BIBLE SERMONS by PASTOR NAKKOLLA BALASUBRAMANYAM

🙏 *CHRIST TEMPLE-GROUP*🙏

*నీకు ఇష్టమైనది అనుగ్రహింపబడే ప్రార్ధన*

"నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. "
             యోహాను 15:7

మీకు ఏది ఇష్టమో అది అడగండి. అది మీకు అనుగ్రహించ బడుతుంది.
అయితే, మీకిష్టమైనది మీకు అనుగ్రహించబడాలి అంటే? ఒక షరతు వుంది.
అదేమిటంటే? దేవుని యందు మనము, మనయందు దేవుని మాటలు నిలిచి యుండాలి.

ఇదెప్పుడు సాధ్యం?
అనుదినం దేవుని వాక్యం ధ్యానం చేస్తూ, అనుసరిస్తూ, ఆయనకు ఇష్టం లేనివాటిని విడచిపెట్టి, ఇష్టమైనవి తప్పకుండా అనుసరిస్తూ జీవితంలో ముందుకు సాగినప్పుడు.

మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయు చున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.
        1యోహాను 3:22

అట్లా అని, దేవుని యందు మనము, మన యందు ఆయన మాటలు నిలిచియుంటే? మనము ఏది అడిగినా దొరుకుతుందా?
అవును! సందేహం లేదు.

అయితే, ఒక కోటి రూపాయలు కావాలని దేవుని అడిగితే? అనుగ్రహించ బడుతుందా?

నిజముగా మనయందు దేవుని మాటలు నిలచియుంటే? ఇట్లాంటి వాటిని అడగలేము. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమునకు మన జీవితంలో స్థానం వుండనే వుండదు.

నిజముగా మనయందు దేవుని మాటలు నిలిచి యుంటే? భూసంబంధమైన ఆశీర్వాదాలను గురించి కాదుగాని, పర సంబంధమైన ఆశీర్వాదములను గురించి ఎదురుచూచే వారిగా, వాటిని మాత్రమే కోరుకొనేవారిగా మనముంటాము.

మనము చేసే ప్రార్ధన 99 శాతము భూసంబంధమైన ఆశీర్వాదాలకే పరిమితం. పర సంబంధమైన ఆశీర్వాదాల ప్రస్తావనే మన ప్రార్ధనలో కనిపించడంలేదు.

•పాస్ పోర్ట్ కోసం
•వీసా కోసం
•పిల్లల కోసం
•వారి చదువులుకోసం
•వారి ఉద్యోగాలకోసం
•వారి పెళ్ళిళ్ళు కోసం
•మన ఆరోగ్యం కోసం
•అప్పులు తీర్చుకోవాలి
•ఇల్లు కట్టు కోవాలి
•సైట్లు కొనుక్కోవాలి.
ఇదే మన ప్రార్ధన.

క్షయమైన ఆశీర్వాదాల కోసమే ప్రాకులాడుతున్నాము గాని, అక్షయమైన, శాశ్వతమైన ఆ నిత్య రాజ్యమును గురించిన ప్రస్తావన మన ప్రార్ధనలో లోపిస్తుంది. నశించిపోతున్న ఆత్మలపట్ల భారం కరువవుతుంది.

కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.
          మత్తయి 6:33

మొట్టమొదట ఆయన రాజ్యము కోసము ప్రార్ధించు. అప్పుడు దానితో పాటుగా ఈ భూమి మీద నీకు కావలసిన అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.

ప్రార్ధించే విధానాన్ని మార్చుకుందాం!
ప్రతిఫలాలను పొందుకుందాం!

అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక..!

ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-GROUP*🙏

Comments