🙏 *CHRIST TEMPLE-PRODDATUR*🙏
BIBLE SERMONS BY PASTOR NAKKOLLA BALASUBRAMANYAM(DANIEL)
*దేవుని మనసు మార్చిన హిజ్కియా ప్రార్ధన*
"నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించి యున్నాను; నేను నిన్ను బాగుచేసెదను.....
ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను."
2రాజులు 20:5,6
ప్రార్ధన ఎంత శక్తి వంతమయినదంటే? "దేవుని ప్రణాళికను సహితం మార్చగలదు"
హిజ్కియాకు మరణ శాసనం సిద్దపరచబడింది. అయితే హిజ్కియా ప్రార్ధన దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని సహితం మార్చగలిగింది. మరణ శాసనం జీవ శాసనముగా మార్చబడింది.
"యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచు కొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను."
2రాజులు 20:3
హిజ్కియా ప్రార్ధన దేవుని ఉద్దేశాన్ని మార్చడానికిగల కారణాలు ఏమిటి?
1. హిజ్కియా యదార్ధ హృదయుడు
"ప్రతీ పరిస్థితియందు దేవునికి నమ్మకముగా జీవించినవాడు".
యదార్ధత అంటే?
"నీవు నీ ఇంట్లోవున్నప్పుడు ఎట్లా సత్ప్రవర్తన కలిగి జీవించావో? .... అట్లానే నీ ఇంటికి చాల దూరముగా వుండి, నీవాళ్ళు కూడా ఎవరూలేని పరిస్తితులలో పాపం చెయ్యడానికి అన్ని పరిస్థితులు నీకు అనుకూలముగా వున్నప్పుడు సహితము వాటి జోలికిపోకుండా నీ ఇంట్లో ఉన్నట్లుగానే నీ ప్రవర్తనను కాపాడు కోవడం "యదార్ధత".
అట్లాంటి యదార్ధత నీకుందా?
2. హిజ్కియా సత్యమును అనుసరించిన వాడు:
సత్యము అంటే?
"ఆయన వాక్యమే సత్యము"
యోహాను 17:17
ఆ వాక్యాన్ని ధ్యానించే అలవాటు, ఆ సత్యాన్ని అనుసరించే జీవితం నీకుందా?
3. హిజ్కియా దేవుని దృష్టిలో అనుకూలముగా జీవించినవాడు
దేవుని పిల్లలుగా మనుష్యుల దగ్గర నటించ గలుగుతున్నాము. కాని, దేవుని దృష్టిలో మన జీవితం ఎట్లావుంది? మన ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారముగా వుందా?
4. హిజ్కియా దేవునికృప కొరకు ఎదురుచూచినవాడు.
కృప అంటే?
"అర్హత లేని వాడు అర్హునిగా యెంచబడడమే కృప"
నిత్య మరణమునకు తప్ప దేనికి అర్హత లేని మనలను ఆయన శిలువ మరణముద్వారా విడిపించి, తన పిల్లలుగా స్నేహితులుగా రాజ్యముగా యాజకసమూహముగా, చివరికి దేవుని దూతలకుసహితం తీర్పు తీర్చే వారినిగా మనలను నియమించాడు. అది కృప. ఆయనే కృప
ఆ కృప కొరకు ఎదురుచూసే అనుభవం, ఆ కృపనుబట్టి ఆయనను ఆరాధించే అనుభవం మనకుందా?
5.హిజ్కియా కన్నీటితో ప్రార్ధించినవాడు:
నీ కన్నీళ్లు తుడవబడాలంటే?
కన్నీటి ప్రార్దనే శరణ్యం.
హృదయం వేదనతో నిండిపోయిన సమయంలో నాకంటూ ఎవరూలేరు. నీవుతప్ప అని నిండుమనసుతో ఆయనమీద ఆధారపడి, ఆయన సన్నిధిలో మోకరిల్లినప్పుడు, నీ కన్నీళ్లు నీ ప్రార్ధనకు సమాధానాన్ని తీసుకువస్తాయి.
అట్లాంటి అనుభవం నీకుందా?
హిజ్కియా జీవించిన జీవితం, తానుచేసిన ప్రార్ధన, దేవుని ప్రణాళికను సహితం మార్చివేసి, మరణమునే వాయిదావేసి, మరొక పదిహేను సంవత్సరాలు ఆయషును తీసుకురాగలిగింది.
ఇట్లాంటి జీవితం జీవిస్తూ ప్రార్ధించగలిగితే? మనము కూడా అద్భుతమైన విజయాలు సాధించగలము.
అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!
🙏 *CHRIST TEMPLE - PRODDATUR*🙏
No comments:
Post a Comment