BIBLE SERMONS by Pastor NAKKOLLA BALASUBRAMANYAM

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

*విశ్వాస సహితమైన ప్రార్ధన*

విశ్వాసము అంటే?
నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువు.
               హెబ్రీ 11:1

విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది.
1. దేనికొరకైతే ఆశతో ఎదురు చూస్తున్నామో? దానిని ఒక దినాన్న చూస్తాను అనే నమ్మకము.
2. కంటికి కనిపించనిది ఒకదినాన్న ప్రత్యక్ష మవుతుంది అనే నమ్మకం.

విశ్వాసం అంటే?
• చీకటిలోనికి దూకడం కాదు.
• గాలిలో మేడలు కట్టడం కాదు.
• దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి వుంది.
• నిజమైన విశ్వాసం దేవునిని గురించి మనుష్యులు చెప్పే ప్రతీ మాటను నమ్మదు.
• దేవుడు వెల్లడించాడు అని మనుష్యులు అనుకునే ప్రతీదానినీ స్వీకరించదు.
• పరిశుద్ధ గ్రంధంలో వెల్లడి అయిన సత్యాన్నే అది నమ్ముతుంది.

*నమ్మిక, విశ్వాసం ఒక్కటి కాదు.
•నమ్మడం కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం.
•నమ్మిక అనేది విశ్వాసంలోనికి నడిపించాలి.

బ్లాండిన్ అనే వ్యక్తి నయాగర జలపాతం మీద తాడుపై నడుస్తున్న సందర్భమది. ఆయన నడచుకుంటూ వస్తుంటే ప్రజలంతా జేజేలు పలికారు.
బ్లాండిన్ అంటున్నాడు నేను తిరిగి అవతలకు వెళ్లి పోగలను నమ్ముతున్నారా? అంతా అవును! నీవు వెళ్లి పోగలవు అంటున్నారు.

బ్లాండిన్ మరళా అంటున్నాడు నా భుజాల మీద ఒకరిని ఉంచుకొని వెళ్లి పోగలను నమ్ముతున్నారా? ప్రజలంతా ... అవును! మేము నమ్ముతున్నాం!

అయితే, మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి. అంతా నిశ్శబ్దం!!! ఎవ్వరూ ముందుకు రావట్లే.

కారణం?
చూచిన దానిని నమ్మగలిగారు. అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించ లేకపోయారు.

విశ్వాసం అంటే?
పూర్తిగా ఆధారపడడం!

దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసాడని నమ్ముతాము.
కాని, మన జీవితంలో ఎదురుపడే ఎర్ర సముద్రమువంటి ఆటంకాలను దేవుడు చీల్చి, దానిగుండా మన గమ్యానికి నడిపించగలడని విశ్వసించ లేకపోతున్నాం.

కారణం?
సమస్యను చూచి భయపడుతున్నాము తప్ప, ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవునిపైన ఆధారపడలేక పోతున్నాం! ఆయన శక్తిని అర్ధం చేసుకోలేక పోతున్నాం!

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
              హెబ్రీ 11:6

వర్షాల కోసం ప్రార్ధించడానికి మందిరంలో ప్రార్ధన ఏర్పాటు చేస్తే? ఒక చిన్నపాప గొడుగు తన వెంట తీసుకొని వెళ్లిందట. వచ్చేటప్పుడు తడుస్తూ రావాలని.

అవును! అట్లాంటి విశ్వాసంతో ప్రార్ధించాలి.

"ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును"             
            యాకోబు 1:6

మనము దేనినిమిత్తం ప్రార్దిస్తున్నామో అది తప్పక మన జీవితంలో నెరవేరుతుందనే విశ్వాసముతో ప్రార్ధించాలి. అట్లా కాకపొతే దేవుని శక్తిని తక్కువగా అంచనా వేసినట్లే. దేవుని శక్తిని చులకన చేస్తే? ప్రార్ధానా ప్రతిఫలాలు పొందలేము.

నీ విశ్వాసము సన్నగిల్లినప్పుడెల్లా,
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11 వ అధ్యాయము ధ్యానించు. అక్కడ విశ్వాస వీరులు ప్రత్యక్షమవుతారు. నీ విశ్వాసాన్ని రెట్టింపు చేస్తారు.

ఆ విశ్వాస వీరుల దేవుడే, మనమూ ప్రార్ధించే దేవుడు. అప్పుడు ఆయన ఎంతటి శక్తిమంతుడో? ఇప్పుడునూ అంతే శక్తిమంతుడు. ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా నున్నవాడు.

అవిశ్వాసముతో అడిగి ఆశీర్వాదాలు జారవిడువక, విశ్వాసముతో ప్రార్ధించి ప్రార్ధనాఫలాలు అనుభవించు.

అట్టి కృప, ధన్యత  దేవుడు నీకు అనుగ్రహించుగాక..!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments