భారత్ లో మొట్టమొదటి అతి పురాతనమైన చర్చ్ మాలబరో సెయింట్ థామస్ కెథడ్రల్
దీన్ని అపొస్తలుడైన తోమా క్రీ.శ.52లో నిర్మించాడు.
ఈ చర్చ్ గురించి తెలుసుకోవలాంటే ముందుగా భారతదేశంలోకి క్రైస్తవ్యం ఏవిదంగా వచ్చిందో తెలుసుకోవాలి.
అపో.తోమా జీవితము గురించి క్లుప్తంగా....
యేసు క్రీస్తు 12 మంది శిష్యులలో ఒకడైన తోమా గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టువాడై ఉండెను. ఈయన తోమా దిదుమగా పిలువబడేవాడు. తోమా అను మాటకు అరామిక్ భాషలో కవలలు అని అర్థము. దిదుమ అను మాటకు గ్రీకు భాషలో కవలలు అని అర్థము. కాబట్టి తోమా కవల పిల్లలలో ఒకరు అని బైబిల్ పండితుల అభిప్రాయం. మరికొందరు యిది ఆయన బిరుదు అనియు, ఆయన అసలైన పేరు యూదా తోమా అనియు భావించుచున్నారు.
యోహాను తోమాకు బాల్యమిత్రుడు కావడం వల్ల తన సువార్తలో చాలా వివరంగా తోమా గురించి వ్రాసాడు.
మొట్టమొదటగా తోమాను గురించి యోహాను సువార్త 11:16 లో చూడగలం. యేసు లాజరును చూడగోరి యూదయ బయలుదేరుటకు తీర్మానించినప్పుడు, ప్రాణాపాయము సంభవించునని శిష్యులు సంశయించిరి. అప్పుడు యేసు లాజరు చనిపోయాడని స్పష్టంగా చెప్పాడు. “ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తోమా తనతో కూడా ఉండిన శిష్యులతో చెప్తాడు. యేసును వెంబడించినప్పుడు మరణము సంభవించినను ఆయనతో కూడా వెళ్ళవలెను అనే వాంఛ తోమా మాటలలో కనిస్తుంది. అంతేగాక యితడు అచంచల ధైర్య సాహసాలు గలవాడు, ఆత్మీయ త్యాగశీలి, క్రీస్తును ప్రేమించినవాడు, పూజించినవాడు, కానీ, ఆయన సందేహించు స్వభావము గలవాడుగా మనమందరమూ తోమాను చూస్తాము.క్రీస్తుకు అత్యంత సన్నిహితులైన పన్నెండుమందిలో ( వీరినే అపొస్తలులు అంటారు ) ఒకరైన తోమాను సందేహ ప్రాణి ( డౌటింగ్ థామస్ ) అని కూడా పిలుస్తారు.
తోమా ప్రశ్నవల్లనే యావత్ ప్రపంచానికి ప్రభువు నుండి అమూల్యమైన సందేశం లభించింది. యోహాను 14:1-4 లో క్రీస్తు తాను పరలోక రాజ్యమునకు వెళ్లి ఒక స్థలమును సిద్దపరచనై యున్నానని చెప్పెను. “నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.” అయితే తోమాకు ఏమియు అర్థము కాలేదు. అంతకు ముందు – నాయందు విశ్వాసముంచుడి అని క్రీస్తు చెప్పినను, సంపూర్ణ విశ్వాసముతో ఆయన మాటను తోమా అంగీకరించలేకపోయెను. “ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలగు తెలియును” అని అపనమ్మకంతో ప్రభువును అడిగాడు. అందుకు యేసు – “నేనే మార్గమును, సత్యమును, జీవమును.” అని చెప్పాడు.
సిలువ మరణం తర్వాత పునరుత్తానుడైన ప్రభువు శిష్యుల ముందు ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. తర్వాత తోమా వచ్చినప్పుడు ఈ పునరుత్థాన వార్తను విని, నమ్మక తన అపనమ్మికను వ్యక్తపరిచెను. “నేనాయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను” అని తన సందేహమును ఖండితముగా చెప్పెను.
ఎనిమిది దినములు అయిన తర్వాత శిష్యులందరూ కూడి ఉన్నప్పుడు ప్రభువు వారి మధ్య నిలిచి తోమానే పిలిచెను. అతడి సందేహాన్ని నివృత్తి చేశాడు.
ఆ చేతులలోని గురుతులను చూడగానే తోమా విశ్వాసియై ప్రభువు పాదాల యొద్ద “నా ప్రభువా, నా దేవా” అని మోకరిల్లిపోయాడు.
అలా నమ్మి అచంచలంగా నిలిచి అమోఘమైన సువార్త సేవ చేసాడు. స్థిరమైన విశ్వాసము కలిగి యితర శిష్యులకంటే ఎక్కువ దూరము పయనించి క్రీస్తు కొరకు మరణించేంత మనో ధైర్యమును కలిగి జీవించాడు.
తోమా సేవ :
మెసపతోమియానందున్న ఎడేస పట్టణములో తన సేవను ప్రారంభించిన తోమా అపోస్తలుడైన తద్దయితో కలిసి బబులోనుకు వెళ్ళెను. అటు తర్వాత తాను మాత్రము ఒంటరిగా పారశీక దేశమందున్న అబియాబెనిలో సేవ చేయుటకు వెళ్ళెను. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా దేశముల మధ్య జరుగుచుండిన వ్యాపారమును బట్టి పరస్పర సంబంధముండెను. యిదంతయు పారశీక దేశము మీదుగానే జరుగుచుండెను.
మన దేశమును గురించి వినిన తోమా బయలుదేరి భారతదేశానికి వచ్చెను. క్రీ.శ. 49 లో గాందారమును (పంజాబ్) పరిపాలించిన రాజైన సంద పోరస్ దగ్గర కట్టడ నిపుణునిగా(Construction Engineer) చేరెను. యువరాజైన ఘాట్ పొరస్ మరణించినప్పుడు తోమా యేసు నామంలో అతనిని తిరిగి బ్రతికించినందున సంద పొరస్ రాజు క్రీస్తును అంగీకరించెను.
తదనంతరం తోమా గాంధార సంఘమును శాంతియాస్ అను డీకన్(సంఘ కాపరి) చేతికి అప్పగించి, సోకోటిర అనే లంకకు వెళ్ళెను. అక్కడ నుండి క్రీ.శ. 52 లో వర్తక ఓడ ఎక్కి మలబార్ (కేరళ) సముద్ర తీరమందున్న గిరంగనూర్ లో దిగెను. అప్పుడు ముసిరీస్ అని పిలువబడిన ఈ ఓడరేవు కొచ్చిన్(చెన్నై ప్రాంతం) సమీపమున ఉండెను.
తోమా పాలూరు, గిరంగనూరు, పారూర్, కొకమంగళం, కాయల్, నిరణం, కొల్లం అను ఏడు స్థలములలో సంఘములను స్థాపించెను. ఈ సంఘములు తర్వాత మార్తోమా సంఘములు అనబడెను.
ఈ సంఘములను పరామర్శించుటకు యిద్దరిని అభిషేకించి వారికి భాద్యతలను అప్పగించిన తర్వాత తోమా తూర్పు తట్టు ప్రయాణము చేసెను. అనేక ప్రాంతములు తిరిగి అనేకులకు సువార్తను ప్రకటించి క్రీస్తులోనికి నడిపించెను. పాండ్య రాజులలో ఒకరిని క్రీస్తును వెంబడించుటకు నడిపించినట్లుగా చెప్పబడుచున్నది.
తర్వాత మన దేశపు తూర్పు దరికి చేరిన తోమా అక్కడ నుండి సముద్ర మార్గముగా చైనా దేశము వెళ్లి అక్కడ కొంత కాలము సువార్త పరిచర్య చేసెను. తరువాత తిరిగి మన దేశమునకు వచ్చి మద్రాసు పట్టణ ప్రాంతములో తన సేవను కొనసాగించెను.
మద్రాసు నడిబొడ్డు నుండి 10 కి.మీ. దూరానున్న సైదాపేట వద్ద చిన్నమలై కొండ ఉన్నది. తోమా సువార్త సేవకు ఈ కొండ కేంద్ర స్థానమై ఉన్నది. వేలాది మందికి పగలంతా వాక్య పరిచర్య చేసి, ప్రొద్దుపోయాక ఈ చిన్న గుహలోకి వెళ్లి ప్రార్ధనలో గడిపేవాడు. ఆ గుహ యిప్పటికి అలానే ఉన్నది.
తోమా వాక్యము వినడానికి వచ్చే వేలాది మందికి దప్పిక తీర్చే నిమిత్తం చేతి కర్రతో కొండను కొట్టి అక్కడ జలధరాను సృష్టించినాడు. సైదాపేటకు నేటికి ఈ ధార ఒక వర ప్రసాదమే. ఈ కొండ దిగువ పాదముద్ర ఉన్నది. ఈ ముద్ర తోమాదేనని కొందరి అభిప్రాయం.
హతసాక్షిగా తోమా....
ఆ నాడు కేరళలోని పలయూర్ ఒక బ్రాహ్మణ అగ్రహారం.
వారు నిత్యం తమ పూజా విధానాలలో భాగంగా సూర్యునికి అర్ఘ్యం(నీటిని పైకి వెదజల్లడం) ఇస్తూవుండేవారట.
వారు పైకి విసిరిన అర్ఘ్యం తాలూకు జలం తిరిగి క్రింద పడిపోతుండేదట. (ఎక్కడైనా సామాన్యంగా అలాగే జరుగుతుంది)
అదిచూసిన తోమా వారితో " మీ పూజలను మీ దేవుడు స్వేకరించడంలేదు. అందుకే నీరు క్రింద పడుతోంది. కాని మేము నమ్మిన దేవుడు దానిని స్వీకరిస్తారు అన్నాడు. కావాలంటే నిరుపిస్తాను." అని సవాలు విసిరాడు.
దానికి సరేనన్న బ్రాహ్మణుల ముందు తన చేతిలోని నీటిని గాలిలోకి విసరగా అవి అలానే నిలిచిపోయాయి.
దాంతో నిర్ఘాంతపోయిన బ్రాహ్మణులు నిజమైన దేవుడు క్రీస్తే అని క్రీస్తును అంగీకరించి తోమా వద్ద బాప్తీస్మం తీసుకోని క్రైస్తవులయ్యారు.
అలా నీరు కిందపడకుండా గాలిలో నిలబడిన స్థలమే నేటి తాలియకులం.
తమలో కొందరు మత మార్పిడి అయ్యారని తెలిసి దానిని జీర్ణించుకోలేని మిగిత బ్రాహ్మణులు పలయూరును "శాపకాడు"గా నిందించి అక్కడినుండి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు.
కొంతకాలానికి శిధిలమైన హిందూ దేవాలయం స్థలంలోనే చర్చిని నిర్మించారు.
పురాతన ఆలయ శిధిలాలలో కొన్నింటిని నేటికి ఇక్కడ చూడవచ్చు.
తదనంతర కాలంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నా, ప్రస్తుత మాలబరో సెయింట్ థామస్ చర్చ్ నిర్మాణాన్ని ఇటలీకి చెందిన ఫాదర్ ఫెనికో 1607 సంవత్సరంలో నిర్మించారు.
మైలాపూరులో తోమా చేసిన అద్భుతం దాన్ని బట్టి క్రీస్తుపై విశ్వాసముంచిన బ్రాహ్మణులను చూసిన కాళిక దేవి గుడి పూజారులు ఆయనను చంపుటకు పన్నాగములు పన్నిరి. మిస్థి అను రాజు కూడా వారికి తోడ్పడెను.
తోమా తన వాడుక చొప్పున మైలాపూర్ కొండ గుహలోకి వెళ్లి ప్రార్ధించుచుండగా పూజారులు వచ్చి తోమాను వెనకనుండి బల్లెముతో పొడిచారు. తీవ్రముగా గాయపడిన తోమా బహు ప్రయాసతో ప్రాకుతూ, ప్రస్తుతము “సెయింట్ థామస్ మౌంట్” అని పిలువబడుచున్న స్థలమునకు చేరి అక్కడ నాటబడియున్న సిలువను హత్తుకొని ప్రాణములు విడిచెను. ఇది చెన్నై నగరానికి 13 కి.మీ. దూరంలో మీనంబాకం విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్నది. క్రీ.శ. 72 వ సంవత్సరం జూలై 3 వ తేదీన తోమా మరణించినాడని చరిత్ర చెప్పబడుచున్నది.
తోమా చంపబడినప్పుడు వేలాది మంది కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పటి మైలాపూర్ రాజు మహదేవన్ తన కుమారుడు విజయన్ తో కలిసి ఆ చోటికి వచ్చి పరిశుద్దుడైన తోమా మరణానికి ఎంతో విలపించి బంగారు వస్త్రము చుట్టి మైలాపూరులోని శాంతోంకు తీసుకువెళ్ళి, తోమా తన స్వహస్తాలతో నిర్మించుకున్న చిన్ని చర్చిలో సమాధి చేయించారు. నేడును ఆ సమాధిని చూడవచ్చు. సమాధి రాళ్ళు మొదటి శతాబ్దానికి చెందినవని రుజువు పరచుచున్నవి.
క్రీ.శ. 394 లో తోమాగారి ఎముకలు ఎడిసన్ పట్టణమునకును, తర్వాత ఇటలీ దేశమందున్న వోర్ డోనాకును కొనిపోబడెను. ప్రస్తుతము ఇక్కడ పెద్ద చర్చ్ కట్టబడి యున్నది.
క్రీ.శ. 1552 లో పోర్చుగీసువారు మైలాపూరు చర్చ్ లో తోమా ఎముకలలో ఒకటి, మరియు ఆయనను చంపిన బల్లెము యొక్క మొనను చూచి వాటిని గోవాకు తీసుకొని వెళ్ళిరి.
(శాంతోం అనగా పోర్చుగీసు భాషలో సెయింట్ తోమా అని అర్థం. తోమా భారత దేశానికి వచ్చినప్పుడు మద్రాసు లేదు, మైలాపూరు మాత్రమే ఉన్నది.)
శిథిలమైన ఆ చర్చ్ యొద్ద 1893 నుండి 1896 వరకు కట్టబడిన పెద్ద చర్చ్ “శాంతోం కేతిడ్రాల్” అను పేరుతో నేడును మైలాపూర్ నందు కనబడుచున్నది.
అపోస్తలుడైన తోమా మరణించిన పెద్ద కొండలో క్రీ.శ. 1747 లో ఆయన ప్రార్ధించిన చిన్న కొండలో (లిటిల్ మౌంట్ ) క్రీ.శ. 1612 లో కట్టబడిన మందిరాలు నేడును మనకు కనబడుచున్నవి.
ఈ విధంగా తోమా యోధానుయోధుడుగా ఎచ్చటో ఉన్న బబులోను నుండి పరిశుద్దాత్మ నడిపింపుతో మన భారత దేశానికి వచ్చి యిచ్చట నాటిన పరిశుద్దాత్మ విత్తనాలు ఆసియా ఖండమంతటికీ ప్రాకి మహావృక్షం కావడానికి దోహదం చేసిన మహత్తర అపోస్తలుడు.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
"నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు." దానియేలు 12:3.
పలయుర్ సైరో - మలబార్ సేయింట్ థామస్ చర్చ్ - భారత దేశంలో తొలి మొట్ట మొదటి చర్చి.
భారత దేశ ప్రభుత్వం అపొస్తలుడైన తోమా గౌరవార్ధం రెండు తపాల బిళ్ళలను ప్రవేశ పెట్టినది.
భారత దేశంలో మొత్తం పదిహేడు సంవత్సరాలు జీవించిన తోమా ఏడు పూర్తి స్థాయి చర్చిలను, ఒక ప్రార్ధనా మందిరాన్ని నిర్మించాడు. ఆయన నిర్మించిన స్థలంలో ఉన్న ఒకేఒక్క చర్చి పలయూర్ లోవున్నదే.
మన దేశంలోని అత్యంత పురాతనమైన చర్చి కూడా ఇదే.
ఇక్కడ నలభై ఐదు అడుగుల సెయింట్ థామస్ విగ్రహం ఉంటుంది,ప్రక్కనే మ్యూజియం ఉంటుంది.
పలయూర్ చర్చి విశేషాలు
గురువాయూర్ కి మూడు కిలోమీటర్ల దూరంలో చవక్కాడ్ బీచ్ దారిలో పలయూర్ ఊరికి పడమర దిశలో ఉన్న చర్చి రెండు భాగాలుగా ఉంటుంది.
ఒక భాగంలో తాలియకులం, బోటు కులం,సెయింట్ థామస్ విగ్రహం, మ్యూజియం ఉంటాయి.
రెండో భాగంలో చర్చిఉంటుంది.
పడమర, దక్షినాలలో రెండు గేట్లు ఉంటాయి.
దక్షిణ ప్రవేశ ద్వారానికిరుప్రక్కలా ప్రాంగనంలో పదునాలుగు రాతి బొమ్మల రూపంలో థామస్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను చిత్రీకరించారు.
టవర్ లాగా నిర్మించిన భాగం తప్ప మిగిలిన నిర్మానమంతా కేరళా శైలిలోనే నిర్మింపబడినది.
పెంకులతో నిర్మించిన మండపంలో సెయింట్ థామస్ శిలువను ప్రతిష్టించారని చెబుతారు. దానికి గుర్తుగా అక్కడ ఒక స్థూపం లాంటి నిర్మాణం పైన శిలువను ఉంచారు.
సందర్శకులు ఇక్కడ ప్రార్ధనలు చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం చేస్తుంటారు.
ప్రధాన ప్రార్ధనా స్థలికి వెళ్ళే దారిలో టేకు చెక్కమీద బైబిల్ లో ఉదహరించిన ఘట్టాలను సుందరంగా చెక్కిన జూబ్లి డోర్ దర్శనమిస్తుంది.
డోమ్ లాగా నిర్మించిన పైకప్పు మీద వివిధ వర్ణ చిత్రాలను అందంగా చిత్రించారు.
లోపలి భాగంలో నలుపక్కల యేసు క్రీస్తు, మేరిమాత, సెయింట్ థామస్ మరియు ఇతర సెయింట్స్ మూర్తులను చక్కగా అమర్చారు.
శుభ కార్యాలప్పుడు, పర్వదినాలలో ప్రార్ధనలు చేస్తారిక్కడ.
పడమర వైపున పురాతన ఆలయ శిధిలాలు, చర్చి అధ్వర్యంలో నడుపుతున్న స్కూల్, చర్చి అభివృద్ధికి తోడ్పడిన ప్రముఖుల సమాధులను నిర్మాణాలు, పక్కనే మ్యూజియం కూడా వుంది, ఇక్కడ ఎన్నో చారిత్త్రాత్మిక వస్తువులు, సెయింట్ థామస్ వాడిన వస్తువులు ఉన్నాయి...
వీటన్నిటిని బట్టి తెలుస్తుంది ఏంటయ్యా అంటే క్రైస్తవ్యం అనేది భారతదేశంలో 200సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారివలన కాదు మొదటి శతాబ్దంలో నే క్రీస్తు శిష్యుడైన అపొస్తలుడు తోమా గారి ద్వారా వచ్చింది అనేది స్పష్టమవుతుంది. క్రైస్తవ్యన్ని స్వీకరించడం అంటే మతం మారడం కాదు నిజాదేవుణ్ణి తెలుసుకొని మనస్సు మార్చుకోవడం అని అర్ధమవుతుంది... క్రీస్తును స్వీకరించి క్రైస్తవుడైనప్పుడు ఎవ్వరు ద్వేషించిన ఎవ్వరు దూరమైన క్రీస్తు కొరకు క్రీస్తుల జీవించేవాడే నిజ క్రైస్తవుడు...
(Powered by)
Truth Research Center India
No comments:
Post a Comment