సూర్యచంద్రులను నిలిపిన యెహోషువ ప్రార్థన


🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

సూర్యచంద్రులను నిలిపిన యెహోషువ ప్రార్థన
        

యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను.

సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు.
    యెహోషువా 10:12,13

యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరికో, హాయి పట్టణాలను పట్టుకొని నిర్మూలం చేసారు. ఈ విషయం గిబియోను పట్టణస్థులకు భయము పుట్టించి, ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారు.

గిబియోను వారు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకున్నారనే విషయం యెరూషలేము రాజైన అదోనీసెదెకు తెలిసి, తన ప్రక్కనున్న హెబ్రోను రాజు,యర్మూతు రాజు,లాకీషు రాజు,ఎగ్లోను రాజు అను నలుగురు అమోరీయ రాజులకు కబురు పెట్టాడు మీరు నాతో కలిస్తే, మనం ఐదుగురము కలసి, గిబియోనుతో యుద్ధం చేద్దామని. దానికి వారు సమ్మతించి యుద్ధానికి వచ్చారు.

అమోరీయులకు భయపడిన గిబియోను రాజు, మాకు సహాయం చెయ్యమని గిల్గాలులోనున్న యెహోషువాకు వర్తమానం పంపాడు.

యెహోషువాతో దేవుడు చెప్పాడు నీవు వెళ్ళు, వారందరినీ నీ చేతికి అప్పగించేసాను అని.  (అప్పగిస్తాను అనికాదు).

ఒక ప్రక్క ఇశ్రాయేలీయులు వారితో యుద్ధం చేస్తూ శత్రుసంహారం చేస్తూ వుంటే, మరొక ప్రక్క నుండి దేవుడు వడగండ్లను కురిపిస్తూ శత్రువులను నాశనం చేస్తున్నాడు.

యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. సూర్యుడు దేవుడు పెట్టినక్రమం చొప్పున తిరిగి తన స్థానానికి వెళ్ళిపోతున్నాడు. సూర్యుడు వెళ్ళిపోతే చీకటి పడిపోతుంది. యుద్ధం కొనసాగించలేరు. శత్రువులు తప్పించుకొని వెళ్ళిపోతారు. శత్రుశేషం అత్యంత ప్రమాదకరం.

యుద్ధ శూరుడైన యెహోషువా "యెహోవా నామము" పేరట ప్రార్ధిస్తూ సూర్యచంద్రులను శాశిస్తున్నాడు.

ఓ సూర్యుడా! మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకొనే వరకు, నీవు గిబియోనులోనే వుండాలి. కదలడానికి వీల్లేదు.
ఓ చంద్రుడా! మేము చివరి శత్రువు మీద పగ తీర్చుకొనే వరకు నీవు ఆయ్యాలోను లోయలో  వుండాలి. కదలడానికి వీల్లేదు.

ఆ దినము ఒక మనుష్యుని ప్రార్ధన సృష్టి క్రమాన్ని నిలిపేసింది. సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు. ఎంతసేపు? ఒక దినమెల్లా, చివరి శత్రువును హతమార్చే వరకు.

ప్రపంచ చరిత్ర పుటల్లో ఆదినం నేటికీ చిరఃస్థాయిగా నిలచిపోయింది. దానికి కారణం 'ప్రార్ధన'.

ప్రార్ధించేవిధంగా ప్రార్ధించ గలిగితే? ప్రార్ధనతో సమస్తమూ సాధ్యమే.

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE - PRODDATUR*🙏

Comments