమిపై నీటిమట్టం తగ్గి భూమి కనిపించిందో లేదో తెలుసుకొనుటకు నోవహు ఓడ కిటికీ తీసి ఒక పావురాన్ని బయటకు విడిచారు; ఆ సాయంత్రం ఆ పావురం వస్తూవస్తూ "త్రుంచబడిన ఒక ఒలీవ చెట్టు ఆకును తీసుకొచ్చింది" (ఆది 8:10,11)
అంతపెద్ద వినాశనం తరువాత మొదట వేగంగా చిగురించినదే ఈ “ఒలీవ మొక్క”
అంత పెద్ద జలప్రళయం వల్ల భూమిపై అన్ని నశించాయి కానీ ఈ “ఒలీవ మొక్క” వెంటనే చిగురించి కనిపించింది.
విస్తారమైన నీరు ఈ ఒలీవ మొక్కపై ప్రవహించిన అది నశించిపోలేదు అలాగే నీ పిల్లలపై లోకం దాడి చేసిన నీ పిల్లలు జయిస్తారు, లోకం వారిపై ప్రభావం చూపలేదు, లోకాశలు వారిపై ప్రభావం చూపలేవు, విస్తారంగా పెరుగుతున్న పశ్చాత్యపు పోకడలు వారిని ఆకర్షించలేవు, జలప్రళయంతో పడిపోయిన ఆ ఒలీవ మొక్క వెంటనే తిరిగి లేచింది....
నీతిమంతుడు ఏడుమార్లు క్రింద పడినను వాడు తిరిగి లేస్తాడు అన్న (సామెతలు 24:16) వాక్యం మీ పిల్లపై నిలిచిఉంటుంది. వాళ్ళు ఒకవేళ పడిపోయినా... పడిపోయిన చోటే ఉండిపోరు తప్పక వారు తిరిగి వేగంగా లేస్తారు. ఇలాంటి ఒలివ మొక్కలవంటి పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఉంటారు.
ఎప్పుడో తెలుసా.... “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడచినప్పుడు”
యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.కీర్తనలు 112:1
చిన్న కుమారుడు తండ్రి మాట వినకుండా లోకంలో ఉన్న జల్సాలకు ఆకర్షితుడై , అలవాట్లు చేసుకొని చచ్చిపోయే స్థితిలో తిరిగి మళ్లీ తండ్రి దగ్గరికి వచ్చాడు.
అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.లూకా సువార్త 15:17_24
మనం పిల్లలను కనగలం కానీ వారి రాతను కనలేము అని కొందరు పెద్దలు చెబుతూఉంటారు.... కానీ గాలిలో దీపం పెట్టకుండా, మనలో ఏమయినా కొద్దిపాటి భక్తి ఉంటె అది మన రాబోవు తరాలకు కాపుదలగా, కావలిగా తప్పక ఉంటుంది. మనం మన రాబోవు తరాలకు ఉపదేశించగలము, నేర్పించగలము మరియు వారికీ మాదిరి చూపించగలము.
మరచిపోవద్ధండి.. నేడు మీ పిల్లల మోకాళ్ళు దేవుని ముందు మీరు వంచలేకపోతే; రాబోయే రోజుల్లో వాళ్ళు నడివీధిలో మీ మెడలువంచి, సిగ్గుతో మీరు తలదించుకునేలా చేసే ప్రమాదం ఉంది.
ఈ సందేశం చదువుతున్న ప్రియ స్నేహితుడా..నాన్నా ప్రేమ అర్థం చేసుకోండి. నిన్ను ఎంత ప్రేమించాడు, ఆయన తినకుండా నీకు పెట్టాడు, తన కష్టం నీ స్థితి మార్చింది అని గుర్తుపెట్టుకోవాలి. వృద్దాప్యంలో ప్రేమను పంచండి. మీరు ఏమి విత్తనం వేస్తారో అదే విధంగా పంట కోస్తారు. నాన్నా గొప్పవాడు మర్చిపోవద్దు.
మరి ఉత్తమమైన మార్గం ఏమిటో తెలుసా.... మనం యెహోవాయందు భయభక్తులు కలిగి అయన త్రోవలలో నడవటం, మన తరువాత తరాన్ని భక్తిలో పెంచటం.
దీని ఫలితంగా మీకు వచ్చే సాక్షమే “నీ పిల్లలు ఒలీవ మొక్కలు....” అని.దేవుడు అట్టి కృప, ధన్యత మనకు అనుగ్రహించును గాక.
ఆమెన్.
*CHRIST TEMPLE - PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి
Comments