ప్రతి ఇంట్లో అత్తా కోడళ్లు ఇలా వుంటే చాలు..

   *CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

  ప్రతి ఇంట్లో అత్తా కోడళ్లు ఇలా వుంటే చాలు..

బైబిలులో రూతు అనే పుస్తకం ఉంది. అది ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు ఉన్నకాలంలో జీవించిన ఒక కుటుంబం గురించిన ప్రేమ ఆప్యాయతలు కలిగిన చరిత్ర. రూతు మోయాబు దేశానికి చెందిన యౌవన స్త్రీ; ఆమె దేవుని జనాంగమైన ఇశ్రాయేలుకు సంబంధించినది కాదు. కానీ రూతు సత్య దేవుడైన యెహోవా గురించి తెలుసుకున్నప్పుడు ఆయనను ఎంతగానో ప్రేమించింది. నయోమి ఒక వృద్ధ స్త్రీ, ఆమె రూతుకు యెహోవా గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది.

నయోమి ఇశ్రాయేలు స్త్రీ. ఇశ్రాయేలులో ఆహార కొరత వచ్చినప్పుడు ఆమె, ఆమె భర్త, ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి తరలి వెళ్ళారు. కొద్దికాలం తర్వాత నయోమి భర్త చనిపోయాడు. తర్వాత నయోమి ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి చెందిన రూతు, ఓర్పా అనే ఇద్దరు అమ్మాయిలను పెళ్ళి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత నయోమి ఇద్దరు కుమారులూ చనిపోయారు. నయోమికి, ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎంత దుఃఖం కలిగిందో! ఆ తర్వాత నయోమి ఏమి చేసింది?

ఒకరోజు నయోమి మళ్ళీ తన స్వంత ప్రజల దగ్గరకు, తన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. రూతు, ఓర్పా ఆమెతోపాటే ఉండాలనుకొని ఆమెతో బయలుదేరారు. అయితే వాళ్ళు కొంత దూరం ప్రయాణించిన తర్వాత, నయోమి ఆ అమ్మాయిలవైపు తిరిగి, ‘మీరు మీ ఇళ్ళకు వెళ్ళి మీ తల్లుల దగ్గర ఉండండి’అని చెప్పింది.

నయోమి ఆ అమ్మాయిలను ముద్దు పెట్టుకొని వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడ్వడం ప్రారంభించారు, ఎందుకంటే వాళ్ళు నయోమిని ఎంతో ప్రేమించారు. ‘మేము వెళ్ళము! మేము నీతోపాటు నీ ప్రజల దగ్గరకు వస్తాము’ అని వాళ్ళు అన్నారు. కానీ నయోమి వాళ్ళతో ‘నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళండి. మీరు మీ ఇళ్ళలో ఉండడమే మంచిది’అని సమాధానమిచ్చింది. కాబట్టి ఓర్పా తన స్వదేశానికి బయలుదేరి వెళ్ళింది. కానీ రూతు వెళ్ళలేదు.

అప్పుడు నయోమి ఆమెవైపు తిరిగి, ‘ఓర్పా వెళ్ళింది. నువ్వు కూడా ఆమెతోపాటు ఇంటికి వెళ్ళు’అంది. అందుకు రూతు, ‘నేను నిన్ను విడిచి వెళ్ళేలా చేయడానికి ప్రయత్నించవద్దు! నన్ను నీతోనే రానివ్వు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేనూ అక్కడే మరణిస్తాను. నేను నీ దగ్గరే పాతిపెట్టబడతాను’అంది. రూతు అలా అన్నప్పుడు నయోమి ఇంక ఆమెను ఇంటికి పంపించడానికి ప్రయత్నించలేదు.

అందుకు రూతునా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు రూతు 1:16

చివరకు ఆ ఇద్దరు స్త్రీలు ఇశ్రాయేలుకు చేరుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు. అది యవలు సమకూర్చే కాలము కాబట్టి రూతు వెంటనే పొలాల్లో పని చేయడం మొదలుపెట్టింది. బోయజు అనే వ్యక్తి ఆమెను తన పొలంలో పరిగె ఏరుకొనేందుకు అనుమతించాడు. బోయజు తల్లి ఎవరో మీకు తెలుసా? ఆమె యెరికో పట్టణానికి చెందిన రాహాబు.

ఒకరోజు బోయజు రూతుతో, ‘నేను నీ గురించి అంతా విన్నాను. నువ్వు నయోమిపట్ల ఎంత దయగా ఉన్నావో విన్నాను. నువ్వు నీ తండ్రిని, తల్లిని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నీకు తెలియని ప్రజలతో జీవించడానికి వచ్చావని కూడా నాకు తెలుసు. యెహోవా నీకు మేలు కలుగజేయును గాక!’ అన్నాడు.

దానికి రూతు, ‘నా యజమానుడా, మీరు నాపట్ల ఎంతో దయగా ప్రవర్తించారు. మీరు నాతో మంచిగా మాట్లాడి నాకు ఎంతో సంతోషం కలిగించారు’అని అంది. బోయజు రూతును ఎంతో ఇష్టపడ్డాడు. కొద్దికాలం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అది నయోమికి ఎంత సంతోషాన్ని కలిగించివుంటుందో కదా! రూతు బోయజులకు మొదటి కుమారుడు ఓబేదు పుట్టినప్పుడు నయోమి ఇంకా సంతోషించింది. తర్వాత ఓబేదు దావీదుకు తాతయ్య అయ్యాడు. దావీదు గురించి మనం చాలా ధ్యానించవచ్చు.

కుటుంబంలో అత్తా కోడళ్ళు ఎలా వుంటే సంతోషంగా వుంటారో కొన్ని విషయాలు గమనించండి

1.పాజిటివ్‌ ఆలోచన అవసరం...
వీరిద్దరూ ఒకరిపట్ల మరొకరు పాజిటివ్‌ ఆలోచనలతో మెలగాలి. ఒకరినొకరు సర్దుకుపోవాలి. తల్లి కొడుకుల మధ్య బంధాన్ని కోడలు అర్థంచేసుకోవాలి. అలాగే అత్త కూడా తానూ ఒకప్పుడు కోడలే కాబట్టి కోడలి మనసులోని ఆరాటం ఏమిటో గ్రహించి తదనుగుణంగా పెద్దరికంతో వ్యవహరించాలి. అత్త కూడా అమ్మలాంటిదేనని కోడళ్లూ అనుకోవాలి. ఇంటి విషయాల్లో అత్త అభిప్రాయం తీసుకోవడం, ఆమెకు తగిన స్థానం ఇవ్వడం, ఆమెపట్ల సున్నితంగా ప్రవర్తించడం కోడలు చేయాలి. ఇలా చేయడం వల్ల అత్త మనసులో గూడుకట్టుకున్న అభద్రతా భావం పోతుంది. తన కొడుకు తనకు దూరమవుతాడన్న భయం ఆమెకి ఉండదు. 

2.ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి
పెళ్లయిన తర్వాత కూడా కొడుకు పనులను తానే చేయాలని తల్లి అనుకుంటుంది. భర్త పనులు తానే చేయాలని కోడలు కోరుకుంటుంది. ఇందువల్ల కూడా వీరి మధ్య ఘర్షణలు తలెత్తుతాయి. కోడలు గురించి కొడుక్కు తల్లి నేరాలు చెప్పడం, తల్లిపై భార్య భర్తకు నేరాలు చెప్పడం వల్ల కూడా అత్తాకోడళ్ల బంధం బలహీనపడుతుంది. అత్తా కోడళ్లు ఇద్దరూ ఆరోగ్యకరమైన రీతిలో తమ సంబంధాలను సాగించాలి. మారిన జీవన పరిస్థితులకు అనుగుణంగా కుటుంబికంగా, సామాజికంగా అత్తాకోడళ్లు ఇరువురూ ఒకరికొకరు అండగా నిలబడాలి. అందుకే అత్తాకోడళ్ల బంధం చాలా క్లిష్టమైంది. మరెంతో ప్రత్యేకమైనది కూడా. వీరిరువురు తమ పరిధిల్లోంచి ఈ అనుబంధాన్ని కొనసాగిస్తే తల్లికొడుకుల బంధం, భార్యాభర్తల బంధం రెండూ పచ్చగా నూరేళ్లు సాగుతాయి.
తానే ఇంటికి పెద్దనని, తాను చెప్పినట్టే కోడలు వినాలని అత్త అనుకుంటుంది. ఆమె ప్రవర్తన, ఆధిక్య ధోరణులు కోడలికి నచ్చకపోవచ్చు. చాలా సందర్భాలలో వీరి మధ్య కొడుకు నలిగిపోతుంటాడు. సరైన సంధానకర్తగా కొడుకు వ్యవహరించకపోవడం వల్ల కూడా అత్తా కోడళ్ల మధ్యలో సమస్యలు తలెత్తుతాయి.
మన కుటుంబవ్యవస్థలో అత్తాకోడళ్ల బంధం చాలా ప్రధానమైంది. కొడుకు కేంద్రంగా అత్తా, కోడళ్ల మధ్య సాగే ఈ బంధం సాఫీగా సాగిన సందర్భాలు అపురూపమనే చెప్పాలి. ఇన్ని తరాలైనా వీరిరువురి మధ్య ఉన్న బంధం సన్నిహిత అనుబంధంగా ఎదగకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. 

ప్రియమైన స్నేహితులారా..గమనించారా నాయోమి రూతుల ఆత్మీయ ప్రేమ మరియు ఇప్పుడు వున్న కుటుంబాలలో ప్రేమ .మరి ఈ దినాలలో ఇలాంటి ఆప్యాయత అనురాగాలు కలిగిన అత్తా కోడళ్ళు వున్నారా..?
కుటుంబాలలో ప్రేమ కలిగి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ వున్నాడు.
ఇలాంటి ఆప్యాయత అనురాగాలు దేవుడు మీకు అనుగ్రహించును గాక.
ఆమెన్.

         *CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా విన్నపములు మాకు తెలియచేయండి

Comments