ప్రియమైన మిత్రులందరికీ వందనములు. *క్రైస్ట్ టెంపుల్*వెబ్ బ్లాగ్ ను ఈ రోజే *SUBSCRIBE* చేసుకోండి. ప్రతిరోజూ వాక్య సందేశం కోసం మీ మెయిల్ కి అలెర్ట్ మెసేజ్ వస్తుంది. డోంట్ మిస్.
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible sermons by pastor Nakkolla Balasubramanyam(Daniel)
నీ శత్రువైన సాతాను మీద విజయం సాధించాలంటే?
ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా
యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.
2దిన 14:11,12
ఆసా:
• అబీయా కుమారుడు.
• దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడు.
• అన్యదేవతల బలిపీఠములను పడగొట్టించాడు.
• ప్రతిమలను, దేవతా స్థంభములను నాశనం చేయించాడు.
• ధర్మశాస్త్రమునుబట్టియు విధిని బట్టియు, క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించాడు.
• యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించాడు.
• ఐదులక్షల ఎనుబది వేలమంది
పరాక్రమశాలురైన సైన్యమును కలిగి యున్నాడు.
కూషీయుడైన జెరహు పదిలక్షల మంది సైన్యమును, మూడువందల రథములను సమకూర్చుకొని ఆసా మీదకు యుద్ధానికి వచ్చాడు.
అంటే? ఆసా కంటే నాలుగు లక్షల ఇరవై వేల మంది సైన్యమును, మూడువందల రథములను అధికంగా కలిగియున్నాడు.
అట్లాంటి సందర్భములో, ఆసా ఈ విధంగా ప్రార్దిస్తున్నాడు.
1. యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు:
శత్రువులు మాకంటే అధికముగా నున్నారు. వారితో పోల్చుకుంటే? మేము చాలా బలహీనులం. అయిననూ, వారి చేతిలో ఓటమి చూడకుండా, మాకు సహాయము చేసి, మమ్ములను బలపరచుటకు నీవంటివాడు మరెవ్వడూ లేడు. నీవే మాబలం.
2. మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము.
దేవా! మా శత్రువుల మాకంటే రెట్టింపు సంఖ్యలో వున్నప్పటికే, మా బలమును బట్టి, మా ధైర్యాన్ని బట్టి కాదు. కేవలం నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. మా బలమును మేము నమ్ముకోలేదు. నిన్నే నమ్ముకొని యున్నాము. మాకు సహాయముచేయుము.
3. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము.
మేమైతే నీ ప్రజలము. మా శత్రువులైతే నీ నామమును ఎరుగనివారు. అట్లాంటి వారి చేతిలో ఓటమి పాలుకాకుండా విజయాన్ని అనుగ్రహించు.
ఆసా ప్రార్ధన దేవునికి సన్నిధికి చేరింది. దేవుడు వారి శత్రువులను మొత్తాడు. వారిలో గొప్ప భయం పుట్టి పారిపోయారు. యూదా వారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొని యేరూషలేముకు తిరిగివచ్చారు.
అయితే, నీ శత్రువైన సాతాను మీద విజయం సాధించాలంటే? దేవుని దృష్టికి యదార్ధముగా జీవిస్తూ, నీ హృదయంలోనున్న విగ్రహాలను తీసివేసి, ఆయననే నమ్ముకొని, ఆయనపైనే ఆధారపడి ప్రార్ధించగలిగితే? ఆ ప్రార్ధన తప్పక దేవుని చెంతకుచేరి, విజయాన్ని తీసుకువస్తుంది.
NOTE : విగ్రహం అంటే నీవు దేవునికంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నావో? అదే నీ జీవితంలో విగ్రహం.
ఉదా: అది డబ్బు, బంగారం, భవనాలు, నీ పిల్లలు, నీకు నచ్చిన వ్యక్తులు ఎవరైనా కావొచ్చు. ఏదైనా కావొచ్చు.
ఆయనకే ప్రాధాన్యతనిచ్చి, ప్రార్ద్ధిద్దాం! పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments