BIBLE SERMONS by PASTOR NAKKOLLA BALASUBRAMANYAM

🙏 *CHRIST TEMPLE-PRODDATUR* 🙏

*దేవుని చిత్తానుసారమైన ప్రార్ధన*

"ఆయననుబట్టి మనకు కలిగిన
ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే"
              1యోహాను 5:14

మనము ప్రార్ధించేటప్పుడు ' తండ్రీ! నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు' అని ప్రార్ధించాలి.

కాని మన ప్రార్ధన అట్లావుండదు. మనము ఏదయితే జరగాలని కోరుకుంటున్నామో? అట్లాగే జరిగితీరాలని ప్రార్దిస్తాము. మన ప్రార్ధన దేవునికే సలహాలు ఇచ్చేవిధంగా వుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే? మనమొక బాస్ వలే, ఆయనొక సర్వెంట్ వలే వ్యవహరిస్తాము. మన చిత్తమే నెరవేరాలని కోరుకొంటున్నప్పుడు, ఇక దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఎక్కడిది?

అయితే, మనకొక రహస్యం తెలియాలి. దేవుని చిత్తానికి అప్పగించి ప్రార్ధించ గలిగితే?మనకు ఏది అవసరమో అది తగిన కాలమందు తప్పక అనుగ్రహించ బడుతుంది.

ఇవన్నియు మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియును
              మత్తయి 6:32

మనకేమి కావలయునో మనకంటే ముందుగా ఆయనకే తెలియును. మనము పిండముగా రూపించబడక ముందే మనపట్ల పరిపూర్ణమైన ప్రణాళికను కలిగి యున్నాడు దేవుడు.

అడుగుడి మీకియ్యబడును.
వెదకుడి మీకు దొరకును,
తట్టుడి మీకు తీయబడును.
అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును,
తట్టువానికి తీయ బడును.
            మత్తయి 7:7,8

మనకు ఏమి కావాలో పరలోకపు తండ్రికి తెలుసట. అట్లాంటప్పుడు మన అవసరతలు గుర్తెరిగి ఆయనే అనుగ్రహించవచ్చు కదా? మరళా ఎందుకు అడగమంటున్నారు?

దానికి రెండు కారణాలు.
1. నీ ప్రార్ధనలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత వుందో? లేదో? చూడడానికి.
2. నీ ప్రార్ధన యదార్ధమైనదో? కాదో? తెలుసు కోవడానికి.

"గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొ మోనునకు ప్రత్యక్షమై నేనునీకు దేనినిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా"
          1రాజులు  3:5

సోలోమోను రాజుగా అభిషేఖం చెయ్యబడినప్పుడు, దేవుడు సొలోమోనుతో అంటున్న మాటలివి. రాజుకు ఏమికావాలో దేవునికి తెలియదా? తెలుసు. అయినప్పటికీ, సోలోమోను ఏది కోరుకుంటాడో చూడాలని దేవుని ఉద్దేశ్యం.

సోలోమోను ఈ విధంగా కోరుకున్నాడు.
"నాకు వివేకముగల హృదయము దయ చేయుము. సోలోమోను    చేసిన యీమనవి ప్రభువునకు అనుకూలమాయెను"
          1రాజులు 3:9,10

సోలోమోను చేసిన ప్రార్ధన దేవునికి అనుకూలమయ్యింది. కాబట్టే,
జ్ఞానముతో పాటు, ఐశ్వర్యమును, ఘనతను దేవుడు అనుగ్రహించాడు.

మన ప్రార్ధన కూడా ఆయనకు అనుకూలం కావాలి. అంగీకారయోగ్యం కావాలి. మన ప్రార్ధన దేవుని చిత్తానుసారముగా వుంటూ, యధార్ధతను కలిగి యుండాలి.

మనకు నివసించడానికి గృహము లేకపోతే దేవునిని అడగడంలో ఏమాత్రం తప్పులేదు. కాని, మూడు అంతస్తుల మేడ కావాలి అని అడిగితే, ఆ ప్రార్ధనలో యదార్ధత లేదు.

మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు.
             యాకోబు  4:3

మనము ప్రార్ధించవలసినది మన అవసరాల  నిమిత్తమేతప్ప, విలాసాలకొరకు కాదు.
అందుకే ఆయన అడగమంటున్నాడు. నీ యదార్ధత ఎంతో పరీక్షించడానికి.

ఆయన చిత్తానుసారముగా ప్రార్ధించి, ప్రార్ధనా ఫలాలు అనుభవిద్ధాము.
ఆ రీతిగా మన హృదయాలను సిద్ధ పరచుకొని ప్రార్ధిద్దాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏

Comments