నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను

  *CHRIST TEMPLE-PRODDATUR*

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను

అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,

తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును.

మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.
               ఆది 28:20-22
      
యాకోబు అంటేనే మోసగాడు అని అర్ధం. అన్నను, తండ్రిని మోసం చేసాడు. మోసానికి ప్రతిఫలంగా అన్న శత్రువుగా మారి, అతనిని చంపాలనే ఆలోచనలో నున్నప్పుడు, అన్నకు భయపడి బెయేర్షెబా నుండి హారానుకు పారిపోతున్నాడు.

ఆ రాత్రి ఒంటరిగా భీకర అరణ్యంలో భయంతో వున్నాడు. మరో ప్రక్క,మరణానికి సమీపంలోనున్న తండ్రికి, అమితంగా ప్రేమించే తల్లికి, మరీ ముఖ్యంగా వాగ్ధాన భూమికి దూరం కాబోతున్నానని, మరళా తిరిగి వస్తానో రానోననే చెప్పలేనంత బాధతో వున్నాడు.

అయితే, ఆ రాత్రి అతనికి దేవుని ప్రత్యక్షత లభించింది. అతని మోసపూరితమైన జీవితాన్ని గూర్చి ప్రశ్నించకుండా, కేవలం ఆయన కృపతో జ్ఞాపకంచేసుకొని, అద్భుతమైన, స్పష్టమైన వాగ్ధానాన్ని దేవుడిచ్చాడు.

ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
                ఆది 28:15

ఆ మాటలు యాకోబు నమ్మాడు. కానీ, అది అంత బలీయమైన నమ్మకం కాదు. వాగ్ధాన మిచ్చిన దేవుడు ఏవిధమైన షరతులు పెట్టకపోయినప్పటికీ, యాకోబు మాత్రం కొన్ని షరతులు పెడుతున్నాడు.

• నా ప్రయాణ మంతటిలోనీవు  నాకు తోడుగా వుండాలి. నన్ను కాపాడాలి. మరళా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా తీసుకొని రావాలి.
• నేను తినడానికి ఆహారము, ధరించడానికి వస్త్రాలను దయచెయ్యాలి.

అట్లా చేస్తే? నీవు నాకు దేవుడుగా వుంటావు. ( అట్లా జరుగని పక్షంలో నీవు దేవుడవు కాదనే కదా అర్ధం?)
అంతేకాదు, నేను తలగడగా చేసుకొనిన ఆ రాయి వున్న స్థలం నిన్ను ఆరాధించే స్థలమవుతుంది. నీవు నాకిచ్చిన వాటన్నిటిలో పదియవ భాగము నీకిస్తాను.

ఒకరకంగా దేవునితో యాకోబు బేరమాడుతున్నట్లుగా వుంది కదా?

అవును! యాకోబు షరతులను బట్టి కాదుగాని, ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చాడు.

యాకోబుకు దేవుడు తోడుగా నున్నాడు. యబ్బోకు రేవులో ఆశీర్వాదించాడు. శత్రువైన అన్నను మిత్రునిగా చేసాడు. తన తండ్రి ఇంటికి అనగా, వాగ్ధాన భూమికి తిరిగి తీసుకొని వచ్చాడు.

అనేక సార్లు మనము కూడా ఇట్లాటి తలంపులనే కలిగి యున్నాము. దేవుడు నాకు ఇది చేస్తే, రక్షణ పొందుతాను. అది చేస్తే, బాప్తీస్మం తీసుకుంటాను. ఉద్యోగం వస్తే చర్చికి మానకుండా వెళ్తాను. నేను అనుకున్నట్లే అంతా జరిగితే? దేవుని మందిరానికి అది ఇస్తాను. దేవుని కొరకు ఇది చేస్తాను.అంటూ దేవునికి షరతులు పెట్టిన సందర్భాలెన్నో కదా?

నీ షరతులనుబట్టి కాదు గాని, ఆయన కృపతోనే అన్నింటిని నీకు అనుగ్రహిస్తున్నాడని తెలుసుకో. దేవునితో బేరాలాడే ప్రయత్నం చెయ్యొద్దు. ఆయన కొరకై జీవించే ప్రయత్నం చెయ్యి.

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
  *CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments