*CHRIST TEMPLE-PRODDATUR*
Telugu Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
ఇంతకీ ఏమిటా ముల్లు?
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము, నన్ను నలగగొట్టుటకు సాతానుయొక్క దూతగా ఉంచబడెను.
అది నాయొద్దనుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.
2 కొరింథీ 12:7,8
*పౌలు గారు:*
• అసలు పేరు సౌలు
• యూదా మత ప్రవిష్టుడైన గమలియేలు పాదాలచెంత ధర్మశాస్త్ర విద్య నభ్యసించి, క్రైస్తవ్యాన్ని సమూల నాశనం చెయ్యడానికి అధికారం పొంది, క్రీస్తు ప్రత్యక్షత ద్వారా క్రీస్తు ఖైదీగా మార్చబడి, క్రీస్తును పోలి నడచినవాడు.
• 2nd ఫౌండర్ అఫ్ క్రిస్టియానిటి అని పిలువబడే వ్యక్తి
• బైబిల్ గ్రంధములో అత్యధికముగా 14 పత్రికలు వ్రాసినవాడు.
• బైబిల్ గ్రంథములోనే సువార్త నిమిత్తమైన 'గొప్ప ప్రయాణికుడు'
• అపోస్తలుడు
• ప్రవక్త
• దైవజనుడు
• పెద్ద
• సువార్తికుడు
ఇట్లా అనేకమైన ఆధిక్యతలు కలిగిన వ్యక్తి శరీరంలో ముల్లు ఎందుకు? అతనికున్న ఆధిక్యతలను బట్టి అతిశయించకుండా, ప్రభువుపై ఆధారపడడం కోసమే.
• ఇంతకీ ఏమిటా ముల్లు?
పౌలు చేసిన మూడు సువార్త యాత్రలలో మొదటిది బర్నబాతో కలసి, ఈకొనియా, లుస్త్ర ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ లుస్త్ర పట్టణంలో బలహీన పాదాలుగల వ్యక్తిని స్వస్థ పరుస్తారు. ఆ తర్వాత అక్కడి ప్రజలు పౌలును రాళ్లతో కొట్టి, చనిపోయాడని తలంచి, ఊరి వెలుపలకు ఈడ్చి పారేశారు. ఆ సమయంలో ఆయనకు కొన్ని ప్రక్కటెముకలు విరిగిపోయాయని, తన శేష జీవితమంతా, సుమారుగా 20 సంవత్సరాలు ఆ నొప్పి(ముల్లు)తోనే పరిచర్య చేశారని చరిత్రకారుల అభిప్రాయం.
పౌలు ఆ ముల్లు నిమిత్తం ముమ్మారు ప్రార్ధించినప్పటికీ, దేవుడు స్వస్థ పరచలేదు. కానీ, శరీర స్వస్థత కంటే మిన్నయైన, బైబిల్ గ్రంథములోని అత్యంత శక్తివంతమైన వాగ్ధానాన్నిచ్చారు.
*నా కృప నీకు చాలు*. నీ బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగును.
2 కొరింథీ 12:9
ఆయన కృప తోడుగా ఉంటే, ఇంకేమి కావాలి? అగ్నిగుండం సహితం ఆహ్లాదకరమే కదా!
• దేవుడు మనజీవితంలోనికి కొన్ని శోధనలను అనుమతిస్తారు. ఎందుకంటే?
1.దేవుని నామ మహిమార్ధం (యోహాను సువార్త 9:1-3)
2. మనలను మహిమ నుండి, అత్యధికమైన మహిమలోనికి చేర్చడానికి. ఆశీర్వదించడానికి (యోబు 1,2&42 అధ్యాయాలు).
అవును!
• పై తరగతిలోకి ప్రవేశించాలంటే? పరీక్షను ఎదుర్కోవలసిందే.
• సువర్ణం శుద్ధీకరించబడాలి అంటే? కొలిమిలో మండాల్సిందే.
• దేవుడిచ్చే ఆశీర్వాదాలు అనుభవించాలంటే? శ్రమలగుండా ప్రయాణించాల్సిందే.
• పరీక్షలే గమ్యానికి చేర్చే మార్గాలు.
పోరాట యోధుడైన పౌలులా గమ్యం చేరే వరకు పోరాడాలి. ఆ పోరాటము మంచిదై, విశ్వాస సహితమై, బహుమానము పొందేదిగా ఉండాలి.
"*మంచిపోరాటం పోరాడితిని,నా పరుగు తుదముట్టించితిని, విశ్వాసం కాపాడుకొంటిని, నాకొరకు నీతి కిరీటముంచబడియున్నది*
2 తిమోతి 4:7,8
అంటూ... ధైర్యముగా చెప్పగలుగు తున్నాడు. అట్లాంటి అనుభవం లోనికి మనమూ ప్రవేశించాలి.
3. నీకున్న తలాంతులు బట్టి నీవు అతిశయించకుండా, లేదా నిన్ను సరిచేసే క్రమంలో ఏదైనా 'ముల్లు' (శోధనలు, వేధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ, సామాజిక సమస్యలు మొదలగునవి) దేవుడు నీ జీవితంలో పెడితే? వాటిని అట్లానే వుండనివ్వు. వాటిని సహించడానికి ఆయన కృపకొరకు ప్రార్ధించు చాలు.
ఎందుకంటే?
*నీ బలహీనతల యందే ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది*.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ లో వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments