అతనికి ఎన్ని కష్టాలు వస్తే.. అంతగా పోరాడతాడు. ఎన్ని సమస్యలు ఉంటే అంతగా సత్తా చూపిస్తాడు

మనిషి చాలా చిత్రమైనవాడు. అతనికి ఎన్ని కష్టాలు వస్తే.. అంతగా పోరాడతాడు. ఎన్ని సమస్యలు ఉంటే అంతగా సత్తా చూపిస్తాడు. అందుకు ఉదాహరణ కావాలా! అయితే నిక్ ఉజికిక్ (Nick Vujicic) గురించి ఓసారి తెలుసుకుంటే సరి!

నిక్ 1982లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జన్మించాడు. కానీ పుట్టుకతోనే అతన్ని దురదృష్టం వెంటాడింది. tetra-amelia syndrome అనే అరుదైన వ్యాధి వల్ల చేతులే లేకుండా పుట్టాడు. కాళ్లు కూడా అంతంతమాత్రమే! నిక్ పుట్టినవెంటనే అతన్ని చూసి భయంతో తండ్రి బయటకు పరుగుతీశాడట. తనకి పుట్టిన బిడ్డ గురించి విన్న తల్లి, నాలుగునెలల వరకూ అతన్ని చూసే ధైర్యమే చేయలేదు. కానీ ఎంతైనా కన్న మమకారం కదా! ఇదంతా తమ ఖర్మ అనుకుని అతన్ని దగ్గరకు తీసుకున్నారు. ఏ లోటూ రాకుండా పెంచే ప్రయత్నం చేశారు.

తల్లిదండ్రులు కాబట్టి నిక్లో ఎలాంటి లోపం ఉన్నా భరించారు. కానీ బయటవారు అలా ఉండరు కదా! నిరంతరం తోటిపిల్లలు ఎగతాళి చేస్తూ ఉండేవారు, దారినపోయేవారంతా విచిత్రంగా చూసేవారు. ఈ ఛీత్కారాలన్నీ భరించలేక తన పదవ ఏటనే నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడు నిక్. అదృష్టవశాత్తూ ఆ ప్రయత్నం విఫలం అయ్యింది.

నిక్ జీవితం బహుశా ఇలాగే నిస్సారంగా గడిచిపోయేదేమో! కానీ అనుకోకుండా ఓ రోజు తనలాగే కాళ్లూచేతులూ లేని వ్యక్తి సాధిస్తున్న విజయాల గురించి పేపర్లో చదివాడు. అంతే! తనలోని నిరాశని పక్కకి పెట్టేశాడు. తోటివాళ్లతో పోటీపడుతూ చదువుకుని అకౌంట్స్లో డిగ్రీ సాధించాడు. తనంతట తానుగా ప్రతి పనినీ చేయగలగడం అలవాటు చేసుకున్నాడు. కాళ్లూ చేతులూ లేని తానే జీవితంలో స్థిరపడగలిగితే... ఇక మిగతావారు సాధించలేనిది ఏముంటుంది? అన్న ఆలోచనతో వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మారిపోయాడు.

నిక్ ఇప్పటివరకూ 50కి పైగా దేశాలు తిరుగుతూ లక్షలాదిమందిలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశాడు. అలాంటి ఓ సందర్భంలో నిక్ ఉపన్యాసం వినేందుకు వచ్చిన ఓ అందగత్తె అతని మీద మనసు పారేసుకుంది. వాళ్లిద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నిక్కు ఇద్దరు పిల్లలు. కేవలం ఉపన్యాసాలే కాదు... తన జీవితానుభవాలతో ఆయన Life Without Limits లాంటి పుస్తకాలు కూడా రాశాడు. ఆ ఒక్క పుస్తకమే 30కి పైగా భాషలలోకి అనువాదం అయ్యింది. సాధారణంగా ఎవరికన్నా తీరని కష్టం వస్తే, వాళ్లు దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ నిక్ అలా కాదు! భగవంతుని అతను మనస్ఫూర్తిగా నమ్ముతాడు.

నిక్కు కాళ్లూ చేతులూ లేవు కదా అని అతను ఏ పనీ చేయకుండా కూర్చుంటాడని అనుకోవద్దు. ఫుట్బాల్, గోల్ఫ్ లాంటి ఆటలు ఆడేస్తాడు; సముద్రపు లోతుల్లోకి వెళ్లి సర్ఫింగ్లో విన్యాసాలు చేస్తాడు. ‘మనం పనికిరానివారం అనుకోవడం ఒక పెద్ధ అబద్ధం’ అన్నది నిక్ మాట. ‘జీవితంలో ఏం చేయలేమో అన్న విషయం మీద దృష్టి పెడితే ఉపయోగం లేదు. ఏం చేయగలమో అన్న ఆలోచన మొదలైతే చాలా సాధించగలం,’ అన్నది అతని సూత్రం. ‘మిమ్మల్ని మీరు ప్రేమించిన రోజున ఏదైనా సాధ్యమవుతుంది. పడిన ప్రతిసారీ లేచినిలబడగలిగితే విజయం దక్కితీరుతుంది,’ అన్నది అతని నమ్మకం! ఆ నమ్మకమే అతన్ని ముందుకు నడిపిస్తోంది. లక్షలాదిమందిలో కొత్త ఆశలను నింపుతోంది.

Comments