BIBLE SERMONS BY PASTOR NAKKOLLA BALASUBRAMANYAM

🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

*నిష్కపటముతోచేయు ప్రార్ధన*

"తనకు మొఱ్ఱపెట్టువారి కందరికి తనకు నిజముగా మొఱ్ఱపెట్టువారి కందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. "
             కీర్తనలు 145:18

నిజముగా మొర్రపెట్టుట అంటే? నిజముకాని మొర్ర కూడా వుందన్నమాట.

నిజముగా అంటే?
నిష్కపటముగా, కపటములేకుండా.
మన హృదయంలో ఏముందో దానినే మాట్లాడడం.

"హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును"
               మత్తయి 12:34

అట్లా కాకుండా, హృదయంలో ఒకటి, పెదవులు మాట్లాడేది మరొకటయితే? అది నిజమైనది కాదు. కపటమైనది. మనలో ఎక్కువ శాతము దీనికే చెందినవారము.

నటించడంలో మనకు మనమే సాటి. హృదయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలావున్నా? పైకిమాత్రం షేక్ హ్యాండ్ లు, ప్రెయిజ్ ద లార్డ్ లు, వందనాలు. వీటికి మాత్రం లోటులేదు.

నటించి, వేరే వాళ్ళను నమ్మించగలము. ఎందుకంటే?
మన హృదయంలో ఏముందో వారికి తెలియదుగనుక.
కాని హృదయాంతరంగాన్ని ఎరిగియున్న దేవుని దగ్గర నటించి, ప్రార్ధించే ప్రయత్నం చేస్తే? మన ప్రార్ధన తేలిపోతుంది.

నీ హృదయంలో ఏముందో? దానినే ప్రార్ధించాలి. అయితే, ప్రార్ధించే ముందు నీ హృదయాన్ని సరిచూచుకోవాలి, సరిచేసుకోవాలి.

జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను.
                1పేతురు 3:10

జీవము అంటే?
యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును"
              యోహాను 14:6

జీవము అంటేనే? యేసు ప్రభువు.
ఆయనను ప్రేమించేవారు కపటమైన మాటలు చెప్పకుండా, పెదవులను కాచుకొనవలెను.

కపటమైన మాటలతో చేయు ప్రార్ధన దేవుడు అంగీకరించడు. మన ప్రార్ధన దేవుడు అంగీకరించి, ప్రతిఫలమివ్వాలి అంటే? కపటమైన మాటలు కాకుండా, ఆయనను నింపుకున్న హృదయంనుండి రావాలి.

అందుకే దావీదు ఇట్లా ప్రార్దిస్తున్నాడు.

యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుము నాప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవులనుండి వచ్చునదికాదు.
                కీర్తనలు 17:1

పెదవుల ద్వారా చేసే ప్రార్ధన కాదుగాని, మన హృదయాలు ఆయనకు సమీపముగావుండి ప్రార్ధించాలి.

"ప్రభువు ఈలాగు సెలవిచ్చియున్నాడు ఈ ప్రజలు నోటిమాటతో నాయొద్దకు వచ్చు చున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసికొని యున్నారు"
           యెషయా 29:13

నిజముగా ప్రార్ధించ గలిగితే? ఆయన మనకు సమీపముగానున్నాడు.
" ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు."                  
              అపో. కా. 17:27

"దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు"
            కీర్తనలు 46:1

నీ సమస్య ఏదయినా కావొచ్చు, నిజముగా, నిష్కపటముగా ప్రార్ధించగలిగితే? ఆయన నీకు ఆశ్రయమును, ఆపత్కాలములో సహాయకుడునై యున్నాడు.

మన ప్రార్ధనకు ప్రతిఫలం రావాలంటే? అది మన మీదే ఆధారపడి వుంది. మన ప్రార్ధనకు ప్రభువు చెవియొగ్గి, విని, జవాబు ఇచ్చేవిధంగా మన జీవితాలను సరిచేసుకొని ప్రార్ధిద్దాం!

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments