BIBLE SERMONS BY PASTOR NAKKOLLA BALASUBRAMANYAM ( DANIEL)

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

*ఉపవాస ప్రార్ధన*

ఉపవాస ప్రార్ధన ఎందుకు చెయ్యాలి?
యేసయ్య చేసారు గనుక.

దేవుని కుమారుడైయుండి ఆయనే ఉపవాసం చేసారంటే? దానికి చెప్పలేనంత ప్రాధాన్యత వుండి తీరుతుంది. సందేహం లేదు.

*ఉపవాసం అంటే?
ఆహారం ఏమి తినకుండా, ప్రార్ధించడం. ఇది మన దృష్టిలో ఉపవాసం. కాని, పరిశుద్ధ గ్రంధం దీని అర్థాన్నే మార్చేసింది.

"నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ......
......అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నాననును."
              యెషయా 58:8,9

*ఒక్క మాటలో చెప్పాలంటే? నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించడమే సరియైన ఉపవాసము.

ఉపవాసం చేసే మనము మొట్టమొదట పవిత్రమైనభక్తి కలిగియుండాలి.

*పవిత్రమైన భక్తి అంటే?
తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించు టయు, ఇహలోకమాలిన్యము తనకంటకుండ తన్నుతాను కాపాడుకొనుటయునే.
                యాకోబు 1:27

పొరుగువారిని ఆపదలలో నున్నవారిని ఆదరిస్తూ, మనము లోకములోవుండాలిగాని
లోకము మనలో లేకుండా జీవించగలగాలి.

ఈ స్థితికి  చేరుకున్న తర్వాత ఆయన ప్రకటించిన
"ఉపవాస విధానం" చెయ్యగలగాలి.

మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారులవలె దుఃఖముఖులై యుండకుడి; తాము ఉపవాసము చేయు చున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖము లను వికారము చేసికొందురు; వారు తమ ఫలము పొంది యున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.
అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును
           మత్తయి 6:16-18

*ఉపవాసం చేస్తున్నప్పుడు అనుసరించ  వలసిన విధానం?

•వేషధారులవలే ఉండకూడదు
వేశ్యను అయినా ఆయన క్షమిస్తాడుగాని వేషధారిని  క్షమించడు.
•దుఃఖ ముఖముతో  వుండకూడదు.
ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడుపు చున్న నీముఖం  తేజోవంతముగా, ప్రకాశమానముగా వుండాలి.
•నీ  ఉపవాసం రహస్య మందున్న  దేవునికి మాత్రమే తెలియాలి.
కాని నేటి దినాలలో దీని విధానం మారిపోయింది. నీవు ఉపవాసము చేస్తున్నట్లు ఎవ్వరికీ తెలియకుండా, రహస్యముగా చెయ్యమని యేసు ప్రభువు వారు చెప్తే? మనమేమో,
" ఉపవాస ప్రార్ధనలు" అంటూ మైక్ లు పెట్టి మరీ చెప్పుకొంటున్నాము. బ్యానర్స్ పెట్టి పెద్ద హంగామా చేస్తున్నాము. మన ప్రార్ధన మనమేదో ప్రార్ధనాపరులమని చెప్పుకునే ప్రయత్నంలా వుందిగాని, ప్రార్ధనా లక్ష్యాన్ని చేధించేదిగాలేదు. ఆయన చెప్పిన విధానం యిదేనా?
క్రొత్త నిబంధనా విధానం దీనిని సమర్దిస్తుందా? ఆయన చెప్పినది చెయ్యకుండా, ప్రార్ధనా ఫలాలు ఆశించడం సమంజసంకాదు. సాధ్యం కూడా కాదు.

*ఇంతకీ ఎందుకు ఉపవాస ప్రార్ధన  అనేది ఆహారమేమి తీసుకోకుండా  చెయ్యాలి?
" మన దృష్టి, ధ్యానం ఆహారం,  ఇతర విషయాలజోలికి పోకుండా " దేవునిమీద మాత్రమే  కేంద్రీకరించబడే విధంగా" వుండడానికి.

ఉపవాస సమయం ఎట్లా గడపాలి? మొట్టమొదట ఆధ్యాత్మిక అవసరాలను గూర్చి ప్రార్ధించాలి.

దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసి కొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము
నీకాయాసకరమైన మార్గము నాయందున్న దేమో చూడుము నిత్యమార్గమున నన్ను నడిపింపుము.
       కీర్తనలు 139:23,24

ఆతర్వాత మన వ్యక్తిగత  అవసరాలను గురించి ప్రార్ధించాలి.

ఉపవాస ప్రార్ధన తప్పక విజయాలనిస్తుంది. ఆరీతిగా  ప్రార్ధించి ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం!

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments