*CHRIST TEMPLE-PRODDATUR*
*మనసుతో ప్రార్ధించే ప్రార్ధన*
"మనస్సుతోను ప్రార్థన చేతును"
1 కొరింది 14:15
మనకు పెదవులతో ప్రార్ధించడమే తెలుసు. కాని పౌలు గారు చెప్తున్నారు నేను మనసుతో ప్రార్దిస్తానని.
ఇది మనసును స్వాధీనములో వుంచుకొని ప్రార్ధించే ప్రార్ధన.
ఇది మన ఆధ్యాత్మిక స్థితి, మన ప్రార్ధనా అవసరతలపై ఆధారపడి వుంటుంది.
ఇది అత్యంత క్లిష్టమైన ప్రార్ధన. అదేసమయంలో అతి త్వరగా సమాధానం పొందుకోగలిగే ప్రార్ధన.
ప్రార్ధన చేస్తుంటాము. ఈ లోపు ఫోన్ రింగ్ అవుతుంది. ప్రార్ధన చేస్తూనే ఉంటాము కాని, ఆ ఫోన్ ఎవరు చేసి వుంటారబ్బా? అంటూ మన మనసు ప్రార్ధనను విడచిపెట్టేసి ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. ఎంత ప్రయత్నంచేసినా ప్రార్ధన ముందుకు సాగదు. ముందు ఆ మిస్సిడ్ కాల్ చూసుకో ఆ తర్వాత ప్రార్ధన చేద్దువులే అంటుంది మనసు. అంతే! అర్ధం పర్ధం లేకుండా అర్ధాంతరంగా ముగిసిపోతుంది మన ప్రార్ధన. ఫలితం శూన్యం.
ప్రార్ధించేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యాలి. లేదా సైలెంట్ మోడ్ లో పెట్టాలి. లేకపోతే ఆ సమయాన్ని సాతాను చక్కగా ఉపయోగించుకుంటాడు జాగ్రత!
ఎవరో ఒకరి కోసం ప్రార్ధిస్తూ ఉంటాము. ఆ సమయంలో మనసు ఆ ప్రార్ధించే వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుంది. మన ప్రార్ధన గురితప్పుతుంది. ఏమి ప్రార్దిస్తున్నామో మనకే అర్ధంకాదు.
"నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము"
ప్రసంగి 5:2
నీవు ప్రార్ధించేటప్పుడు నీ మనసును ఎక్కడోపెట్టి నోటికి వచ్చినట్లుగా ప్రార్ధించకూడదు. ఆ ప్రార్ధన దేవుని సన్నిధికి చేరదు.
ఒక MLA దగ్గరకు వెళ్ళాలి అంటే? అతనితో మాట్లాడే ఆ 5 నిమిషాలలో ఏమి మాట్లాడాలో ముందుగానే సిద్ధపడతాము.
అదే దేవుని సన్నిధిలో ప్రార్ధించేటప్పుడు మనకు ఏవి గుర్తుకు వస్తే వాటిని గురించి ప్రార్ధించి ఆమెన్ అంటాము. అట్లా కాకుండా, దేవునితో మాట్లాడాలి అని అనుకునేటప్పుడు ఏమి మాట్లాడాలో ముందుగానే సిద్ధపడాలి. మన మనసును మన స్వాధీనంలోనుంచుకొని ప్రార్ధించాలి.
మన మనసును మన స్వాధీనంలో వుంచుకొని ప్రార్ధించడం ఎట్లా?
ప్రార్ధించడానికి సిద్ధపడుతున్న మనకు ఒక తలంపు రావాలి. అదేమిటి అంటే? మట్టిలోనున్న నేను మహిమలోనున్న దేవునితో మాట్లాడబోతున్నానని.
ఈ లోకంలో ఒక చిన్న అధికారితో మాట్లాడడానికి భయపడిపోయే మనము, సర్వ సృష్టి కర్తను సమీపించడానికి సిద్ధపడే మనకు ఈ చిన్న తలంపు దేవుని పట్ల భయమును, ఆరాధనను పుట్టిస్తుంది. ఇక మనసు మన స్వాధీనంలో వుంటుంది. ప్రార్ధన గురితప్పదు. తప్పక ప్రతిఫలాన్ని తీసుకొనివస్తుంది.
అట్లా ప్రార్ధించే అనుభవాన్ని కలిగియుందాం!
ప్రార్ధనా ఫలాలను అనుభవిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments