*CHRIST TEMPLE-PRODDATUR*
Telugu Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
ఇక్కడ సుఖాన్ని అనుభవించిన ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు
తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికర పడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి
చెప్పెను.
లూకా 16:24
ధనవంతుడు:
• అత్యంత విలువైన వస్త్రాలు కలిగి యున్నాడు. కానీ, రక్షణ, నీతి వస్త్రాలు లేవు.
• శారీరికంగా సమృద్ధియైన ఆహారముంది. కానీ ఆత్మీయ ఆహారం లేదు.
• శారీరికంగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు. కానీ ఆత్మీయ ఆనందం కరువయ్యింది.
• కనికరము లేని జీవితాన్ని జీవిస్తున్నాడు. కనికరం పొందలేకపోయాడు
• ఇతనిలో నున్న అభినందనీయమైన విషయము ఏమిటంటే? కురుపులతో నిండియున్న వ్యక్తిని తన ఇంట వాకిట వుండనిచ్చాడు. అయితే, రక్షణ లేకుండా, మనము చేసే కొన్ని మంచిపనులు పరమునకు చేర్చలేవు.
• ఇతని జీవిత అంతము వేధన, బాధ, నిత్య మరణము.
లాజరు:
• *దరిద్రుడు. కానీ, ఆధ్యాత్మిక ధనవంతుడై వుండవచ్చు*.
• *శరీరమంతా కురుపులే. కానీ, ఆత్మీయ స్వస్థతను కలిగినవాడు అయ్యుండొచ్చు.*
• *అతని కురుపులను శుభ్ర పరచడానికి మనుష్యులెవరూ ముందుకు రాలేదు. కానీ, కుక్కలే ఆపని పూర్తి చేసేవి కాబోలు.*
• జీవితమంతా కష్టాలే. కానీ, ఆత్మీయ ఆనందాన్ని అనుభవించిన వాడయ్యుండొచ్చు.
• ధనవంతుని విలాసవంతమైన జీవితాన్ని చూచి, అట్లా బ్రతకాలని తలంచిన వాడు కాదు.
• ధనవంతుని బల్లమీద నుండి పడిన రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడే తప్ప, ఎన్నడూ దొంగిలినవాడు కాదు.
• లాజరు ఆధ్యాత్మికంగా తప్పకుండా పరిపూర్ణుడై వుండాలి. లేకుంటే, రక్షణ లేకుండా శారీరిక దుఃఖాన్ని, దారిద్ర్యమును అనుభవించి నంతమాత్రాన, అతడు నెమ్మది పొందే అవకాశం లేనే లేదు.
*ఈ లోకంలో ఎట్లా జీవించినా, అది శాశ్వతం కాదు కదా? ధనవంతుడూ, లాజరు ఇద్దరూ ఈ లోకాన్ని విడచి పెట్టేసారు*. ఇక్కడ సుఖాన్ని అనుభవించిన ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు. ఇక్కడ కష్టాలు అనుభవించిన లాజరు అక్కడ నెమ్మది పొందుతున్నాడు.
వీరిద్దరూ నున్న స్థలాలు వేరు వేరు అయినప్పటికీ ఒకరి కొకరు కనిపించేటంత, ఒకరి మాట మరొకరికి వినిపించేటంత దూరం లోనే వున్నారు.
అప్పుడు ధనవంతుడు ....
తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలు వేస్తున్నాడు.
భూమి మీద నున్నప్పుడు ధనవంతుడు, లాజరుపట్ల కనికరమును చూపలేదు. కానీ, ఇప్పుడు కనికరమును కోరుతున్నాడు. అది సాధ్యం కానేకాదు.
*కనికరముగలవారు ధన్యులు; వారు కనికరము పొందుదురు.*
మత్తయి 5:7
*మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును*.
మత్తయి 7:2
మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును.
గలతి 6:7
*ధనవంతుడు ఏవో ఘోరమైన పాపములు చేసినట్లు లేదు*.
*1. అతనికి వస్త్రాలు వుండగా, లేని వారికి ఇవ్వలేదు.*
*2. ఆహారము సమృద్ధిగా వుండగా, లేని వారికి పెట్టలేదు.*
*అంతే అతడు చేసిన తప్పిదాలు. దాని ప్రతిఫలం నిత్య నరకం.*
మన జీవితాలు ఎట్లా వున్నాయి?
సరిచూచుకుందాం!
సరిచేసుకుందాం!
నిత్య రాజ్యానికి వారసులమవుదాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*CHRIST TEMPLE-PRODDATUR*
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments