ఒకని అణగద్రొక్కి పైకి రావాలని అనుకోవద్దు..

  *CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

ఒకని అణగద్రొక్కి పైకి రావాలని అనుకోవద్దు..

ఒకని దురాశ మరియు దుష్టత్వము అనేకమందిని దుఃఖము మరియు వేదనలకు గురిచేస్తుంది. మనలో అనేకమంది తమ జీవితంలో అన్యాయాన్ని ఎదుర్కుంటారు. అది దేవుని సేవ అయినా..వ్యాపారం, ఉద్యోగం, జీవితంలో ఏ దానిలో అయినా...మనకు అన్యాయం జరిగినప్పుడు మనం దానికి ఏవిధంగా స్పందిస్తామనునది చాలా ప్రాముఖ్యమైన విషయం.

ఒకసారి ఒక తండ్రి మరియు తన కుమారుడు భయంకరమైన మంచు తుఫానుకు ఆకులు రాల్చిన ఒక చెట్టును చూచారు. ఆ చెట్టు చనిపోయిందేమో అనుకుని వంట చెరకు కొరకు దానిని నరికివేసారు. అది శీతల దేశం మరియు శీతాకాలం. కానీ ఋతువు మారగానే ఆ మోడులోనుండి మొలకలు రావడం ప్రారంభించాయి. అది గమనించిన తండ్రి తన కుమారునితో, “అయ్యో, ఈ చెట్టు చనిపోయిందని అనుకుని దీనిని నరికివేశాం. కానీ దీనికి ఇంకా ప్రాణము ఉంది. కుమారుడా, ఒక పాఠం మనం నేర్చుకోవాలి. మంచు తుఫానులో చెట్లు నరకకూడదు; అలాగే, వేదనలో నిర్ణయాలు తీసుకోకూడదు” అని చెప్పాడు.
వేదనలో  ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి గాని తొందరపాటు పనికిరాదు. తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు నష్టమును కలుగజేస్తాయి. 
పాత నిబంధన భక్తులు దేవుని ఉగ్రతయందు నమ్మికయుంచాడు. క్రొత్తనిబంధన విశ్వాసులముగా మనకు మరింత ఉన్నత విలువలు ఇవ్వబడ్డాయి. “మిమ్మును బాధించువారికొరకు ప్రార్థనచేయుడి” అని యేసు అజ్ఞాపించారు (లూకా 6:28). 

మనకు జరిగిన అన్యాయమునకు మనం ఏవిధంగా స్పందించాలి? “కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు; మనుష్యులందరి దృష్టికి యోగ్యమైనవాటినిగూర్చి ఆలోచన కలిగి యుండుడి.  శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా,మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. కాబట్టి, నీ శత్రువు ఆకలిగొనియుంటే అతనికి భోజనము పెట్టుము,దప్పిగొనియుంటే దాహమిమ్ము; ఆలాగు చేయుటవలన అతని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము” (రోమా 12:17-21).

ఈ విచారకరమైన గాధయంతటిలో షెకెము వారు తీసుకున్న నిర్ణయమును మనం గుర్తించాలి. వారి నిర్ణయం వారిమీదికి ఎటువంటి ఉపద్రవము తెచ్చిందో మనం తెలుసుకోవాలి. గిద్యోను మరణం తరువాత అబీమెలెకు తమకు నాయకునిగా ఉండుటకు ప్రయత్నించినప్పుడు వారు న్యాయమును మరచి అతని వెంబడించారు. గిద్యోను షెకెము వారి కొరకు చేసిన త్యాగమును మరిచిపోయి అతని కుమారులను చంపిన అబీమెలెకు చేతులను వారు బలపరచారు(న్యాయాధిపతులు 9:24). మన ముందుకు ఒక అవకాశము వచ్చినప్పుడు, అది ఎంత గొప్పదైనప్పటికి తొందరపడి ఆ మార్గములో వెళ్ళకూడదు. దేవుని చిత్తమేదో తెలుసుకుని ప్రవర్తించాలి. న్యాయన్యాయములు ఎరిగి ప్రవర్తించాలి. నేటి ప్రపంచములో తోటివారిని అణగద్రొక్కి అభివృద్ధిని సాధించుట పరిపాటి. కానీ మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రతిఫలము ఉంటుంది.    

అబీమెలెకు రాజైన మూడు సంవత్సరాలలో దేవుడు అతనికి మరియు షెకెము వాసులకు మధ్య దురాత్మను పంపెను. అప్పుడు వారు తాము ఎన్నుకున్న నాయకునికి వ్యతిరేకంగా పనిచేయుటకు పూనుకున్నారు. నిలకడలేని మనుష్యులుగా మరొకని నాయకత్వమును కోరుకున్నారు. ఆ వార్త అబీమెలెకునకు తెలియగానే వారిపై పడి వారిని హతమార్చాడు. వారు నాశనమును కొనితెచ్చుకున్నారు.

చాలా సార్లు మనము తీసుకున్న నిర్ణయాలే మనలను ఆయా గమ్యాలకు చేరుస్తాయి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం దేవుని వద్ద కనిపెట్టి బహు జాగ్రత్తగా తీసుకోవాలి.మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును (గలతీ 6:7). షెకెమువారు తమ నిర్ణయానికి తామే బలైపోయారు. అబీమెలెకు నిర్ణయానికి అతడు కూడా ఒక స్త్రీ చేత చంపబడ్డారు. (న్యాయాధిపతులు 9:53)

ఒకానొక గ్రామంలో ఒక వ్యవసాయదారుడు ఆదివారం కూడా వ్యవసాయం చేస్తుండేవాడు. అంతేకాకుండా, అటుగా పోయే క్రైస్తవులను చర్చికి వెళ్తున్నందుకు హేళన చేసేవాడు. “వారు ప్రార్ధన చేస్తారు కదా, నా అంత దిగుబడి వారికి వస్తుందేమో చూస్తా.” అనే వాడు. అక్టోబరు నెలలో కోతకాలం వచ్చినప్పుడు, ఆ ప్రాతంలో అందరికంటే అతడికి ఎక్కువ దిగుబడి వచ్చింది. మరుసటి దినం, “చర్చికి వెళ్లి ఏమి ప్రయోజనం? నాకే ఎక్కువ దిగుబడి వచ్చింది” అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అది చూచి బాధపడిన క్రైస్తవులు అలోచించి మరునాడు “దేవుడు తన లెక్కలు చూచేది అక్టోబరు నెలలో కాదు, లెక్కలు చూచే రోజు వేరే ఉంది” అని తిరిగి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారట. నిజమే మనం తీసుకునే నిర్ణయాలకు, చేసే పనులకు మనకు తప్పనిసరి ప్రతిఫలం ఉంటుంది.

దేవుడు న్యాయము జరిగించువాడు అను సత్యమును అబీమెలెకు జీవితంలో మనం మరలా చూస్తున్నాము. జీవితంలో పైకి రావడానికి ఇతరులను అణచినప్పుడు, లేదా ఇతరులతో చేతులు కలిపినప్పుడు దేవుడు మనలను చూస్తున్నాడు. మన క్రియలకు మనమే ప్రతిఫలం పొందుకుంటామని జ్ఞాపకముంచుకోవాలి. మనము అన్యాయమునకు గురైనప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవునికి మనలను మనం సమర్పించుకుని నెమ్మదితో అయన కార్యము కొరకు వేచియుండాలి.
మంచి నిర్ణయాలు తీసుకొని ఆశీర్వాదములు పొందుదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనలకు అనుగ్రహించును గాక. ఆమెన్.

       *CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి

Comments