🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam Daniel
నువ్వు వస్తే చాలు ప్రభువా..
ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నాకుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.
మత్తయి 9:18
యాయీరు అనే అధికారి యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి చెపుతున్న మాటలివి.
నా కుమార్తె చనిపోయింది. అయిననూ, నీవు వచ్చి, నాకుమార్తె మీద చేయి వేస్తే? ఆమె బ్రతుకుతుంది. అని ప్రార్ధిస్తున్నాడు.
ఈ మాటలు చూస్తుంటేనే అర్ధమవుతుంది. అతని విశ్వాసమెంతటి పరిపూర్ణమైనదో?
తన కుమార్తె కొరప్రాణంతో లేదు. తను చనిపోయిందని అతనికి పూర్తిగా తెలుసు. అతనే ఆ విషయం చెప్తున్నాడు కూడా. గొల్లు చేయువారు వచ్చి ఏడ్వడం ప్రారంభించేసారు.
అయిననూ, నీవు వచ్చి నా కుమార్తెను తాకితే తను బ్రతుక వచ్చేమో? ఒకసారి ప్రయత్నించి చూడు. అనడం లేదు. "బ్రతుకుతుంది". ఇది పరిపూర్ణమైన విశ్వాసం.
యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలసి ఆ అధికారి ఇంటికి వెళ్లారు. అప్పటికి, పిల్లనగ్రోవులు వాయించేవారు, యేడ్చేవారు వారి పని వారు చేస్తున్నారు. ( ఆ కాలంలో వీరిని డబ్బులిచ్చి పిలిపించుకునే వారు)
స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రపోతుందేగాని, చనిపోలేదు. అని యేసు ప్రభువు చెప్తుంటే వారంతా ఆయనను అపహాస్యము చేశారు. బైబిల్ గ్రంధములో మరణమును నిద్రతో పోల్చడం జరిగింది. నిద్రించిన వాడు తప్పక తిరిగి లేస్తాడు. ఒక వేళ మరణించినా ఆయన మధ్యాకాశములో నుండి, బూర ఊదినప్పుడు, ప్రభువు నందు మృతులైన మృతులు తప్పక లేస్తారు. వారికి ఆ మాటలు అర్ధం కాలేదు.
యేసు ప్రభువు వారందరిని బయటకు పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది.
వారిని బయటకు పంపించడం దేనికి? వారి మధ్యనే ఆ చిన్నదానిని బ్రతికించవచ్చు కదా?
ఎందుకంటే? ఆయనను ఎగతాళి చేసినవారు, ఆయన కార్యంలోని మహిమను చూడకూడదు.
మన ప్రార్ధన దేవుని నుండి సమాధానాన్ని తీసుకొని రాలేకపోతుందంటే? మన హృదయంలో ఆయనకు స్థలము లేదేమో? విశ్వాసం కొరవడిందేమో? ఆయనను ఇంకనూ అపహాస్యం చేసే సమూహంలోనే వున్నానేమో? అట్లా అయితే! నీ జీవితంలో ఆయన కార్యాలు చూడడం సాధ్యం కాదు.
ఆయన అంటున్నారు *స్థలమియ్యుడి*
*ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము*.
ప్రకటన 3 :20
నీ హృదయమనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే? నీ జీవితమంతా సమాధానమే.
ఆయన మహిమను నీవు కళ్లారా చూస్తావు. అనుభవిస్తావు.
ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం!
అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
*దేవాది దేవుడు మిమ్ములను దీవించును గాక*
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
మన క్రైస్ట్ టెంపుల్ వెబ్ బ్లాగ్ ను ఇప్పుడే వాక్యం ఫాలోకండి.ఆలస్యం ఎందుకు ఇప్పుడే క్లిక్ చేయండి.
Comments