🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నిరుత్సాహపడవద్దు! నిరీక్షించు!
మోషే యెహోవా యొద్దకు తిరిగివెళ్లి ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి?
నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను.
నిర్గమ 5:22,23
దేవుడు మోషేతో చెప్పాడు. నీవు ఐగుప్తు దాస్యములో మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, కనానుకు నడిపించు. నేను నీకు తోడైవుంటాను. వారు నీ మాట వింటారు.
అక్కడ పరిస్థితులు అట్లా లేవు. అటు ఫరో, మోషే అహారోనుల మాట వినడంలేదు. అసలు యెహోవా ఎవడు? అతనిని నేనెరుగను అంటూ, తిరగబడ్డాడు. ఇటు ఇశ్రాయేలు ప్రజలేమో, మీరాక మాకు శాపముగా మారింది. అప్పుడు ఇటుకలు కాల్చడానికి గడ్డి ఇచ్చేవారు, ఇప్పుడేమో గడ్డిని కూడా మీరే సమకూర్చుకోవాలి, ఇటుకలు లెక్క మాత్రం తగ్గడానికి వీలులేదు అంటూ మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు. దేవుడే మీకు న్యాయం తీర్చుతాడు అంటూ వీరిపైన తిరగబడుతున్నారు.
మోషేలో చెప్పలేనంత నిరుత్సాహం. నేను తగినవాడను కాను, వారు నామాట వినరని నేను ముందే చెప్పాను. అనుకొంటూ
మోషే దేవునికి ఫిర్యాదు చేస్తూ, దేవునిని ప్రశ్నిస్తూ చేస్తున్న ప్రార్ధన ఇది.
అయితే, ఆ విషయం దేవుడు ముందుగానే చెప్పాడు.
ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;
కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయ దలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.
నిర్గమ 3:19,20
కాని, మోషే అంతవరకు ప్రజలు అనుభవిస్తున్న శ్రమలు చూడలేని పరిస్థితి, మరొకవైపు వారి దాడిని తట్టుకోలేని పరిస్థితి.
*అవును! అనేక సందర్భాలలో ఒకవైపు మనము ఎదుర్కొంటున్న శోధనలు, మరొకవైపు మన చుట్టూనున్న పరిస్థితులు దేవుని మీద ఫిర్యాదు చేసే విధంగా, దేవునినే ప్రశ్నించే విధంగా దారి తీస్తాయి. ఏమి జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి. ఎటు వైపుచూచినా కీడే సంభవిస్తున్నట్లు అనిపిస్తుంది. అది జరిగేవరకూ మన ఊహలకు కూడా అందదు. బానిసలుగా పని చేసిన వాళ్ళు, ఒట్టి చేతులతో కాకుండా, విస్తారమైన సొమ్ముతో తిరిగివస్తారని వారెప్పుడూ ఊహించలేదు. మన జీవితాల్లో కూడా అదే జరుగబోతుంది. తగిన సమయమందు ఆయన మనలను ఊహించలేని మేలులతో నింపబోతున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చక మానడు*.
నిరుత్సాహపడవద్దు!
నిరీక్షించు!
*దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును*.
ఫిలిప్పి 4:19
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
*ఆమెన్! ఆమెన్! ఆమెన్*!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments