*CHRIST TEMPLE-PRODDATUR*
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
కంటికి కనబడేవన్నీ నిజాలు కావు
మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి వందనములు. ఈరోజు యోసేపు జీవితం నుండి ఒక ఆత్మీయ పాఠము నేర్చుకొందాము. యోసేపు జీవితం గురించి దాదాపుగా క్రైస్తవులందరికి తెలుసు. ఎందుకంటె యవనస్తుల కూడికలలో ఎక్కువగా యోసేపు గురించి చెప్పడం మనము చూస్తు ఉంటాము. నిజమే, యోసేపు అందగాడు, యధార్థవంతుడు, కనికరం గలవాడు, యవ్వన కాలంలోనే దుష్టుని ఎదురించి దేవుని యందు నిలిచినవాడు, దేవుని కనికరం పొందినవాడు. అటువంటి యోసేపు తన జీవితములో ఒక ఘోరమైన నిందను ఎదుర్కొన్నాడు. తాను పని చేసే ఇంటిలోని అతని యజమానుని (పోతీఫరు) భార్య యోసేపు మీద కన్ను వేస్తుంది. యోసేపును కలుసుకోవాలని, అతనితో ఉండాలని ఆశపడుతుంది. కాని పొరుగువారి భార్యను కూడటం, చెరపటం దేవుని దృష్టికి విరోధమైన కార్యము కనుక అట్టి కార్యము చేయడానికి యోసేపు ఒప్పుకోడు (ఆదికా. 39:9,10; నిర్గమ 20:17; సామె 5:20,21; 6:29).
అయితే పోతీఫరు భార్య ఒకరోజు ఇంటిలో ఎవరు లేనప్పుడు యోసేపును బలవంత పెడుతుంది. కనుక యోసేపు ఆమె నుండి “తప్పించు కొనే ప్రయత్నంలో” తన “వస్త్రాన్ని” అమెచేతిలో వదిలేసి అక్కడినుండి పారిపోతాడు (ఆదికా. 39:11,12). దీంతో పోతీఫర భార్య ద్వేషంతో ఆ వస్త్రాన్ని ఆధారంగా చూపెట్టి యోసేపు తనను బలవంత పెట్టాడని, నేను బిగ్గరగా కేక వేయడంతో తన వస్త్రాన్ని నా దగ్గర వదిలి, బయటికి పారిపోయాడని తన భర్తను, ఇంటి మనుష్యులను నమ్మించింది. (ఆదికా 39:13-18). దీంతో అదే నిజం అనుకొని పోతీఫరు యోసేపును చెరసాలలో వేయించాడు.
పోతీఫరు తన భార్య చెప్పిన మాటలు నమ్మడానికి, మిగతా ఇంటి మనుష్యులు అదే నిజం అనుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా “ఆమె చేతిలో ఉన్న యోసేపు వస్త్రం”.
కాని వాస్తవంగా జరిగిన సంఘటన ఏంటంటే పోతీఫరు భార్యనే యోసేపును బలవంత పెట్టడంతో, తప్పించుకొనే ప్రయత్నంలో ఆ కంగారులో తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచి వదిలి వెళ్ళాడు. ఇది ఎవరూ చూడలేదు, కాని ఆమె చేతిలో ఉన్న యోసేపు వస్త్రాన్ని ఆధారం చేసుకొని యోసేపును దోషిగా తేల్చారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో మీరే కనుక ఉంటె ఏమి తీర్పు తీర్చేవారు? ఆమె చేతిలో ఉన్న యోసేపు వస్త్రాన్ని ఆధారం చేసుకొని యోసేపును విమర్శించేవారు కదా? (మీకు మీరే ఒకసారి సమాధానం చెప్పుకోండి).
నా ప్రియ సహోదరి, సహోదరుడా దీని నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి అంటే కొన్నిసార్లు మన కంటికి కనబడేవి అన్ని కూడా నిజాలు కావు. ఆధారాలు కనబడుతున్నప్పటికి వాటి వెనుక వాస్తవం వేరుగా ఉండే అవకాశం ఉంది (కొన్నిసార్లు).
కనుక తొందరపడి ఎవరిని విమర్శించకండి. పైగా నేటి దినాలలో టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఉన్న వాడిని లేనట్లుగా చూపించే గ్రాఫిక్స్, ఫోటో వీడియో ఆప్స్ నేడు చాలా వచ్చాయి. ఒరిజినల్ ఏదో, ఫేక్ ఏదో తెలుసుకోలేనంతగా ఫోటోషాప్ చేస్తున్నారు నేటి దినాలలో. ఈలాంటి రోజులలో ఉన్న మనము మరింత జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిజ నిజాలు తెలుసుకోకుండా, విచారించకుండా నీ సొంత తెలివితో ఏదో ఒకదాన్ని ఆధారం చేసుకొని లేదా ఊహించుకొని విమర్శించకు.
రోడ్డు మీద ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి బైక్ మీద వెళ్తుంటే చాలు. వాళ్ళిద్దరూ లవర్స్ అనేస్తుంటారు చాలామంది. ఏమి వాళ్ళిద్దరూ అన్న చెల్లినో, అక్క తమ్ముడో లేక బంధువో ఏదైనా అవ్వొచ్చుగా....... ఫలానా రోజు వాడు బైక్ మీద ఒక అమ్మాయితో వెళ్తుంటే చూసానురా, వాడి లవరేమో అని ఒకడు ఇంకొకడికి చెప్తాడు. ఆ ఇంకొకడు ఇంకో పదిమందికి “వాడు లవర్ తో బైక్ మీద వెళ్తుంటే నా ఫ్రెండ్ చూసా"డంటా”రా అని చెప్తాడు". అలా ఆ "అంట" అనే పదం అందరి నోట, ఇంట చేరిపోయి ఒక అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు.
ఇంకా అమ్మాయిల విషయంలో చేపనక్కర లేదు. రోడ్డు మీద అవసరాన్ని బట్టి ఒక అమ్మాయి, ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తే, దాన్ని చూసి ఒకడు పదిమందికి పది రకాలుగా ఆ అమ్మాయి గురించి చెప్తాడు. అది అలానే వ్యాప్తి చెందుతుంది. ఇలా కొందరి జీవితాలను నాశనం చేసిన వారు కూడా ఉన్నారు. ఎన్నో ఇలాంటివి మన జీవితంలో...
ఆ రోజు యోసేపు చేయని నేరంకు శిక్ష అనుభవించాడు. ఈ రోజు ఎంతోమంది తాము చేయని తప్పులకు, ఇతరులు పుట్టించే పుకార్లు (రూమర్స్) వల్ల, నిజ నిజాలు తెలుసుకోకుండా ఆ రూమర్స్ ను నమ్మి వాటిని నలుగురికి చెప్పడం ద్వారా, వారిని విమర్శించడం ద్వారా మానసిక క్షోభకు గురి అవుతున్న వారు అనేకులు. అందుకే ఇట్టివారు బుద్దిహీనులు అని వాక్యం సెలవిస్తుంది.
కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు.
కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును నమ్మకమైన స్వభావముగలవాడు సంగతి దాచును. (సామె 10:18; 11:13).
నా ప్రియ సహోదరుడా కంటికి కనబడేవి కొన్నిసార్లు అబద్ధం అయినప్పుడు ఎవరో నీకు చెప్పిన మాటలను నిజమో కాదో తెలుసుకోకుండా ఎలా నమ్ముతున్నావు? ఎలా ప్రచారం చేస్తున్నావు?
ముఖ్యంగా ఈ fb, whatsap లలో లెక్కలేనన్ని వ్యర్థమైన posts (fake posts) తిరుగుతుంటాయి. వాటిని గ్రుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిగత జీవితాన్ని విమర్శించకు. అది నీ తోటి విశ్వాసియైన, తోటి అన్య సహోదరుడైనా, సెలెబ్రిటి అయినా లేక దైవజనుడైనా, ఇంకా ఎవరైనా... దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండే బోధలను ఖండిచు కాని, ఒకరి వ్యక్తిగత జీవితాల గురించి తొందరపడి మాట్లాడకు (నిజాలు ఏంటో తెలుసుకోకుండా)
ఎందుకంటె నీవు పలుకు మాటలకు దేవునికి లెక్క చెప్పాలి.
నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు. (మత్తయి 12:36,37)
కనుక నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడవా లేక అపరాధివా అని తీర్పు పొందుతావు కనుక నోరును అదుపులో పెట్టుకోవడం మంచిది.
ఎవడైనను నోటికి కళ్లెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. (యాకోబు 1:26).
కనుక క్రీస్తునందు నా ప్రియమైన సహోదరులారా, ఇక నుండైనా మీ నోటి మాటల విషయమై జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎవరిని విమర్శించకండి.
ఈ వాక్యమును దేవుడు మన హృదయంలో భద్రపరచును గాక. ఆమెన్.
*CHRIST TEMPLE-PRODDATUR*
మీ ప్రార్థనా విన్నపములు మాకు తెలియచేయండి.
Comments