సమస్తాన్ని ఖర్చు చేసి, తినడానికి తిండి లేక...

*CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

సమస్తాన్ని ఖర్చు చేసి, తినడానికి తిండి లేక...

తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.
                   లూకా 15:21

చిన్న కుమారునికి తండ్రి దగ్గర వుంటే? తనకి నచ్చినట్లు జీవించడం వీలుకాదు అనుకున్నాడేమో? లేక, పట్టణం వెళ్లి వ్యాపారం చేసి కోట్లు గడించాలి అనుకున్నాడేమో? తన వాటా తీసుకొని వెళ్లిపోయి, వ్యాపారం చేసాడు. అది వ్యాపారం కాదు. దుర్వ్యాపారం. వేశ్యలతో తన ఆస్థినంతా తినివేసాడు.

సమస్తాన్ని ఖర్చు చేసి, తినడానికి తిండి లేక, తాను బ్రతకడం కోసం పందుల కాపరిగా పనిలో చేరాడు. పందుల పొట్టు చూచేసరికి ఆకలి రెట్టింపు అయ్యింది. యజమాని ఆహారం పెట్టేవరకు ఆకలి బాధను తట్టుకోలేక, పందుల పొట్టు తినబోయి, యజమానికి దొరికిపోయి, గెంటివేయ బడ్డాడు.

తాను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసాడు. కాని, అతని ప్రయత్నం ఒక్క పూట కూడా తన కడుపు నింపలేక పోయింది. ఇక ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ పరిస్థితికి గల కారణమేమిటి? నేనెక్కడ తప్పిపోయాను? అంటూ ఆలోచిస్తుంటే, అతనికి అర్ధమయ్యింది. తండ్రి ఇంట తప్పిపోయాడని. తండ్రి కంటే ముందుగా దేవుని నుండి తప్పిపోయాడని. పశ్చాత్తాపము కలిగిన హృదయంతో ఒక నిర్ణయానికి వచ్చాడు. నా తండ్రి ఇంట పనివారికి సహితం సమృద్ధియైన ఆహారముంది.
తిరిగి అక్కడికే వెళ్లి,
"తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడనుకాను. నీ పనివారిలో ఒకరిగా నన్నుంచు". అంటూ క్షమాపణ వేడాలి అనే నిర్ణయానికి వచ్చాడు. బయలు దేరాడు.

*బక్క చిక్కి, పిచ్చివాడిలా నడవలేక నడుస్తూ వస్తున్న కుమారుని దూరమునుండే తండ్రి గుర్తు పట్టేసాడు. పరిగెత్తు కెళ్ళి, మెడమీద పడి ముద్దు పెట్టుకొని, ఇంటికి తీసుకు వచ్చి, స్నానము చేయించి, క్రొత్త బట్టలు తొడిగించి, చేతికి ఉంగరము పెట్టి, పాదాలకు చెప్పులను తొడిగించి, క్రొవ్విన దూడను వధించి, విందు చేయించాడు*.

ఒకవేళ లోకాన్ని అనుభవించడం కోసం దేవుని నుండి పారిపోయి, భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో? నీవు చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసినా సమాధానం అంటూ నీ జీవితములో లేకుండా పోయిందేమో? దేవుడు కూడా నన్ను క్షమించడు, చేర్చుకోడు అనే నిర్ణయానికి వచ్చేసావేమో?

*విరిగినలిగిన హృదయంతో, పశ్చత్తాపముతో ఒక చిన్న ప్రార్ధన చేయగలిగి, ఆయన చెంతకు మరలా తిరిగి రాగలిగితే? ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసే వాడు కాదు*.

ఆ చిన్న కుమారుడు క్షమాపణ అడగాలని నిర్ణయించు కున్నాడంతే. ఇంకా క్షమాపణ కూడా అడగనే లేదు. అప్పటికే తండ్రి ఎంతగా ప్రతిస్పందించాడో చూడండి.

*ఆ తండ్రి తన కుమారుని యొక్క అసహ్యమైన రూపాన్ని ఏమి పట్టించుకోలేదు. కౌగలించు కొని, మెడ మీద పడి ముద్దు పెట్టుకొంటున్నాడు. మన తండ్రి కూడా అంతే. నీవు తిరిగి ఆయన చెంతకు వస్తే? నీ జీవితం ఎట్లాంటిదైనాసరే, నిన్ను కౌగలించుకొని, హక్కును చేర్చుకొంటాడు.నీవు తిరిగి వస్తావని, చాచిన చేతులతో దినమెల్లా నీ కోసం ఎదురు చూస్తున్నాడు*.

ఆ తండ్రి తొడిగించి వస్త్రాలు రక్షణ, నీతి వస్త్రాలకు, ఉంగరం అధికారానికి, చెప్పులు కుమారుడు అని చెప్పుటకు సాదృశ్యం.
(ఆ కాలంలో దాసులు చెప్పులు ధరించడానికి వీలులేదు. కుమారులు మాత్రమే చెక్కతో చేయబడిన చెప్పులు ధరించేవారు)      

పశ్చాత్తాపముతో ఒక చిన్న ప్రార్ధన చెయ్యి. నీవునూ కుమారునిగా అంగీకరించ బడతావు.

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments