అతను వంద మంది రోమన్ సైనికులమీద అధికారి అయినా కూడా...

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel

అతను వంద మంది రోమన్ సైనికులమీద అధికారి అయినా కూడా...

ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.
           మత్తయి 8:6

ఆయన ఒక శతాధిపతి. అంటే? వంద మంది రోమన్ సైనికులమీద అధికారి. ఒకడు రమ్మంటే వస్తాడు., పొమ్మంటే పోతాడు.

అధికారం అంటే ఎలాంటిదో అతనికి తెలుసు. కానీ, యేసు ప్రభువుకువున్న అధికారం తనలాంటిది కాదని, వ్యాధులపైన సహితం సంపూర్ణ అధికారముందని గ్రహించగలిగాడు. విశ్వసించాడు.

తాను అడిగిన వెంటనే తన ఇంటికి వచ్చి, తన దాసుని స్వస్థపరచడానికి యేసు ప్రభువు ఇష్టపడ్డారు. కానీ, ఆ శతాధిపతి మాట్లాడుతున్న మాటలు చూడండి.

ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చు టకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.
             మత్తయి 8:8

అవును! ప్రభువు నుండి ఏదైనా పొందడానికి అన్ని అర్హతలు మాకున్నాయి అనుకొనేవారు. నిజంగా వారు అందరికంటే, అనర్హులు. *ఏ యోగ్యత మాకులేదు అనుకొనే వారే, నిజమైన యోగ్యులు.*

శతాధిపతి మాటలకు యేసు ప్రభువు వారు ఆశ్చర్యపోయారట. యేసుప్రభువు వారు భూమిమీద జీవించిన కాలములో ఆయన ఆశ్చర్య పోయిన సందర్భాలు రెండే రెండు.
1. శతాధిపతి విశ్వాసమును చూచి
                మత్తయి 8:10
2. నజరేతు లోని ప్రజల అవిశ్వాసమును చూచి.
                  మార్కు 6:5

తమవెంట నున్న వారిని చూచి, శతాధిపతి గురించి యేసు ప్రభువు వారు చెప్తున్న మాట.
"ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత
విశ్వాసమున్నట్లు చూడలేదు".

దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అతని విశ్వాసం ఎంతటి పరిపూర్ణ మైనదో?

సరే! నీవు విశ్వసించి నట్లే జరుగుతుంది. అని యేసు ప్రభువు వారు ఆ శతాధిపతితో చెప్పిన ఆ క్షణంలోనే, తన ఇంటనున్న దాసుడు స్వస్థ పరచబడ్డాడు.

మన ప్రార్థనలకు సమాధానం రావాలంటే? మనము ఏ యోగ్యతలేనివారమని గ్రహించి, కేవలం ఆయన కృప మీద మాత్రమే ఆధారపడి, ఆయన మనపట్ల తన కార్యాన్ని జరిగించగల సమర్థుడని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్ధించగలగాలి.

సమస్యను కాదు మనము చూడాల్సింది. సమస్యను పరిష్కరించగలిగే దేవునివైపు చూడాలి.

*ఇంటి కంటే, దానికున్న తలుపు చిన్నది. ఆ తలుపు కంటే, దానికున్న తాళంకప్ప చాలా చిన్నది. ఆ తాళంకప్ప కంటే, దాని యొక్క తాళపు చెవి మరీ చిన్నది. కానీ, ఈ చిన్న తాళపు చెవే ఇంటినంతటిని తెరువ గలుగుతుంది.*

అట్లానే విశ్వాస సహితమైన ప్రార్ధన, ఎంతటి పెద్ద సమస్యనైనా పరిష్కరించ గలుగుతుంది.

విశ్వసిద్దాం! ప్రార్ధిద్దాం! పొందుకుందాం!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.

Comments