అందానికి ఆకర్షితుడై...అయ్యో..చివరి క్షణంలో

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible Sermons by Pastor NAKKOLLA BALASUBRAMANYAM (DANIEL)

అందానికి ఆకర్షితుడై...అయ్యో..చివరి క్షణంలో

"అప్పుడు సమ్సోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసి కొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి
ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని
నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాల మందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను."
         న్యాయాధి 16:28-30

• సంసోను దేవుని కోసం ప్రతిష్ట చేయబడిన వాడు.
• దేవునిచే ఎన్నుకొన్నవాడు,  ఏర్పరచుకొన్నవాడు,రేపబడిన వాడు, వాగ్ధాన పుత్రుడు,ఆత్మావేశం కలిగినవాడు
• బైబిల్ గ్రంధములోనే అత్యంత బలవంతుడు. కొదమ సింహాన్ని సహితం అవలీలగా చీల్చివేసిన  బలశాలి.
• 300 నక్కలను పట్టుకొని ఫిలిష్తీయుల పంట పొలాలను నాశనం చేసిన ధీరుడు.
• పట్టణానికి కావలిగా నున్న ఇనుప గేటును సహితం ఊడబెరికి కొండ మీదకు విసిరి వేయగలిగిన వీరుడు.
• గాడిద పచ్చి దవడ ఎముకచేత వెయ్యి మంది శత్రువులను చంపిన శూరుడు. ఇట్లా ఎన్నో...!

ఇట్లాంటి సంసోను ...
• లోకంచేత ఆకర్షించ బడ్డాడు.
• వ్యభిచారిగా మారాడు, నాజీరు చేయబడిన వాడు అంటరానివి, తినరానివి తిన్నాడు, వాగ్ధానాన్ని అతిక్రమించాడు.
• శత్రువుల చేతిలోబంధీగా మారాడు.
• తల వెంట్రుకలు గొరిగించబడి, రెండు కళ్ళూ పెరికి వేయబడి, మరి కొద్ది నిమిషాల్లో దాగోను దేవతకు బలిగా మారబోతున్నాడు.

ఇట్లాంటి తనజీవిత చివరి గడియల్లో సంసోను చేస్తున్న ప్రార్ధనలో పగ, పతీకారం తీర్చుకోవడం కోసం తప్ప, ఏ మంచి కనిపించదు. నా రెండు కళ్ళూ తీసేసారు. దాని నిమిత్తం, వారి మీద పగ తీర్చుకోవడానికి బలము దయచెయ్యి అని ప్రార్దిస్తున్నాడు. అయినప్పటికీ, సంసోను ప్రార్ధన దేవుడు ఆలకించాడు. తన జీవిత కాలంలోనే సాధించని గొప్ప విజయాన్ని ఆ క్షణాన్న సాధించాడు.

నిజమే! మన పరిశుద్దతను చూచిన తర్వాతే, మన ప్రార్ధనలకు దేవుడు జవాబు ఇవ్వాలంటే? ఎప్పటికీ మన ప్రార్ధనలకు సమాధానం రాదేమో?

"తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యెహోవా తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.
మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొను చున్నాడు."
       కీర్తనలు  103:13,14

అనేక సందర్భాలలో మన ప్రార్ధనకు జవాబు వస్తుంది అంటే? అది మన పరిశుద్ధతను బట్టి కాదుగాని, దేవుని యొక్క జాలి, మంచితనము వల్లనే వస్తుందని మనము గుర్తుపెట్టుకోవాలి.

అంతేగాని మన పరిశుద్ధతయే, ప్రార్ధనా ఫలాలను తీసుకొని వస్తుందని, ఇక మనం పరిశుద్ధులమే అనుకుంటే? మనలను మనం మోసం చేసుకున్నట్లే. అట్లా కాకుండా, దినదినము పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి ఎక్కిపోవాలి.

NOTE : పాత నిబంధన కాలంలో శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి దేవుని ప్రార్ధించడం సాధారణమైన విషయమే. ఎందుకంటే? వారు దేవుని పక్షంగా యుద్ధాలు చేసేవారు. అందుచే, సంసోను ప్రార్ధన సమర్ధనీయమే.

అయితే, నూతన నిబంధన కాలంలోనున్న మనము, పగ, ప్రతీకారం కోసం ప్రార్ధించడానికి వీల్లేదు. శత్రువులను సహితం ప్రేమించాలి. వారి కొరకు ప్రార్ధించాలి. ప్రతీకారం తీర్చే పనిని దేవునికే అప్పగించాలి.
ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Join our online community : just click CHRIST TEMPLE

Comments