ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు

"నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అనిఅతనికిభయపడుచున్నాను.
నీవు నేనునీకు తోడై నిశ్చయముగా మేలుచేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను."
           ఆది  32:11,12

యాకోబు అంటే 'మోసగాడు' అని అర్ధం. అన్నను, తండ్రిని మోసం చేసాడు. మామ చేతిలో, కుమారుల చేతుల్లో మోసపోయాడు.

"మోస పోకుడి, దేవుడు వెక్కిరింపబడడు; మనుష్యుడు ఏమివిత్తునో ఆ పంటనే కోయును"
                  గలతి 6:7

మోసం చేసి, మోసపోయిన యాకోబు ఒక దినాన్న దేవుని పాదాలచెంతకు చేరాడు. తన నిజజీవితాన్ని ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు.

ఇశ్రాయేలు అనగా? 'దేవునితో పోరాడు వాడు' అని అర్ధం.

దేవునితో పోరాడి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రాలకు మూల పురుషుడయ్యాడు.అతని పేరు ఒక దేశానికే పెట్టబడింది. అంతటి భాగ్య వంతుడయ్యాడు.

ఇంటి నుండి పారిపోయిన యాకోబు 20 సంవత్సరాల తర్వాత తన పిల్లలు, తనకి కలిగిన ఆస్థినంతటిని తీసుకొని వాగ్ధాన భూమికి తిరిగి వస్తున్న సందర్భమది.

యబ్బోకు రేవు దగ్గరకి వచ్చేసరికి చెప్పలేనంత భయం ప్రారంభమయ్యింది. ఎందుకంటే? అన్నను మోసంచేసి ఆశీర్వాధాలన్నీ పొందుకున్నాడు. ఇప్పుడు అన్న కక్షగట్టి తనను, తనకు కలిగిన వాటన్నిటిని నాశనం చేసేస్తాడెమో అనే భయం.

ఆ సందర్భములో దేవుడు తనకి ఒక దినాన్న ఇచ్చిన వాగ్దానంను  "నీవు నేనునీకు తోడై నిశ్చయముగా మేలుచేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే" అంటూ దేవుడు తనకిచ్చిన వాగ్ధానమును   ఎత్తిపట్టుకొని ప్రార్దిస్తున్నాడు.
ఇట్లాంటి అనుభవాన్ని మనము కలిగి యుండాలి. వాగ్ధానమును ఎత్తిపట్టుకొని ప్రార్ధించాలి.

ఇదెప్పుడు సాధ్యం?
1. ఆ వాగ్దానములను మనము నమ్మినప్పుడు.
2. ఆ వాగ్దానములను దేవుడు మన జీవితంలో నెరవేర్చగల సమర్ధుడు అని విశ్వసించినప్పుడు.

ఇంతకీ దేవుడు మనకు వాగ్ధానములను ఎట్లా ఇస్తాడు?
పరిశుద్ధ గ్రంధం వాగ్దానముల పుట్ట. దానిని ధ్యానం చేస్తున్నప్పుడు, కొన్ని వాక్యములు నీ హృదయాన్ని హత్తుకొని నిన్ను ఆదరిస్తాయి. కొన్ని సరి చేస్తాయి, మరికొన్ని నిన్ను బలపరుస్తాయి. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నదే దేవుడు నీకిచ్చిన వాగ్దానం.

ప్రతీ వాగ్దానానికి ఒక షరతు తప్పనిసరిగా వుంటుంది. దానిని నెరవేర్చగలిగితే? దేవుని వాగ్దానం నీ జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది.

ఉదాహరణకు:
'నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
          మలాకి 3:10

వాగ్దానం: నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను.
షరతు: దశమ భాగము తప్పక చెల్లించినప్పుడు

శత్రువుగా మారిన తన అన్న అయిన ఏశావు నుండి రక్షించమని వాగ్ధానమును ఎత్తిపట్టి ప్రార్దిస్తున్నాడు యాకోబు. తన ప్రార్ధనకు జవాబుగా శత్రువుగా మారిన తన అన్నను మిత్రునిగా చేసేసాడు దేవుడు.

"ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి."
               ఆది 33:4

ఈ పరిస్థితిని యాకోబు కలలో కూడా ఊహించుకొని ఉండడు. అవును! ఆయనకు సమస్తమూ సాధ్యమే.

నీ జీవితంలో శత్రువులుగా మారిన సమస్యలు నీకు భయాన్ని పుట్టిస్తున్నాయా? భయపడకు. పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించి, దేవుని వాగ్ధానాలను ఎత్తిపట్టుకొని ప్రార్ధించు. తప్పక పొందుకుంటావు.

యాకోబు దేవుడు అప్పుడు ఎంత శక్తిమంతుడో, ఇప్పుడునూ అంతే శక్తిమంతుడు.

ప్రార్ధిద్దాం! పొందుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments