భార్యాభర్తలకు హన్నాజీవితం గొప్ప మేలుకొలుపు

ప్రియమైన నా ఆత్మీయులకు వందనములు. *క్రైస్ట్ టెంపుల్*వెబ్ బ్లాగ్ ను దర్శించి ఈ రోజే *SUBSCRIBE* చేసుకోండి. ప్రతిరోజూ వాక్య సందేశం కోసం మీ మెయిల్ కి అలెర్ట్ మెసేజ్ వస్తుంది. డోంట్ మిస్.

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam (Daniel)

భార్యాభర్తలకు హన్నాజీవితం గొప్ప మేలుకొలుపు

బహుదుఃఖా క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు
సైన్యములకధి పతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసికొనెను.
       1సమూయేలు  1:10,11

• హన్నాకు కలిగిన దుఃఖం ప్రార్ధించడానికి ప్రేరేపించింది.
• పిల్లలుపుట్టడం ఆలస్యమైతే? నీవే కారణమంటూ ఒకరు, లేదు నీవే కారణమంటూ మరొకరు తగవులాడుకొంటూ కుటుంబంలో శాంతి, సమాధానం కోల్పోయే భార్యాభర్తలకు హన్నాజీవితం గొప్ప మేలుకొలుపు.
• దేవుని సన్నిధిలో రోధించి పొందుకొనే బిడ్డలు అత్యంత ప్రయోజకులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. హన్నా కుమారుడైన సమూయేలు. గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇశ్రాయేలీయులకు చిట్టచివరి న్యాయాధిపతి ఇతడే.

హన్నా జీవితము, ప్రార్ధనలోని ముఖ్యాంశాలు:

1. హన్నాకు దేవునితో సరియైన సంబంధం వుంది.

దేవునికిని మనకును గల వ్యక్తిగతమైన సంబంధాలే మన ప్రార్ధనలకు జవాబును తీసుకు వస్తాయి. ఆయన ఏమై యున్నాడో? ఆయన ఏమి చెయ్యగలడో? అట్లాంటి గ్రహింపు గలిగి యుండాలి. పిల్లలు కలగడానికి భర్త లేదా భార్య  రెండవవ్యక్తి. మొదటి వాడు దేవుడే అనే విషయం గ్రహించాలి. హన్నా అట్లాంటి గ్రహింపే కలిగియున్నది.

2. ఆమెలో గొప్ప భారం ఉంది.
      (  1సమూ 1:10,13,15)

షిలోహు మందిరంలో హన్నా తన వేధనను దేవునికి మనసులోనే చెప్పుకొంటుంది. పెదవులు మాత్రం కదులుతున్నాయి స్వరం మాత్రం బయటకు వినిపించుటలేదు. ఏలి అయితే, ఆమె మధ్యం సేవించింది అని అపార్ధం చేసుకున్నప్పుడు.
నా యేలినవాడా, నేను మనోధుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మధ్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించు కొనుచున్నానని చెప్పింది. ఆత్మతో ప్రార్ధించే అనుభవాన్ని హన్నా కలిగియుంది.
అవును! కొన్ని సందర్భాలలో మనుష్యులు నిన్ను అపార్ధం చేసుకున్నా, దేవుడు మాత్రం అర్ధం చేసుకుంటాడు.

3. ఆమె ప్రార్ధన స్పష్టంగా, ఖచ్చితంగా ఉంది.
            (  1సమూ 1:11)

• మగ బిడ్డను అనుగ్రహించు.
• వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యను.
• వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగిస్తాను.

4. దేవుడేమన్నా ఇస్తే దానిని తన స్వార్ధానికి కాక, ఆయన మహిమార్ధం వాడడానికి ఇష్టపడుతుంది.
             (1సమూ 1:11)

బిడ్డలు కావాలని మనమెందుకు ప్రార్దిస్తాము? దానిలో అంతర్లీనంగా మన స్వార్ధం కూడా వుంది. వాడు పెద్ద వాడయ్యాక మన యోగక్షేమాలు చూస్తాడని. కాని, హన్నాకు  అట్లాంటి తలంపులు లేనేలేవు. నీ విచ్చినబిడ్డ నీ సేవకే అంకితం అని ప్రార్ధిస్తుంది. ఎంత అద్భుతమైన తీర్మానం?

5. దేవుడు తన ప్రార్ధనకు ప్రతిఫలమిస్తాడని విశ్వసించింది.
           (1సమూ 1:17-19)

షిలోహు మందిరంలో ప్రార్ధించిన తర్వాత, తను ఇంటికి వెళ్లి దుఃఖ ముఖముతో వుండకుండా, సంతోషముతో భోజనము చేయుచుండెను.

6. ప్రార్ధనకు దేవుని నుండి సమాధానం వచ్చినప్పుడు కృతజ్నత చూపుతుంది.
                 1 సమూ 1:20

హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కనినేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.
సమూయేలు అనుపేరుకు "దేవుని యొద్ద అడిగి పొందినది" అని అర్ధము.

7. దేవునికి ఇచ్చిన మాట చొప్పునే, దానికి కట్టుబడగలిగింది.
             1 సమూ 1:28

మనము ఆపదలో నున్నప్పుడు మన మనసుకు ఏది తోస్తే అది, మన నోటికి ఏది వస్తే అది మ్రొక్కుకుంటాము. మన మ్రొక్కుబడులను చూచికాదు గాని, ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకున్నతర్వాత, ఆయననే మరచిపోతాము.

హన్నాది అట్లాంటి వ్యక్తిత్వం కాదు. షిలోహు మందిరంలో ఏదయితే మ్రొక్కుకుందో? అదే చేసింది. తన బిడ్డను తీసుకొని వచ్చి దేవునికి ప్రతిష్టించింది.

పిల్లలు, ఆస్థులు అంతస్థులు, ధనధాన్యాలు అన్నీ ఆయన ఇచ్చినవే. ఆయన ఇచ్చిన వాటిలో కనీసం కొంతయినా ఆయన కోసం ఖర్చు చేయగలుగుతున్నామా?

హన్నా జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప సవాలు.
సరిచూచుకుందాం! సరిదిద్దుకుందాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏


Comments