🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
*ఆసక్తితో చేయు ప్రార్ధన*
పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.
అపో. కార్యములు 12:5
పేతురు గారు చెరసాలలో వున్నారు. ఎప్పుడు తెల్లవారుతుందా పేతురును ఉరి తీసేద్దాం అన హేరోదు, శాస్త్రులు, పరిసయ్యులు అంతా ఎదురు చూస్తున్నారు. అట్లా జరగడానికి వీల్లేదని సంఘమంతా అత్యాసక్తితో ప్రార్ధిస్తున్నారు. వారికేమో ఆనందం. వీరేకేమో ఆందోళన.
అత్యాసక్తి అంటే? ఆసక్తిని మించినది.
అంటే? హృదయ పూర్వకమైన ప్రార్ధన.
అయితే, ప్రార్ధించే ఆ సంఘములో పరిపూర్ణమైన విశ్వాసమున్నట్లు కనిపించుటలేదు. ఎందుకంటే? పేతురు స్వరాన్ని గుర్తుపట్టిన ఆ చిన్నపిల్ల మాటలు వారు నమ్మేస్థితిలోలేరు.
అవును! కొన్ని సందర్భాలలో మన ముందున్న పరిస్థితులనుబట్టి విశ్వసించేతంత ఆధ్యాత్మిక స్థితి మనకు లేకపోవచ్చు. అట్లాంటి సందర్భాలలో హృదయపూర్వకంగా ప్రార్ధించే ప్రార్ధన నీ జీవితంలో తప్పక క్రియ జరిగిస్తుంది.
"ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమిమీద వర్షింపలేదు."
యాకోబు 5:17
ఏలియా మనవంటి స్వభావము కలిగినవాడే. మనవలే పాపములో పుట్టి, పాపములో పెరిగినవాడే. మనలాంటి భ్రష్ట స్వభావమే అతనికీ వుంది. కాని, సృష్టినే శాసించగలిగాడు. అతని శక్తి అతనిలో లేదుగాని, అతడు సేవించు చున్న దేవునిలోనే వున్నది. దేవుడిచ్చిన అద్భుతమైన ప్రార్ధనా ఆయుధాన్ని అంత శక్తివంతముగా వాడగలిగాడు.
ఇది మన జీవితంలోనూ సాధ్యమే. ఎప్పుడంటే? ఏలియా వలే మనము కూడా నీతిగా, పౌరుషంగా ఆయన కోసం జీవించ గలిగినప్పుడు.
ఎప్పుడు ఆసక్తితో, హృదయ పూర్వకంగా ప్రార్ధించ గలమంటే? మన హృదయంలో యేసుప్రభువు వారికి స్థానమున్నప్పుడు మాత్రమే సాధ్యం.
హృదయ పూర్వకంగా ప్రార్ధిస్తే శాంతి, సమాధానం, ఆశీర్వాదాలు మనలను తరుముకొస్తాయా?
చాలా సందర్భాలలో అట్లా జరుగకపోవచ్చు. వాటి కంటే ముందుగా సమస్యలు, శోధనలు, వేదనలు ఎదురుగా వస్తాయి.
ప్రార్ధించకముందే సంతోషంగా వుండేవాళ్లము. ఏ సమస్యలు ఉండేవి కావు అనే అభిప్రాయం కలుగుతుంది. అది కొంతవరకు నిజమే కావొచ్చు. ఎందుకంటే నీవు ప్రార్ధించడం లేదంటే? నీవు సాతాను రాజ్యంలోనున్నట్లే. ఆ సమయంలో శోధకుడు నీ జోలికి రావలసిన అవసరంలేదు.
ప్రార్ధించడం ప్రారంభించావు అంటే? వాడి రాజ్యానికి దూరం కాబోతున్నావు. కాబట్టి, తిరిగి వాడి రాజ్యంలో చేర్చుకోవాలని గర్జించు సింహమువలే వాడు నీమీద విరచుకొని పడతాడు. ఆ క్రమములో శోధనలు మరింత ఎక్కువయ్యే పరిస్థితి కలుగవచ్చు. నీతో ప్రార్ధనచెయ్యడం మాన్పించడానికి సాతాను చెయ్యని ప్రయత్నమంటూ వుండదు. అయిననూ, వాటన్నిటిని ఎదుర్కొని ప్రార్ధనలో ముందుకు సాగిపోవాలి.
మరొక అర్ధంకాని విషయం ఏమిటంటే? నీవు ప్రార్ధించిన దానికి అంతా వ్యతిరేకంగా జరుగుతుంటే? నీ ప్రార్ధనకు ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరస్తున్నాడు అని అర్ధం చేసుకోవాలి. అంతేగాని, ఆందోళనచెంది, ఆశల్ని విడిచిపెట్టేసి ప్రార్ధించడం ఆపెయ్యకూడదు.
చివరకు ప్రార్ధించడంలో పరిపూర్ణత సాధిస్తావు. ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. కృపాక్షేమము నీవెంటే వస్తాయి. నీ ఆనందానికి హద్దులుండవు. అది వర్ణనకు అందనిది. అనుభవించే నీకు మాత్రమే అర్ధమవుతుంది.
ప్రార్ధించు! ప్రతిఫలాన్ని అనుభవించు!
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక..!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
Comments