*CHRIST TEMPLE-PRODDATUR*
ఆమె మొత్తం గ్రామాన్ని దేవుని ప్రేమతో నింపింది..ఎవరు ఆమె..?
'సుఖారు' అనే నిషిద్ధ సమరయ గ్రామాన్ని ఒకసారి యేసుప్రభువు తన శిష్యులతో సందర్శించాడు. ఆయన అలిసిపోయి, దాహంతో అక్కడి యాకోబు బావి వద్ద కూర్చున్నాడు. ఇంతలో... అప్పటికి ఐదుగురు భర్తల్ని వదిలేసి మరొక వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఒక స్త్రీ నీళ్లు తోడుకోవడానికి బావి వద్దకు వచ్చింది.
యేసు ఆమెతో సంభాషించి, ఆమె ఆత్మీయ దాహాన్ని తీర్చాడు. అలా యేసు ప్రభువు ప్రేమనూ, క్షమా సువార్తనూ విని ధన్యురాలైన ఆ స్త్రీ పరుగెత్తుకొని వెళ్లి, ''నేను క్రీస్తును కనుగొన్నాను! ఆయన్ను మీరు కూడా వచ్చి చూడండి!'' అంటూ గ్రామస్థులందరికీ 'సువార్త' ప్రకటించింది. వాళ్లంతా వచ్చి యేసును చూసి, ఆయన బోధ విని ఆయనను విశ్వసించారు (యోహాను 4: 4-42).
ఒక అస్పృశ్యుల గ్రామంలో, సమాజం అంతగా గౌరవించని ఒక స్త్రీ పరిచర్య, ప్రోత్సాహంతో, ఇలా అనుకోకుండా ఒక అద్భుతమైన 'సువార్త మహాసభ' జరిగింది. వందలాదిమంది సువార్తను అంగీకరించగా, దేవుని రాజ్యం దివ్యంగా కట్టబడిన ఒక అరుదైన సంఘటన ఇది.
ఇంతకీ ఆ సమరయ స్త్రీ చేసిన పరిచర్యలోని విశేషమేమిటి? ఏమీ లేదు! యేసు ప్రభువనే జీవజలమున్న బావి నీటిని తాను ముందుగా సేవించి, ఆత్మీయ దాహం తీర్చుకొంది. ఆ బావి వద్దకు తన గ్రామ ప్రజల్ని తీసుకొచ్చి, ఆ బావిలోని జీవజలాన్ని వారికీ తోడి పోసింది. అలా గ్రామస్థుల ఆత్మీయదాహం కూడా తీర్చింది. ఒక బావి, దాంట్లో పుష్కలంగా నీళ్లుంటే సరిపోదు! అవి చేది ప్రజలకు పోసే ఒక వ్యక్తి తప్పక కావాలి!! తన పరిచర్య కోసం ఆహ్వానించిన పరిచారకులు, సువార్తికులు, బోధకులకు... దేవుడు ఆ పనే అప్పగించాడు. వారి పని దానికే పరిమితం.
కానీ 'ఈ నీళ్లు తోడిపోసిన నేనే గొప్ప!' అన్న అహంకారం పరిచారకుల్లో తలెత్తిన మరుక్షణం వారి పతనం ప్రారంభమవుతుంది. అందుకే పరిచారకుల్లో వినయం, దీనత్వం, సరళత్వం, మృదుత్వం, సాత్వికత్వం, పారదర్శకత వంటి దైవిక సుగుణాలు ఎంత పుష్కలంగా ఉంటే వారి పరిచర్య అంత ఫలభరితంగా ఉంటుంది. 'ఈ నీళ్లు నావి' అని బావి మిడిసిపడినా అర్థమున్నదేమో కాని, నీళ్లు తోడిపోసిన వ్యక్తి, చాంతాడు, బకెట్టు మిడిసి పడితే అర్థమేమైనా ఉందా?
కానీ 'సెలబ్రిటీలు'గా అవతారాలెత్తుతున్న నేటి అతి సాధారణ పరిచారకులతో అదే సమస్య తలెత్తుతోంది. యేసయ్యలా సామాన్యులతో కలిసి నడిచే పరిచారకులు ఎందరు..? సామాన్యుల్లోకి, అస్పృశ్యుల్లోకి కూడా చొచ్చుకొని పోయి, వారి జీవితాలను స్పృశించి ధన్యం చేసిన ప్రేమ యేసుప్రభువుది కాగా, 'ఆయన పరిచారకులేనా వీళ్ళు?' అనిపించేలా ఉంటున్నాయి డాబు, దర్పంతో కూడిన ఈనాటి పరిచారకుల పోకడలు! వినయం లేకపోగా అహంకారంతో నిండిన పరిచారకులను ఏమనాలి? దేవదూతల్ని దయ్యాలుగా మార్చింది ఆ అహంకారమే కదా! అహంకారం శాపాలకు, వినయం ఆశీర్వాదాలకు ద్వారాలు అని తెలిపే ఉదంతాలు బైబిల్లో ఎన్ని లేవు? దేవుని రాజ్యాన్ని కట్టేది... పాపిని ప్రభువు వైపునకు తిప్పి పరివర్తన తెచ్చేది... తన వంటి వ్యక్తిని దర్శించి, గౌరవించిన యేసు పట్ల వినయం, కృతజ్ఞత మూర్తీభవించిన ఆ సమరయ స్త్రీ వంటి స్వచ్ఛమైన సువార్తికులే! సిద్ధాంతాలు, మర్మాలు, మేధావుల చర్చలు కాదు... స్వచ్ఛమైన యేసు క్షమా సువార్త మాత్రమే దేవుణ్ణి ప్రజలకు చేరువ చేస్తుంది. ''ఇదిగో చూడండి, ఆయన నన్ను మార్చాడు! వచ్చి ఆయన మాటలు వింటే మీరూ మారుతారు!!' అంటూ తన అనుభవాన్ని జోడించి ఆమె ప్రకటించిన 'సువార్త' మొత్తం గ్రామాన్ని దేవుని ప్రేమతో నింపింది. అందుకే యేసు ఎన్నుకున్న అసమాన సువార్తికురాలు ఆ సమరయ స్త్రీ!
మంచి నిర్ణయాలు తీసుకొని ఆశీర్వాదములు పొందుదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనలకు అనుగ్రహించును గాక. ఆమెన్.
*CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి
Comments