*CHRIST TEMPLE-PRODDATUR*
ఈ మహా పవిత్రదినాలు
ఉపవాస ప్రార్థనా దినాలు అంటే 'లెంట్ సీజన్'గా పిలిచే ఈ కాలం (భస్మ బుధవారం నుండి గుడ్‌ఫ్రైడే వరకు) క్రైస్తవుల్లోని కొన్ని శాఖలకు చెందిన విశ్వాసులకు ఎంతో ముఖ్యమైన రోజులు. చరిత్రలో ఇవి ఎప్పుడు ఆరంభమయ్యాయి, ఏ ఆచారాలు వాటికి మూలం అనే విషయాల పక్కనబెడితే 'ఉపవాస ప్రార్థన' అనేది బైబిల్‌లో ఎంతోమంది భక్తులు ఆచరించిన ఒక అద్భుతమైన దైవిక అనుసంధాన విధానం. బాప్తిస్మం స్వీకరించిన వెంటనే ఆరంభించి, యేసు క్రీస్తే స్వయంగా 40 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశాడు. ఏడాదికొకసారి 'పాప ప్రాయశ్చిత్త దినాన్ని పాటించాలని ఆ రోజున అంతా తమకు తాము దుఃఖపర్చుకోవాలనీ దేవుడు తన ప్రజలకు నిర్దేశించాడు (లేవీ 23:27).
అదే 'మహాఉపవాసదినం'గా మారింది (యిర్మియా 36:6). దేవుడు మానవాళికి తన ధర్మశాస్త్రాన్నివ్వాలనుకున్నప్పుడు మోషే అది స్వీకరించడానికి ముందు 40 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష చేశాడు.
యోనా ప్రసంగం విని మారు మనసు పొందిన నీనెవె పట్టణ ప్రజలంతా ఉపవాస దీక్షకు పూనుకున్నారు. తాను ఎదిరించి పోరాడలేనంత శత్రుసైన్యం తన మీద దాడికి వచ్చినప్పుడు యూదు రాజైన యెహోషా పాతు తన రాజ్యంలోని ప్రజలందరి చేత ఉపవాస ప్రార్థనలు చేయించాడు. యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయన్న దుర్వార్త విన్న నెహమాన్ వాటి పునరుద్ధరణకు పూనుకొనే ముందు ఉపవాస ప్రార్థన చేశాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను తన శిష్యులకు ఉపవాస ప్రార్థన చేయడం నేర్పించాడు (మార్కు 2:18). పౌలు, బర్నబాలను పరిచర్యకు పంపే ముందు అంతిమోకయ చర్చి ఉపవాస ప్రార్థన చేసింది. చర్చి పెద్దల్ని ఎంపిక చేసే ముందు పౌలు, బర్నబాలు ఉపవాస ప్రార్థనలు చేశారు(అపొ 14:23). ఇలా ఆయా సందర్భాల్లో ఎంతో మంది భక్తులు ఉపవాస ప్రార్థన చేశారు.
కానీ విశ్వాసులంతా విధిగా ఉపవాస ప్రార్థన దీక్షకు పూనుకోవాలన్న కచ్చితమైన నియామాన్ని బైబిలు కొత్త నిబంధనల్లో పేర్కొనలేదు. కానీ 'కొత్త నిబంధన 'క్రైస్తవం' నియమాలు ఆచార వ్యవహారాలు మతం కాదు. అది దేవునితో ప్రగాఢమైన అనుబంధానికి సంబంధించిన అద్భుతమైన జీవన విధానం. ఉపవాస దీక్షను ఒక ఆచారంగా, తంతుగా అనుసరించడం వల్ల అణుమాత్రం కూడా ఆత్మీయ ప్రయోజనం లేదన్నది విశ్వాసులు ముందుగా తెలుసుకోవాలి. కాని దేవునితో అనుబంధాన్ని ప్రగాఢం చేసుకోవాలన్న దృఢసంకల్పంతో జీవితంలో పరివర్తన పొందేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా 'ఉపవాస ప్రార్థన' చేస్తే అదెంతో ఆశీర్వాదకరం!! ఉపవాస దీక్ష పూర్తయిన తర్వాత విశ్వాసి జీవితంలో వచ్చే మార్పు అతని దీక్ష ఫలభరితమైనదా, కాదా అన్నది లోకానికి దేవుడికి కూడా రుజువు చేస్తుంది.
ఈ పవిత్ర ఉపవాస దినములలో యేసయ్య మీ కుటుంబంలో అన్ని సమస్యలు తొలగించి ,విడుదల ఇచ్చి ఆశీర్వదించి కాపాడును గాక.
ఆమెన్.
*CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియచేయండి
Comments