సాహసవంతమైన ప్రవక్త ఏలీయా

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Bible Sermons by Pastor NAKKOLLA BALASUBRAMANYAM (DANIEL)

*సాహసవంతమైన ప్రవక్త ఏలీయా*

యెహోవా ఏలీయా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు బ్రదికెను.
              1 రాజులు 17:22

బైబిల్ గ్రంధ చరిత్రలోనే ఒక  సంచలనాత్మకమైన అధ్యాయానికి తెర తీస్తున్నాడు ప్రవక్త యైన ఏలియా. దానికి ప్రార్ధననే ఆయుధముగా ఎంచుకున్నాడు.

సృష్టిలో ప్రధమంగా హేబెలు హత్య గావించబడడం ద్వారా, శారీరక మరణం భూమి మీద ప్రవేశించింది. ఆ తర్వాత లక్షలాదిగా పుడుతూనే వున్నారు. చనిపోతూనే వున్నారు. అప్పటి వరకూ చనిపోయిన వాడు తిరిగి బ్రతికిన సందర్భం లేనేలేదు.

అయితే, ప్రవక్త యైన ఏలియా సృష్టిలోనే ప్రధమంగా, చనిపోయిన బాలుని తిరిగి బ్రతికించడానికి పూనుకొంటున్నాడు. ఇది అత్యంత సాహసవంతమైన చర్య.

ఏలియా సారెపతు విధవరాలి ఇంట్లో ఆతిధ్యాన్ని పొందుతున్నాడు. యెహోవా మాట చొప్పున ఆ ఇంట్లో తొట్టెలోనున్న పిండి తక్కువ కావట్లేదు. బుడ్డిలోనున్న నూనె తరిగిపోవట్లేదు. ఆ అద్భుతాన్ని ఆమె కళ్ళారా చూస్తుంది, అనుభవిస్తుంది. ఇంతలో తన కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఈమెకు ఒక అనుమానం. గతంలో తాను చేసిన పాపములు ఏలియా దేవునితో చెప్పేసాడని. కాబట్టే, తన కుమారుని దేవుడు చంపేసాడని.

ఆమె ఏలీయాతో దైవజనుడా, నాయొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకముచేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా
              1 రాజులు 17:18

ఏలియాకి ఏమి చెయ్యాలో అర్ధంకాని పరిస్థితి.
కాకులతో సహితం నన్ను పోషించిన దేవుడు, ఈ పిల్లవానిని ఎందుకు బ్రతికించలేడు అనుకున్నాడేమో?

ప్రార్ధన అనే ఆయుధంతో అత్యంత సాహసవంతమైన యుద్ధానికి సిద్ధపడ్డాడు. మరణం తలవంచింది. జీవం తిరుగొచ్చింది. విశ్వాసవీరుడు ప్రార్ధనా ఆయుధంతో విప్లవాత్మకమైన విజయాన్ని సాధించి, సృష్టిలో నూతనమైన అధ్యాయాన్ని వ్రాసి, విజయ పతాకాన్ని ఎగురవేసి,
నిజదేవునికి సెల్యూట్ చేసాడు.

ఆమె అనుమానం పటాపంచలయ్యింది. నీ దేవుడే నిజమైన దేవుడు అంటూ, ఆయనను  సేవించే నీవు నిజదేవుని సేవకుడవంటూ కొనియాడింది.

ప్రపంచ చరిత్రలో 'చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికిన' ఈ మొట్ట మొదటి సంఘటన ఇశ్రాయేలు దేశములోగాని, యూదా జాతిలో గాని, జరుగలేదు. అన్యదేశములో విధవరాలి ఇంట జరిగించి, దేవుడు తన నిత్యమైన కృపను చాటుకున్నాడు.

మనము ఉపయోగించే ప్రార్ధనా బాణాలు ఎంత వాడిగలవైతే? అంత వాడిగా సమస్యల గుండెల్లోకి దికి వాటిని పటాపంచలు చేస్తాయి. పరిశుద్ధతతో వాటిని సిద్ధం చేసుకుందాం! విప్లవాత్మకమైన విజయాలు సాధిద్దాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR

Comments